ఏ ఇంటిలో ఆడపిల్ల పుట్టినా పండుగే అక్కడ.. గ్రామస్తులంతా ఏం చేస్తారంటే..

by Javid Pasha |

అక్కడ ప్రతీ ఆడపిల్ల పుట్టుకను ఒక పండుగలా జరుపుకుంటారు. ఆ పాప గౌవార్థం గ్రామస్తులందరూ కలిసి ఏకంగా 111 మొక్కలను నాటుతారు.

ఏ ఇంటిలో ఆడపిల్ల పుట్టినా పండుగే అక్కడ.. గ్రామస్తులంతా ఏం చేస్తారంటే..
X

దిశ, ఫీచర్స్ : ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే పెదవి విరిచేవారు అక్కడక్కడా ఇప్పటికీ ఉన్నారు. కానీ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని పిపలాంత్రి గ్రామం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావించే సమాజంలో, ఈ గ్రామం సరికొత్త సంప్రదాయానిక శ్రీకారం చుట్టింది. ఇక్కడ ప్రతీ ఆడపిల్ల పుట్టుకను ఒక పండుగలా జరుపుకుంటారు. అంతేకాకుండా ఆ పాప గౌవార్థం గ్రామస్తులందరూ కలిసి ఏకంగా 111 మొక్కలను నాటుతారు. ఈ అద్భుతమైన మార్పు వెనుక శ్యామ్ సుందర్ పలివాల్ అనే ఆ ఊరి మాజీ సర్పంచ్ కృషి ఉందని చెబుతారు. ఆయన తన కుమార్తె కిరణ్ అకాల మరణం తర్వాత ఆమె జ్ఞాపకార్థం గ్రామస్తులందరితో కలిసి మొక్కలు నాటడాన్ని ఉద్యమంగా ప్రారంభించాడు. అదే నేడొక సామాజిక విప్లవంగా మారింది.

భవితకు భరోసా..

పిపలాంత్రి గ్రామంలోని ఈ సంప్రదాయం కేవలం మొక్కలు నాటడంతోనే ఆగిపోదు. గ్రామంలో పుట్టిన ఆడ పిల్ల భవిష్యత్తుకు పూర్తి భరోసాను సైతం కల్పిస్తున్నది. ఏ విధంగా అంటే.. పాప పుట్టినప్పుడు గ్రామస్తులు, పాప తల్లిదండ్రులు కలిసి రూ.31,000 మొత్తాన్ని సేకరించి బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఆ పాపకి 20 ఏళ్లు వచ్చే వరకు ఆ డబ్బును తీయకూడదనే నిబంధనను అమలు చేస్తారు. అలాగే ఆడపిల్లకు సరైన విద్యను అందిస్తామని, చట్టబద్ధమైన వయస్సు రాకముందే వివాహం చేయబోమని తల్లిదండ్రుల నుంచి అఫిడవిట్ కూడా తీసుకుంటారు గ్రామస్తులు. దీనివల్ల ఆ ఊరిలో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. మహిళా అక్షరాస్యత పెరిగింది. గ్రామస్తులందరూ ఒక్కటై, ఒకేమాట మీద ఇవన్నీ అమలు చేయడంతో పిపలాంత్రి ఇప్పుడు దేశంలోనే ఒక ఆదర్శనీయమైన నమూనాగా నిలిచిందని చెబుతుంటారు.

ప్రకృతి సంరక్షణ, స్వయం ఉపాధి

ప్రకృతి సంరక్షణలోనూ పిపలాంత్రి గ్రామస్తులు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ ఊరిలో 3.5 లక్షలకు పైగా నాటిన మొక్కలు పెద్ద పెద్ద చెట్లుగా ఎదిగాయి. వీటికి చెదపురుగులు పట్టకుండా వాటి చుట్టూ పెద్ద ఎత్తున కలబంద మొక్కలను పెంచుతున్నారు. ఇది గ్రామ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తోంది. స్థానిక మహిళలు ఈ కలబంద నుంచి జ్యూస్‌లు, జెల్‌లు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఒక తండ్రి తన కుమార్తెపై చూపిన ప్రేమ, నేడు గ్రామం మొత్తాన్ని పచ్చదనంతో నింపడమే కాకుండా ఆడ పిల్లలను సమాజంలో ఉన్నతంగా, గౌరవంగా నిలిపేలా గొప్ప మార్పును తీసుకు వచ్చి ఆదర్శంగా నిలిచింది.

Next Story