- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలుపును కాగితంగా మార్చింది.!
ప్రమాదకరమైన కలుపు మొక్కలను మహిళలకు ఆర్థిక వనరుగా మార్చేసింది సుష్మిత

దిశ, ఫీచర్స్: తమిళనాడులోని త్రిచీలో 25 ఏళ్ల ఎకాలజిస్ట్ సుష్మితా కృష్ణన్ "వాటర్ హైసింత్" అనే హానికరమైన కలుపు మొక్కను హ్యాండ్‌మేడ్ కాగితంగా మార్చి వందలమందికి ఓ మార్గం చూపిస్తోంది. ఈ కలుపేందంటే.. 14 రోజుల్లో మల్లా పెరిగి సరస్సులో జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తుందన్నమాట. అలాంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలను మహిళలకు ఆర్థిక వనరుగా మార్చేసింది సుష్మిత.
జీవ వైవిధ్యానికి ముప్పు..
త్రిచీలోని సరసులో హరిత ఆకులతో, ఊదా రంగు పుష్పాలతో "వాటర్ హైసింత్" అందంగా కనిపిస్తుంది. కానీ ఇదొక హానికరమైన జాతి. సరస్సులను అడ్డుకోవడం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం, తిరిగి వేగంగా పెరగడం దీని లక్షణం. బయాలజీ స్టూడెంట్ అయిన సుష్మితకు మొదట్నుంచీ జీవవైవిధ్యం, ఇకోసిస్టమ్ పట్ల ఆసక్తి ఎక్కువ. 2021లో "ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్"లో "ఇంటర్న్‌షిప్" చేస్తున్నప్పుడు ఈ హానికర జాతులపై దృష్టి సారించింది. "వాటర్ హైసింత్"ను కొందరు నీటిని శుద్ధి చేసే మొక్కగా భావిస్తారు. కానీ సుష్మిత అధ్యయనం ప్రకారం ఇదొక జీవవైవిధ్యానికి ముప్పు కలిగించే మొక్క.
21 కిలోమీటర్ల మేర..
"వాటర్ హైసింత్" వల్ల జీవవైవిధ్యానికి పొంచివున్న ముప్పు గురించి సుష్మిత పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. అది దాని జీవితకాలంలో 3,000 విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు 20 సంవత్సరాల వరకు నిద్రాణస్థితిలో ఉండగలవు. అనుకూల పరిస్థితుల్లో 7-14 రోజుల్లో పెరుగుతాయి. నీటి ఆక్సిజన్‌ను తగ్గించి నీటి ఇకోసిస్టమ్‌ను నాశనం చేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన కలుపు మొక్క త్రిచీలో దాదాపు 21 కిలోమీటర్ల మేర సరస్సులను ఆక్రమించిందని తెలుసుకుంది సుష్మిత. ప్రభుత్వం వర్షాకాలం ముందు దీనిని తొలగించే ప్రయత్నం చేస్తుంది కానీ కేవలం 2 కిలోమీటర్ల మేర మాత్రమే తొలగిస్తుంది.
జర్మనీలో పరిశోధన..
2024లో సుష్మితా "ఇంటర్నేషనల్ సస్టెయినబిలిటీ అకాడమీ ఫెలోషిప్" ద్వారా జర్మనీలోని హాంబర్గ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసింది. ప్రపంచవ్యాప్తంగా 12 మంది పరిశోధక విద్యార్థుల్లో ఇండియా నుంచి వెళ్లిన ఏకైక ప్రతినిధి సుష్మిత. వుడ్ కెమిస్ట్రీ ల్యాబ్‌లో ప్రొఫెసర్ బోడోసేక్‌తో కలిసి ఆమె "వాటర్ హైసింత్"ను కాగితం తయారీకి ఎలా వినియోగించొచ్చో పరిశోధన చేసింది. "వాటర్ హైసింత్"తో కాగితం తయారీకి కేవలం 6% సోడా అవసరమని చెక్క పల్ప్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువని తేలింది. భారతదేశానికి తిరిగి వచ్చి "నేషనల్ కాలేజీ"లో విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక మహిళలకు వర్క్‌షాప్‌లు నిర్వహించింది.
150 మంది మహిళలకు..
వాటర్ హైసింత్ ద్వారా చేతితో కాగితం ఎలా తయారుచేయాలో చెన్నయ్‌లోని వేలాచేరిలో 150 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. మొక్క కాండాలను సేకరించి ఎండబెట్టి, ఆల్కలీన్ ద్రావణంలో ఉడికించి ఫైబర్‌లను విడదీస్తారు. దీనిని నీరు, సహజ బైండర్‌తో కలిపి ఒక స్లర్రీ తయారు చేస్తారు. దీనిని మెష్ ఫ్రేమ్‌లపై పోసి నీరు వడకట్టి, సూర్యరశ్మిలో ఆరబెడతారు. కాగితం ఆకుపచ్చ రంగులో ఉంటుంది కానీ దానిపై రాయడం సులభం. 1 కిలో తడి హైసింత్‌తో 30 ఏ4 షీట్లు తయారవుతాయి. ఒక్కో షీట్ ఖర్చు రూ.2 కంటే తక్కువ. ప్రక్రియ మొత్తం 25 నిమిషాల్లో పూర్తవుతుంది.






