- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంటున్న ఆ నగర ప్రజలు.. ఈ కాలంలోనూ సాధ్యమేనా?
Technology : ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంటున్న ఆ నగర ప్రజలు.. ఈ కాలంలోనూ సాధ్యమేనా?

దిశ, ఫీచర్స్ : మొబైల్ ఫోన్ లేకుండా, టీవీ చూడకుండా మీరు ఎంతకాలం ఉండగలరు? వామ్మో.. ఈ రోజుల్లో అదెలా సాధ్యం? అనే అంటారు దాదాపు ఎవరైనా! ఎందుకంటే జీవితంలో అవో భాగమైపోయాయి. విజ్ఞానం, వినోదం, సమాచార మార్పిడిలో ఇవి కీ రోల్ పోషిస్తున్నాయి. వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య ముఖ్యమైన కమ్యూనికేషన్‌గా మారుతున్నాయి. అందుకే వాటిని వినియోగించకుండా ఉండలేం.. కానీ ఓ నగరంలో మాత్రం ఉంటున్నారు. పైగా ఇక్కడ మొబైల్, టీవీ మాత్రమే కాదు, అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకమూ నిషేధమే. ఎందుకంటే.. దానికో కారణముంది అంటున్నారు నిపుణులు.
అసలు కారణం ఇదే..
ఆధునిక సాంకేతికతను ఇప్పుడందరూ వినియోగించుకుంటున్నారు. ఇక ఫోన్, టీవీ, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు వాడని ఇల్లంటూ దాదాపుగా ఉండదు. కానీ అమెరికాలోని వెస్ట్ వర్జినీయాలో గల గ్రీన్‌బ్యాంక్ నగర ప్రజలు మాత్రం వీటికి దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ సిటీ నేషనల్ రేడియో క్వైట్ జోన్‌లో ఉంది. అంటే ఇక్కడ మొబైల్ ఫోన్లు, వై-ఫై, టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్‌లు వంటి రేడియో తరంగాలను విడుదల చేసే గాడ్జెట్‌ల వాడకం అధికారికంగా నిషేధించబడింది. దీనికి ప్రధాన కారణం గ్రీన్‌బ్యాంక్ టెలిస్కోప్ (GBT). ప్రపంచంలోనే ఇది అతిపెద్ద స్టీరబుల్ రేడియో టెలిస్కోప్‌గా సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.
2001 నుంచే ప్రారంభం
అంతరిక్షంలోని గెలాక్సీలు, నక్షత్రాల నుంచి వచ్చే అతి సూక్ష్మమైన రేడియో సిగ్నల్స్‌ను గుర్తించడానికి, నేషనల్ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీ సంస్థ 2001లో గ్రీన్ బ్యాంక్ సిటీలో గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది. అంతరిక్షంలో13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న తరంగాలను సైతం గుర్తించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. అయితే ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి స్థానిక ప్రజలు వినియోగిస్తే వాటి నుంచి వెలువడే రేడియో తరంగాల కారణంగా గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్‌కు ఆటకం ఏర్పడుతుంది. అంతరిక్ష తరంగాలను గుర్తించడంలో శాస్త్రవేత్తలకు సమస్యలు ఎదురవుతాయి. అందుకని ఇక్కడ వాటిని పూర్తిగా నిషేధించారు. అయితే ఇటీవల వైర్‌లెస్ సిగ్నల్స్ మాత్రమే నిషేధంలో ఉంచి, వైర్డ్ ఇంటర్నెట్, కేబుల్ టీవీలు మాత్రం అనుమతించబడుతున్నాయి.
ఒక విధంగా మంచిదే..!
కాగా మొబైల్, టీవీలు వంటివి వివియోగించనందున గ్రీన్‌బ్యాంక్ నగర ప్రజలకు మరో రకంగా మేలు జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి ఉండదు. ప్రత్యక్షంగా కలిసి తరచుగా మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పుస్తకాలు, న్యూస్ పేపర్లు వంటివి చదవడం ఎక్కువ చేస్తుంటారు. ఈ విధమైన జీవన శైలి వీరిలో మానసిక, శారీరక ఆరోగ్యాలను మరింత మెరుగు పరుస్తోందని నిపుణులు అంటున్నారు.






