పఢాయ్ విత్ ఏఐ.. 350 ప్రభుత్వ పాఠశాలల్లో గణితం భయాన్ని పోగొట్టిన ఐఏఎస్ ఆఫీసర్.!

by Daayi Srishailam |

విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తగ్గించి.. అద్భుతమైన ఫలితాలు వచ్చేలా తీర్చిదిద్దుతోంది.

పఢాయ్ విత్ ఏఐ.. 350 ప్రభుత్వ పాఠశాలల్లో గణితం భయాన్ని పోగొట్టిన ఐఏఎస్ ఆఫీసర్.!
X

దిశ, ఫీచర్స్: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా విద్యార్థులకు గణితం పట్ల భయాన్ని తొలగించి, విజయం సాధించే మార్గాన్ని చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి 350కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువును సరళంగా ఆసక్తికరంగా మార్చే కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టింది.

పఢాయ్ విత్ ఏఐ

విద్యార్థులకు మ్యాథ్స్ అంటే అదొక భయం. అందరికీ అని చెప్పలేంగానీ కొందరైతే గణితం అంటే గజగజ వణికిపోతుంటారు. వాళ్లకు అదెప్పుడూ సవాలే. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఆ ఒత్తిడి మరింత పెరుగుతుంద. ఇతర సబ్జెక్టుల్లో బాగా రాణించినప్పటికీ గణితంలో 45, 50, 55 మార్కుల వద్దే ఆగిపోతుంటారు. అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని సౌమ్య ఝా టోంక్ జిల్లాలో "పఢాయ్ విత్ ఏఐ" అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తగ్గించి.. అద్భుతమైన ఫలితాలు వచ్చేలా తీర్చిదిద్దుతోంది.

అద్భుతమైన మార్పు

"పఢాయ్ విత్ ఏఐ" కార్యక్రమం ద్వారా ఎంతోమంది గ్రామీణ విద్యార్థుల చదువుల్లో మార్పు వచ్చింది. ఎందరో జీవితాలు సరికొత్త మలుపు తిరిగాయి. గతంలో గణితంలోని క్లిష్టమైన భావనలు అర్థం కావడం కష్టంగా ఉండేది. ఏఐ స్టెప్-బై-స్టెప్ వివరణలు విద్యార్థులకు సహాయపడుతున్నాయి. ఇప్పుడు రోజూ పాఠశాల తర్వాత సమీక్షించడం అలవాటుగా మారింది వాళ్లకు. ఈ కార్యక్రమం ద్వారా రెగ్యులర్ టెస్టులు, సరళమైన వివరణలతో గణితాన్ని సులభంగా, ఆసక్తికరంగా మార్చుకుంటున్నారు. ఫలితంగా గణితంలో వెనకబడిన విద్యార్థులు 2025 బోర్డు పరీక్షల్లో 65,75 మార్కులు సాధించారు.

ఆలోచన ఎలా వచ్చింది.?

2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా టోంక్ జిల్లా కలెక్టర్‌గా 2024 జనవరిలో బాధ్యతలు స్వీకరించింది. స్కూళ్లను సందర్శించినప్పుడు విద్యార్థుల ఆశలు, లక్ష్యాలు, అకడమిక్ పనితీరు మధ్య ఉన్న అంతరాన్ని గమనించింది. విద్యార్థులు డాక్టర్లు, టీచర్లు కావాలని కలలు కనడమే కాకుండా ఏఐ, రోబోటిక్స్, డ్రోన్స్ వంటి అధునాతన సాంకేతికతల్లో పనిచేయాలని వాళ్లకు సూచించింది. కానీ గణితంపై ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల చాలామంది సైన్స్ స్ట్రీమ్ ఎంచుకోలేదనే విషయాన్ని గ్రహించిన సౌమ్య గణితాన్ని సులభం చేసేందుకు 2024 సెప్టెంబర్‌లో "పఢాయ్ విత్ ఏఐ" స్టార్ట్ చేసింది.

ఏఐ ఒక ఫ్రెండ్

ఈ కార్యక్రమం గణితాన్ని సులభంగా, ఆసక్తికరంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంట్లో ద్విభాషా ఏఐ ట్యూటర్ ఉంది. ఇది పాఠ్యపుస్తకాల ప్రశ్నలను తక్షణమే పరిష్కరిస్తుంది. విద్యార్థులకు మరింత స్పష్టత కావాలంటే పేజీని రిఫ్రెష్ చేయడం ద్వారా కొత్త వివరణ పొందవచ్చు. ఏఐ ఆ ప్రశ్నల ఆధారంగా అపరిమిత సంఖ్యలో ప్రశ్నలను విభిన్న ఫార్మాట్‌లలో రూపొందిస్తుంది. ఇది విద్యార్థులకు తక్షణ పరీక్షలను సృష్టించడంలో ఒక ఫ్రెండ్‌లా సహాయపడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంగ్లీష్, సైన్స్ వంటి ఇతర సబ్జెక్టులకు కూడా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకొని త్వరలో లాంఛ్ చేసేందుకు కృషి చేస్తోంది.

Next Story