విమానాల ఆపరేషన్స్‌లో.. గోల్డెన్ గర్ల్ పూనమ్.!

by Daayi Srishailam |

ఒక చిన్న క్షణం ఆమె జీవితాన్నిలా మార్చింది.

విమానాల ఆపరేషన్స్‌లో.. గోల్డెన్ గర్ల్ పూనమ్.!
X

దిశ, ఫీచర్స్: 7000 గంటల వైమానిక వృత్తి అనుభవంతో ఆకాశంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇప్పుడామె డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)లో ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్‌గా విమానాల సురక్షిత ఆపరేషన్‌లను పర్యవేక్షిస్తోంది. ఒక చిన్న క్షణం ఆమె జీవితాన్నిలా మార్చింది.

పైలట్ కావాలనే కల..

భోపాల్‌లో ప్రతీ సాయంత్రం ఒక ప్రత్యేకమైన వాతావరణంలో గడుస్తుంది. ఇళ్ల టెర్రస్‌లపై కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ముచ్చట్లు పెడుతుంటారు అక్కడి ప్రజలు. కిచెన్ల నుంచి వచ్చే వంటల ఘుమఘుమల మధ్య వారి జీవితం సాగుతుంది. అలాంటి ఒక సాయంత్రంపూట ఆకాశంలో విమానం ఎగురుతుంటే.. పూనమ్ మనసులో ఒక కల ఏర్పడింది. ఆ విమానం ఎక్కడి నుంచి వచ్చింది.? ఎక్కడికి వెళుతోంది.? అసలెలా ఎగురుతోంది.? అనే ప్రశ్నల పరవళ్లు తనలో పైలట్‌గా మారాలనే ఆశను ప్రేరేపించాయి.

సోదరుడే స్ఫూర్తి..

పైలట్ కావాలని ఇంట్లో చెప్పినప్పుడు "మనకు ఇలాంటి కలలు కనడం అసాధారణం" అని అన్నారు పేరెంట్స్. వాస్తవానికి తన కుటుంబ పరిస్థితేం బాగాలేదు. తన సోదరుడు విజయ్ దేవ్‌రఖ్యానీ 98 శాతం లోకోమోటర్ డిసేబిలిటీ, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుటున్నాడు. డబ్బంతా అతడి చికిత్సకే ఖర్చయింది. అయినప్పటికీ విజయ్ ధైర్యం పూనమ్‌కు స్ఫూర్తినిచ్చింది. అతడు హైయెస్ట్ జిప్‌లైన్ చేసిన లోకోమోటర్ డిసేబిలిటీ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. "ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్", "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్", "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌"లో స్థానం సంపాదించాడు.

పైలట్ కల సాకారం..

ఆర్థిక భారాన్ని తగ్గించుకొని కలను సాకారం చేసేందుకు పూనమ్ విమానాలు కడిగేది. కాఫీ షాప్‌లలో పనిచేసేది. ఇవి గొప్పగా అనిపించే పనులు కాకపోవచ్చు. కానీ తన లక్ష్య సాధన కోసం ప్రతి చిన్న పనిని కూడా చేసింది. జెట్ ఎయిర్‌వేస్‌లో పనిచేస్తూ ఫ్లైట్‌ల మధ్య, లేఓవర్‌లలో చదువుకునేది. చివరకు డిగ్రీని పూర్తి చేసి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. జెట్ ఎయిర్‌వేస్‌లో తనను "గోల్డెన్ గర్ల్" అని పిలిచేవారు. పైలట్ అయ్యాక కాక్‌పిట్‌లో కూర్చుని, కంట్రోల్స్ పట్టుకొని గాల్లోకి లేస్తుంటే తాను చిన్నప్పుడు ఇంటిపై కూర్చుని కలగన్న రోజులు గుర్తుకొచ్చాయి. పైలట్ అయ్యాక తన జీవితం మారిపోయింది.

ఏవియేషన్‌లో అవకాశాలకు..

డీజీసీఏలో ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పూనమ్ దేశవ్యాప్తంగా విమానాల సురక్షిత ఆపరేషన్‌లను పర్యవేక్షిస్తోంది. పూనమ్‌కు ఆకాశంలో ఎగరడం ఒక భాగం మాత్రమే. తన పెద్ద లక్ష్యం ఏవియేషన్ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించడం. ఎంబీఏ సమయంలో ఏవియేషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చేసిన పని తన సాంకేతిక నైపుణ్యాన్ని, నాయకత్వ లక్షణాలను చూపిస్తుంది. పూనమ్ దేవ్‌రఖ్యానీ కథ కేవలం ఒక పైలట్ కథ కాదు. ఒక సాధారణ గ్రామీణ అమ్మాయి సమాజంలో తన స్థానాన్ని సృష్టించుకుని, ఇతరులకు ఎలా స్ఫూర్తిగా నిలిచిందో తెలుపుతోంది.

Next Story