Banana leaves : అరటి ఆకుల ఇల్లు.. అక్కడంతా ఇదే ట్రెండ్..! ఉపయోగాలేంటో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2025-09-29 10:12:18  IST  )

తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడిగా, ఉబ్బరంగా అనిపిస్తుంది. దీంతో ఇండోనేషియాలోని గ్రామీణులు అరటి ఆకులలతో ఇండ్లు కట్టుకుంటున్నారు

Banana leaves : అరటి ఆకుల ఇల్లు.. అక్కడంతా ఇదే ట్రెండ్..! ఉపయోగాలేంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : అరటి ఆకుల్లో భోజనం చేయడం, శుభ కార్యాల్లో, పూజల్లో వాటిని అలంకరణకు వాడటం మీరు చూసే ఉంటారు. భారతీయ సంప్రదాయంలో ఇది ఆనవాయితీ కూడా. ప్రకృతి వైద్య నిపుణుల ప్రకారం ఈ ఆకుల్లో తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అయితే ఇండోనేషియాలో మాత్రం ఈ అరటాకులకు సంబంధించి మరో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అక్కడి సాధారణ ప్రజలు ఇంటిపైకప్పులకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇవి చల్లదనంతోపాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని భావిస్తున్నారు.

నిజానికి ఇండోనేషియా తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణానికి ప్రసిద్ధి. అంటే.. ఇక్కడ వేడి, తేమ రెండూ అధికంగానే ఉంటాయి. అప్పుడప్పుడూ వాటివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. సంవత్సరం పొడవునా ఇక్కడి ఉష్ణోగ్రతలు సాధారణంగా 25°C నుండి 35°C లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతుంటాయి. ఇండోనేషియాతోపాటు మలేషియా, భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సైతం ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వెదర్‌ను తట్టుకోవడానికి ఇండోనేషియాలోని గ్రామీణులు అరటాకుల ఇండ్లను నిర్మించుకుంటున్నారు.

తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడిగా, ఉబ్బరంగా అనిపిస్తుంది. దీంతో ఇండోనేషియాలోని గ్రామీణులు ఆ వాతారణాన్ని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలు వంటి వాటికి భిన్నంగా, సహజమైన పద్ధతుల్లో పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా అరటాకులను తమ గుడిసెలు లేదా చెక్క ఇండ్లకు పైకప్పు భాగంలో వాడుతున్నారు. అయితే ఇంటిపైకప్పు నిర్మాణాల్లో వాడే సాంప్రదాయ పదార్థాలతో పోలిస్తే, ఈ అరటాకులను వాడే పద్ధతి ఇంటిని 8°C వరకు చల్లబరుస్తుందని ప్రకృతి నిపుణులు అంటున్నారు. ఈ ఆకులు దట్టంగా, మైనపు లాంటి ఉపరితలాన్ని కలిగి ఉండటంవల్ల సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పిస్తాయి. మెటల్స్ లేదా టైల్స్‌తో పోలిస్తే తక్కువ వేడిని గ్రహిస్తాయి. కాబట్టి ఇండోనేషియాలోని గ్రామీణులు, కొండ ప్రాంతాల్లో నివసించేవారు ఇప్పుడు వీటిని అధికంగా వాడుతున్నారు.

వర్షాలు కురిసినప్పుడు వాటిపై నిలిచే నీటి బిందువులతో కలిసి అరటి ఆకులు ఒక విధమైన సుగంధాన్ని వెదజల్లుతాయి. దీంతో ఇంటి లోపల తాజాదనాన్ని అందిస్తాయి. వీటిలోని ఔషధ గుణాలు శ్వాస ప్రక్రియలో మేలు చేస్తాయని, నిద్ర నాణ్యతను పెంచుతాయని కూడా ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. పైగా ఎయిర్ కండీషనర్లకు బదులుగా ఇలాంటి సహజ వనరులను ఉపయోగించడం తక్కువ ఖర్చుతో కూడున్నదే కాకుండా, పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. దీంతో ఇండోనేషియన్ గ్రామాల్లో అరటాకుల ఇండ్లు ఒక కొత్త ట్రెండ్‌గా విస్తరిస్తూ నిరాడంబర జీవన శైలిని, పర్యావరణ హితాన్ని ప్రోత్సహిస్తున్నాయి. Link

Next Story