బాప్ రే.. ఆరేళ్లుగా ఆ కాలనీ నుంచి పిడికెడు చెత్త బయటకు రాలేదు

by Daayi Srishailam |

ఇలా చేస్తే అందమైన బృందావనం మీ సొంతం.

బాప్ రే.. ఆరేళ్లుగా ఆ కాలనీ నుంచి పిడికెడు చెత్త బయటకు రాలేదు
X

అసలే ఢిల్లీ పొల్యూషన్ సిటీ.

దానికితోడు ఇండ్లలో పోగయ్యే వ్యర్థాలు.

పరిసరాల అపరిశుభ్రత..

అనారోగ్య జన సముదాయాలు..

ఢిల్లీలో ఉండాలంటే ఆలోచిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితిని బాధ్యతగా తీసుకుంటే..

ఢిల్లీని లవబుల్ అండ్ లివబుల్ సిటీగా మార్చొచ్చు అని చిన్న ప్రయత్నం చేశారొక డాక్టర్.

కట్ చేస్తే.. ఇప్పుడదొక అందమైన బృందావనంగా తయారైంది.

- దిశ, ఫీచర్స్

సౌత్ ఢిల్లీలోని నవజీవన్ విహార్. ఒకప్పుడు చెత్తా చెదారంతో కళా విహీనంగా ఉండేది. దాంట్లో ఉండేది డబ్బున్నవాళ్లే అయినా వారికి పర్యావరణం గురించి పట్టింపు లేదు. అలాంటి పరిస్థితిలో ఆరేళ్లుగా ఈ కాలనీ నుంచి ఒక చెత్త సంచి కూడా పరిసరాల్లో పారేయబడలేదు. అంత కచ్చితమైన చెత్త నిర్వహణ జరుగుతోంది.

ఆరేళ్లుగా..

నవజీవన్ విహార్‌లో 280 కుటుంబాలు ఉంటాయి. ఉదయాన్నే వంట చేసుకోవడం.. పిల్లల్ని స్కూల్‌కి పంపించడం.. తర్వాత వాళ్లు ఆఫీస్‌కు పోవడం ఎప్పట్లాగే జరుగుతోంది. కానీ ఒక క్రమపద్ధతిగా సాగుతోంది. చెత్తను మూడు రకాలుగా నిర్వహించాలనేది ఈ కాలనీ నియమ నిబంధన. ఆ నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకుండా ఆరేళ్లుగా కొత్త దినచర్య కొనసాగుతోంది. పిల్లలయినా.. పెద్దలయినా.. ఎవరైనా చెత్తను సరిగా నిర్వహించాలంతే. తమ చెత్తను మూడు రకాలుగా విభజించి ఆరేళ్లుగా నవజీవన్ విహార్ నుంచి ఒక చెత్త సంచి కూడా ల్యాండ్‌ఫిల్‌కు చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఆలోచనలో మార్పు..

డాక్టర్ రూబీ మఖీజా.. నవజీవన్ విహార్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మార్పు మొదలైంది. పరిశుభ్రత లేకపోతే వచ్చే వ్యాధులు, అనారోగ్య సమస్యలేంటో ఆమెకు తెలుసు. తన వృత్తే పరిసరాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం కల్పించింది. సెక్రెటరీగా బాధ్యత స్వీకరించిన రోజే ఆమె చెత్తపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇంటింటికీ వెళ్లి చెత్త గురించి కొత్తగా చెప్పారు. వారి సందేహాలను తీర్చింది. చిన్న కాగితం ముక్క కూడా బయట పారేయొద్దని వీడియోలు.. సందేశాలు తయారుచేసి పంపి.. క్రమంగా కాలనీవాసుల ఆలోచనా విధానాన్ని మార్చేసింది.

పునర్వినియోగం..

రూబీ చేసిన ప్రయత్నం ఫలించి ఇప్పుడు కాలనీలో రోజూ 125 కిలోల కిచెన్ వేస్ట్ కంపోస్టుగా మార్చబడుతుంది. దీనిని గార్డెనింగ్స్‌లో వేసి వాటికి మరింత పచ్చందాలను తీసుకొస్తుంది. ప్లాస్టిక్.. కాగితం.. గాజు వంటి పొడి చెత్త రీసైక్లర్లకు వెళ్లగా బట్టలు.. ఫర్నీచర్.. గ్యాస్ సిలండర్లు వంటివి ట్రిపుల్ ఆర్ సెంటర్ ద్వారా దానం చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 30 టన్నులకు పైగా వస్తువులు ఎన్జీఓల ద్వారా పునర్వినియోగింపబడ్డాయి. అంతేకాదు.. కాలనీలో వర్షపు నీటి సేకర.. ట్యాప్‌లపై ఏరేటర్ల ద్వారా నీటిని ఆదా చేస్తున్నారు. అదనపు ఆహారాన్ని అవసరమైతే తీసుకోకుండా కమ్యూనిటీ ఫ్రిజ్ ఏర్పాటు చేశారు.

జీరో వేస్ట్ మోడల్

నవజీవన్ విహార్‌ను సందర్శిస్తే పచ్చని గార్డెన్స్.. శుభ్రమైన బాల్కానీలు.. శాంతియుత వాతావరణంతో ఒక బృందావనంలా కనిపిస్తుంది. ఇది చిన్న విషయంగానే అనిపించవచ్చు. కానీ ఇదొక అలవాటుగా అక్కడున్న చిన్నా పెద్దా అందరి జీవన విధానంలో భాగమై.. జీరో వేస్ట్ మోడల్ కాలనీగా మారింది. మిగతా కాలనీలకు ఆదర్శంగా నిలిచింది. నవజీవన్ విహార్‌లో ఇప్పటివరకు 17 టన్నుల ప్లాస్టిక్ రీసైకిల్ చేయబడింది. 3000 కిలోల ఈ-వేస్ట్ ల్యాండ్‌ఫిల్‌కు చేరకుండా నిరోధించబడింది. 30 టన్నులకు పైగా వస్తువులు దానం చేయబడ్డాయి. ఆరేళ్లుగా ఒక్క చెత్త సంచి కూడా ల్యాండ్‌ఫిల్‌కు చేరలేదు.

Next Story