మా-బెహెన్.. గాలియా నహీ చలేగే! స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఊరు

by Javid Pasha |   (  Updated:2026-03-16 10:31:12  IST  )

సౌండాలా గ్రామంలో ఎవరైనా ‘మా-బెహెన్’ లాంటి పదాలు ఉపయోగిస్తూ స్త్రీలను అవమానించేలా తిట్లు(గాలియా) వాడితే వెంటనే రూ. 500 జరిమానా వేస్తారు

మా-బెహెన్.. గాలియా నహీ చలేగే! స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఊరు
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీలో ఎంత డెవలప్‌మెంట్ వచ్చినా, విజ్ఞాన శాస్త్రంలో దూసుకుపోతున్నా భారతదేశ సమాజంలో స్త్రీలపట్ల ఉన్న దృక్పథంలో పెద్ద మార్పులేవీ కనిపించడం లేదంటారు సామాజిక వేత్తలు. ఇప్పటికీ పితృస్వామ్య లేదా పురుషాధిక్య భావజాలమే అధికంగా రాజ్యమేలుతోంది. మాటల్లో, చేతల్లో, సంస్కృతీ సంప్రదాయాల్లో అది కనిపిస్తూనే ఉంటుందని, ఒక విధంగా స్త్రీలను అణచివేసేందుకు, అవమానించేందుకు ప్రయత్నిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అలాంటి వాటిలో తిట్లు కూడా ఒకటి. మీరెప్పుడైనా గమనించే ఉంటారు, ఇతరులను తిట్టడానికి ఉపయోగించే పదాల్లోనూ స్త్రీలను అవమానపరుస్తుంటారు. పురుషులను తిట్టడానికి కూడా సంబంధం లేకపోయినా సరే స్త్రీలను మాటల్లోకి లాగుతుంటారు. ‘అమ్మ, అక్క, చెల్లి’ వంటి పదాలు ఉపయోగిస్తుంటారు. ఒక విధంగా ఈ ‘మా బెహెన్’ సంస్కృతి తిట్లల్లో సర్వసాధారణమైనదిగా మార్చేసింది పురుషాధిక్య సమాజం. కానీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెడుతోంది భారతదేశంలోని ఒక గ్రామం. ఇంతకీ అదే ఊరు? ఏం చేసింది?

ఎందుకీ ధోరణి?

ఎవరైనా మిమ్మల్ని అసభ్యంగా, అవమానకరంగా తిడితే ఎంతలా ఫీలవుతారో.. మీరు తిట్టినప్పుడు అవతలి వారు కూడా అలాగే ఫీలవుతారు. ఎవరి బిహేవియర్ అయినా మీకు అసహ్యంగా అనిపిస్తుందో.. అలాంటి బిహేవియర్ మీలో కనిపించినా.. అవతలి వ్యక్తులకు అసహ్యంగానే అనిపిస్తుంది. ఇది గ్రహించి క్రమశిక్షణగా మసలుకుంటే సమస్యే ఉండదు. కానీ మన సమాజంలో చాలామంది అలా చేయరు. అందుకు చక్కటి ఉదాహరణే ఇతరులను తిట్టే విధానం. చాలామంది ఇప్పటికీ ఇతరులను తిట్టే సందర్భంలో కేవలం ఆ తిట్టబోయే వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయరు. అతని/ఆమె కుటుంబాన్ని, అమ్మను, భార్యను, చెల్లిని కూడా అవమానించేలా ‘మా బెహెన్’ అని మాట్లాడుతుంటారు. ఇది తరతరాలుగా స్త్రీ అణచివేతకు సంబంధించి సమాజంలో నాటుకుపోయిన పురుషాధిక్య భావజాలపు దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని స్త్రీవాదులు, సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు. కానీ మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలోగల సౌండాలా గ్రామం స్త్రీలను అవమానించే ఈ తిట్ల సంస్కృతికి అడ్డుకట్టవేసి, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

₹500 జరిమానా!

సౌండాలా గ్రామంలో ఎవరైనా ‘మా-బెహెన్’ లాంటి పదాలు ఉపయోగిస్తూ స్త్రీలను అవమానించేలా తిట్లు(గాలియా) వాడితే వెంటనే రూ. 500 జరిమానా వేస్తారు. మళ్లీ అదే పదం వాడితే మళ్లీ జరిమానా వేస్తారు. ఈ నియమాన్ని ఇక్కడి గ్రామస్తులు 2024, నవంబర్‌ నుంచి పాటిస్తన్నారు. అప్పట్లో గ్రామ సర్పంచ్ శరద్ అర్గడే ప్రతిపాదనతో గ్రామ సభలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సాధారణ గొడవల్లో, హాస్యభరితమైన మాటల్లో కూడా తరచుగా ‘మా బెహన్ గాలియా’ అంటే.. ‘తల్లి.. సోదరి’ వంటి పదాలను ఉపయోగిస్తూ అసభ్యంగా మాట్లాడటం పెరిగిపోవడంతో గ్రామంలోని మెజార్టీ స్త్రీలు, పెద్దల అభిప్రాయం మేరకు ఈ అద్భుతమైన నియమాన్ని తీసుకున్నారు. గ్రామ సభలోనూ చర్చించి, జరిమానా విధించేలా నిర్ణయం తీసుకొని స్త్రీల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని నిలబెడుతున్నారు. వారిపట్ల ఉన్న అణచివేత దృక్పథాన్ని అడ్డుకోగలుగుతున్నారు.

స్త్రీల ఆత్మగౌరవ సందేశం!

నిజానికి ‘మా-బెహన్’ అంటూ ఇతరులను తిట్టేవారు తమ సొంత కుటుంబంలోని స్త్రీలను కూడా అవమానించినట్టే కదా అంటున్నారు సౌండాలా గ్రామస్తులు. అందుకే తమ ఊరిలో స్త్రీలను అవమానించే తిట్లు, ప్రవర్తన, ఇతర చర్యలు నిషేధించారని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ ఊరిలో ‘తల్లి, సోదరి, భార్య’ వంటి పదాలను ఉపయోగిస్తూ స్త్రీలను అవమానించే తిట్లను అరికట్టడానికి సీసీటీవీలు, పబ్లిక్ బ్యానర్లు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ. 500 జరిమానా కొందరికి చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ స్త్రీలపట్ల ఆ గ్రామానికున్న ఎనలేని గౌరవాన్ని చాటి చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. సమాజంలో నైతిక విలువలు, సమానత్వం, ఆత్మగౌరవం ముఖ్యమని, స్త్రీలపట్ల వివక్ష తగదనే సందేశాన్నిచ్చేలా సౌండాలా గ్రామం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

Next Story