- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ విలేజ్‌లో ఫ్రీడమ్, క్రియేటివిటీకి నిదర్శనం.. యువ హృదయాలను దోచుకుంటున్న సోషల్ మీడియా
కంటెంట్ క్రియేటర్లుగా, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా గుర్తింపు పొందడానికి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందడానికి, ప్రచారం ద్వారా ఆదాయ మార్గానికి సోషల్ మీడియా ఉపయోగంగా ఉంటోంది.

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా.. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేసిన పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్ ఇది. సమాచార వ్యాప్తిలో వేగం, అభిప్రాయాలు పంచుకోవడానికి అనువైన తీరు, భావ ప్రకటనకు ఆంక్షలు లేని వైనం కారణంగా ప్రజలను, ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటోంది. అయితే నేపాల్‌లో దీనిపై నిషేధం విధించిన నేపథ్యంలో చాలా మందిలో చర్చకు దారితీస్తున్నది. అక్కడ జెన్ జీల నిరసనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంగా.. సోషల్ మీడియాకు అంత పవర్ ఉందా? అసలు యువతకు సోషల్ మీడియా అంటే ఎందుకంత ఇష్టం? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
వ్యక్తీకరణల వేదిక
సోషల్ మీడియా యువతను ఆకర్షించడం వెనుక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా జెన్‌జీలు, మిలీనియల్స్ దీనిపై ఎక్కువ ఆధారపడుతున్నారు. తమ జీవనశైలి, సోషలైజేషన్, క్రియేటివిటీ, గ్లోబల్ కనెక్టివిటీకి అనుగుణంగా ఉండటం యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నది. అలాగే సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూస్, ఎడ్యుకేషనల్ కంటెంట్, ఆన్‌లైన్ కోర్సులు యాక్సెస్ చేయడం వంటివన్నీ ఈజీ కాబట్టి జెన్ జీలు చాలా ఇష్టపడతారు. ఇన్‌స్టా గ్రామ్, ఎక్స్ (X), ఫేస్ బుక్ సహా పలు ఇతర సోషల్ మీడియా వేదికలు స్వీయ వ్యక్తీకరణకు వేదికలుగా ఉంటున్నాయి. దీంతోపాటు వినోదానికి, స్కిల్స్ నేర్చుకోవడానికి, రీల్స్ చేయడానికి, స్క్రోల్ చేయడానికి సోషల్ మీడియా చక్కటి వేదిక. తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.
సోషల్ కనెక్షన్స్
ఒకప్పుడు ప్రత్యక్ష ముఖ పరిచయం ఉన్న వ్యక్తుల మధ్యే పరిచయాలు, స్నేహాలు, సామాజిక సంబంధాలు చిగురించేవి. కానీ సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలోని ఎక్కడి వ్యక్తుల మధ్యనైనా అవి ఏర్పడే అవకాశం వచ్చింది. అవగాహనకు, అవకాశాలకు వేదికగా మారింది. దీంతోపాటు దూరంగా ఉన్న స్నేహితులు, కుటుంబంతో కనెక్ట్ అవ్వడం, కొత్త స్నేహాలు ఏర్పర్చుకోవడం, మెంటల్ హెల్త్ సపోర్ట్ గ్రూపులు, సామాజిక సంఘాలు, పార్టీలు, గ్రూపులు, కమ్యూనిటీల ఏర్పాటుకు సోషల్ మీడియా చక్కటి వేదిక. పైగా ఇందులో ఒక ప్రాంతానికో, దేశానికో చెందిన వారు అనే కాకుండా ప్రపంచంలోని అందరు వ్యక్తులు ఒక అంశంపై, అభిప్రాయంపై స్పందించే వీలుంటుంది.
క్రియేటివిటీ, సామాజిక మార్పు
యువత తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి, కంటెంట్ క్రియేటర్లుగా, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా గుర్తింపు పొందడానికి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందడానికి, ప్రచారం ద్వారా ఆదాయ మార్గానికి సోషల్ మీడియా ఉపయోగంగా ఉంటోంది. ఇక సామాజిక మార్పునకు కూడా గొప్ప వేదికనే చెప్పాలి. ఉదాహరణకు #MeToo, #BlackLivesMatter వంటి ప్లాట్‌ఫామ్‌లు ఎంతగా పాపులరో తెలిసిందే. అదే విధంగా పర్యావరణం, రాజకీయాలు, సంస్కృతి వంటి అనేక విషయాల్లో గ్లోబల్ అవేర్నెస్‌కు, ప్రచారానికి సోషల్ మీడియా వేదికగా ఉంటోంది. 2023 ప్యూ రీసెర్చ్ నివేదిక (Pew Research -2023) ప్రకారం 70% యువత సోషల్ మీడియాను వినోదానికి, స్నేహితులతో కనెక్ట్ కావడానికి, డిస్కస్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఇన్ఫర్మేషన్, ట్రెండ్స్, కెరీర్స్
సోషల్ మీడియా అనేక రకాల సమాచారానికి వేదికగా ఉంటోంది. తాజా వార్తలతోపాటు చరిత్ర, సంస్కృతి, సందర్భానుసార వార్తలు ఇందులో దర్శనమిస్తాయి. ఫ్యాషన్, మ్యూజిక్, టెక్నాలజీ, సైన్స్ వంటి ట్రెండ్స్‌కు తక్షణ యాక్సెస్ ఇస్తున్నది. యువత ప్రపంచ సంస్కృతిని, ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను తెలుసుకోవడానికి ఇదొక విండో లాంటిది. అలాగే అవకాశాలు, కెరీర్, కంటెంట్ క్రియేషన్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఆన్‌లైన్ బిజినెస్‌ల ద్వారా గుర్తింపు, ఆదాయం పొందే అవకాశం యువతను సోషల్ మీడియావైపు లాగుతోంది. అది ఎంత గొప్ప సిద్ధాంతం అయినా, ఎంత మంచి భావజాలం అయినా ఈ ఆధునిక కాలంలో సోషల్ మీడియా వేదికల్లో కనిపించకపోతే నిలబడే పరిస్థితి లేదు. అయితే సోషల్ మీడియా మరో విధంగా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కానీ అది ఉపయోగించుకునే తీరును బట్టి, సామాజిక అవగాహనను బట్టి ఆధారపడి ఉంటుంది.






