- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్లలోనే రెట్టింపు.. రియల్ రంగంలో హైదరాబాద్ దూకుడు
మొత్తంగా 9.90 ఎకరాలకుగాను హెచ్ఎండీఏకు రూ. 1,355.33 కోట్లు ఆదాయం వచ్చింది

దిశ, హైదరాబాద్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. నగరంలోని చాలా చోట్ల భూముల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. సిటీ విస్తరణ తదితర అంశాల ప్రాతిపదికన భూముల ధరలకు హద్దు లేకుండా పోతున్నాయి. ఇటీవల కోకాపేటలో నిర్వహించిన భూముల వేలంలో మరోసారి రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ. 137.25 కోట్లు పలికింది. నియోపోలిస్‌లో ఉన్న ప్లాట్ నంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18లో 5.31ఎకరాలకు హెచ్ఎండీఏ అధికారులు వేలం పాట నిర్వహించారు. సర్వే నంబర్ 17లోని ఎకరం భూమి ధర రూ.137.25 కోట్లు పలికింది. మొత్తంగా 9.90 ఎకరాలకుగాను హెచ్ఎండీఏకు రూ. 1,355.33 కోట్లు ఆదాయం వచ్చిందంటే నగరంలో రియల్ ఎస్టేట్ ఎలా దూసుకుపోతోందో ఇట్లే అర్థం అవుతోంది.
రాయదుర్గంలో..
ఇటీవల రాయదుర్గంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. మొత్తంగా 7.67 ఎకరాలకు వేలం పాట నిర్వహించగా రూ.1,357 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. రాయదుర్గంలో కనీస ధర ఎకరాకు రూ.101 కోట్లుగా ఉండగా వేలంలో రూ. 177 కోట్లు పలుకడం రియల్ ఎస్టేట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
పెరిగిన రిజిస్ట్రేషన్లు...
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలలో రిజిస్ట్రేషన్ల సంఖ్యలో భారీగా వృద్ధి కనిపించడమే దీనికి నిదర్శనం. 2024 మే నెలతో పోలిస్తే 2025 మేలో దాదాపు 14 శాతం పెరుగుదల నమోదైంది. 2025 అక్టోబర్ నెలలో రంగారెడ్డి జిల్లా 48 శాతం రిజిస్ట్రేషన్లు జరగగా, మేడ్చల్-మల్కాజ్‌గిరి 37శాతం, హైదరాబాద్ జిల్లా 15 శాతం రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. అయితే గ్రేటర్ పరిధిలో అత్యధిక భాగం రంగారెడ్డి జిల్లా పరిధిలోనే జరుగడం గమనార్హం.
నాలుగేళ్లలోనే డబుల్..
గ్రేటర్ హైదరాబాద్‌లో భూములపై పెట్టుబడులు పెడితే సుమారు నాలుగేళ్లలోనే రెట్టింపవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన లింక్డిన్ వేదికగా పోస్ట్ చేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లో రియల్టీ బూమ్ ఉందని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కరోనా కాలం తర్వాత అంటే దాదాపు 4 ఏళ్ల కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దుమ్మురేపిందని అభిప్రాయపడ్డారు.






