భాగ్యనగర ట్రాఫిక్ కష్టాలకు ప్రభుత్వ పరిష్కారం.. భారీ నిధులతో..

by Sujitha Rachapalli |

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనుంది ప్రభుత్వం. హెచ్‌ఎండీఏ నిధులతో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించింది.

భాగ్యనగర ట్రాఫిక్ కష్టాలకు ప్రభుత్వ పరిష్కారం.. భారీ నిధులతో..
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో రవాణా సదుపాయాన్ని మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రూపొదించింది. దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా కీలక మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రారంభించింది. రీజినల్, ఇంటర్నెల్ సిటీ కనెక్టివిటీని బలోపేతం చేసే కొన్ని ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. రేడియల్ రోడ్–2ను ఔటర్ రింగ్ రోడ్డుతో 143 కిలోమీటర్ వద్ద కలిపే కొత్త ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ నిర్మాణానికి, బుద్వేల్ లే అవుటుతో అనుసంధానం చేయనుంది. ప్రస్తుత రాజేంద్రనగర్ ఇంటర్‌చేంజ్ అభివృద్ధితో కలిపి ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ పూర్తయినట్లు తెలిసింది. ప్రస్తుతం టెండర్ దశలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన చేసిన ఈ ఇంటర్‌చేంజ్.. హైదరాబాద్‌కు ఒక ల్యాండ్ మార్క్ గేట్‌వే‌గా మారుతుంద‌ని అధికారుల అంచ‌నా. బుద్వేల్ లే అవుట్‌తో పాటు మూసీ నది రివర్‌ ఫ్రంట్ మౌలిక వసతులకు క‌నెక్టవిటీ చేస్తుంది. ఈ ఇంటర్‌చేంజ్ ద్వారా రేడియల్ రోడ్–2, ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి, ఓఆర్ఆర్– శంషాబాద్– రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, బుద్వేల్‌ మధ్య ట్రాఫిక్ సాఫీగా ప్రయాణించడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్తుతుంది. అలాగే రీజినల్ ఏరియాస్ వారికి సౌలభ్యం మెరుగుపడుతుంది. ఇక ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.488 కోట్లు కాగా హెచ్ఎండీఏ నిధులు సమకూర్చనున్నది.

ఐసీసీసీ నుంచి శిల్పా లే అవుట్ వరకు

తెలంగాణ ప్రభుత్వం పట్టణ కనెక్టివిటీ మెరుగుపరచేందుకు రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందులో మొద‌టిది ప్యారడైస్ జంక్షన్ నుంచి శామీర్ పేట్‌ వరకు. రెండోది ప్యారడైస్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు. వీటితో పాటు అద‌నంగా బంజారాహిల్స్‌ ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్–3ని అభివృద్ధి చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్‌‌‌కు నేరుగా, సిగ్నల్ లేని కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1,656 కోట్లు. కాగా రెండు దశల్లో అమలవుతుంది. మొద‌టి ద‌శ‌ ఫిల్మ్‌నగర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 5 కి.మీ. రెండో దశ ఐసీసీసీ టవర్ నుంచి హకీంపేట్ కుంట వరకు 4 కి.మీ. మేర‌కు డెవ‌ల‌ప్ చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ బంజారాహిల్స్, ఫిలింనగర్, నార్నె రోడ్, ఐటీసీ కోహినూర్ రోడ్, టీ–హబ్, శిల్పా లే అవుట్ వంటి కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ రైడర్గ్–హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ఇది మెహదీపట్నం–గచ్చిబౌలి మధ్య ఉన్న ప్రస్తుత రేడియల్ రోడ్డుకు ప్రత్యామ్నాయ సమాంతర మార్గంగా అభివృద్ధి చేస్తారు. దీని వ‌ల్ల ట్రాఫిక్ గణ‌నీయంగా త‌గ్గుతుంది. ఈ ప్రాజెక్టులో 4 లేన్, 6 లేన్ ఏర్పాట్ల కలయికతో, భూమి స్థాయిలో ఎలివేటెడ్ భాగాలు ఉంటాయి. రోడ్ నం.82 (ఫిల్మ్‌నగర్), నార్నె రోడ్, రోడ్ నం.52, ఐటీసీ కోహినూర్ రోడ్, టీ–హబ్ జంక్షన్, ఔరో రియాల్టీ జంక్షన్‌ల వద్ద మొత్తం ఆరు ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లను ప్రతిపాదించారు. ఈ మార్గంలో సుమారు 1.00 కి.మీ (చైనేజ్ 700 నుంచి 1700 వరకు) హైదరాబాద్ జిల్లాలో రక్షణ శాఖకు చెందిన భూమి మీదుగా వెళ్తున్నట్లు గుర్తించబడింది. అందుకు అవసరమైన పనుల అనుమతి, క్లియరెన్సుల కోసం దరఖాస్తు చేశారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును హెచ్ఎండీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల ద్వారా చేపడతారు.

శంకర్‌పల్లి రోడ్ నుంచి మణికొండ వరకు

కోకాపేట, మణికొండ, గండిపేట, పుప్పాల్‌గూడ‌, నార్సింగి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరో ప్రాజెక్టును చేపట్టనున్నారు. హెచ్‌జీసీఎల్‌ సంస్థ శంకర్‌పల్లి రోడ్‌లోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కి.మీ పొడవున పైప్‌లైన్ రోడ్ అభివృద్ధి పనులను చేప‌డుతుంది. ఈ పనులకు రూ.110కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు వచ్చాయి. ప్రతిపాదిత అభివృద్ధిలో 10 మీటర్ల మిడియన్‌తో 6 లేన్ రహదారి నిర్మాణం, రహదారి రెండు వైపులా డ్రెయిన్–కమ్–ఫుట్‌పాత్, కల్వర్టులు, చిన్న వంతెనలు, జంక్షన్ అభివృద్ధి, ల్యాండ్‌ స్కేపింగ్ పనులు ఉంటాయి. త్వరలో ఈ–ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ ఫారమ్‌లో టెండర్లు పిలవనున్నారు.

నాన‌క్‌రాం గూడ నుంచి గ‌చ్చిబౌలి

నాన‌క్‌రాం గూడ నుంచి గచ్చిబౌలి వరకు అవుటర్ రింగ్ రోడ్ ప్రధాన రహదారి (సర్వీస్ రోడ్లు లేకుండా 3+3 లేన్‌లు) 75 మీటర్ల రైట్ ఆఫ్ వేతో నిర్మించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన కొండాపూర్, శిల్పా లేఅవుట్ వైపు వెళ్లే రెండు ఫ్లైఓవర్ల అప్రోచ్ ర్యాంపులు ప్రస్తుత రహదారికి ఇరువైపులా ఉండటంతో ట్రాఫిక్ బాటిల్‌నెక్ ఏర్పడుతోంది. దీంతో నాన‌క్‌రాం గూడ వ‌ర‌కూ ట్రాఫిక్ ర‌ద్దీ తగ్గుతుంది. నానక్‌రాం గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్‌ ఎడమ వైపు ప్రధాన రహదారిని మూడు వ‌రుస‌ల‌ నుంచి నాలుగు వ‌రుస‌ల‌కు విస్తరించాలని హెచ్‌సీజీసీఎల్‌ ప్రతిపాదించింది. ఈ ప‌నుల‌కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Next Story