ప్రకృతికి బై-బై చెప్తున్న న్యూ జెన్ : 60% కనెక్షన్ మిస్సింగ్.. ఆరోగ్యం డేంజర్!

by Javid Pasha |

ఈతరం యవతీ యువకులతో పోలిస్తే.. 1990లలో పుట్టిన వారు ఆరోగ్యంగా, ఆనందంగా, యవ్వనంగా కనిపిస్తుంటారు. కారణం బాల్య జీవితమంతా ఎక్కువ భాగం ప్రకృతితో సంబంధం కలిగి ఉండటమే!

ప్రకృతికి బై-బై చెప్తున్న న్యూ జెన్ : 60% కనెక్షన్ మిస్సింగ్.. ఆరోగ్యం డేంజర్!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు అత్యధిక మంది ప్రజల జీవితాలన్నీ గ్రామాలు, అటవీ సమీప ప్రాంతాలు, నదీతీరాలు వంటి సహజమైన ప్రకృతితో ముడిపడి ఉండేవి. ఆహారంలో భాగంగా ఎక్కువగా సేంద్రియ వ్యవసాయం నుంచి వచ్చిన ఉత్పత్తులపై ఆధారపడేవారు. ఆరోగ్యానికి అవసరమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివేవీ కల్తీ ఉండేది కాదు. అన్నింటికంటే ముఖ్యం పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో ముడిపడిన జీవితం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేది. కానీ రాను రాను ఈ పరిస్థితులు మారిపోయాయి. ఓ వైపు అభివృద్ధిలో దూసుకుపోతున్నా మరోవైపు మానవులు ప్రకృతితో సంబంధాలను కోల్పోవడంతో జీవన సమతుల్యతను దెబ్బతీస్తు్న్నదని నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా న్యూ జనరేషన్ ప్రకృతితో సంబంధాలు కోల్పోవడంవల్ల చాలా నష్టపోతోందని నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం పదండి!

60% తగ్గిన అనుబంధం

ఈతరం యవతీ యువకులతో పోలిస్తే.. 1990లలో పుట్టిన వారు ఆరోగ్యంగా, ఆనందంగా, యవ్వనంగా కనిపిస్తుంటారని చాలామంది చెబుతుంటారు. కారణం బాల్య జీవితమంతా ఎక్కువ భాగం ప్రకృతితో సంబంధం కలిగి ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రొఫెసర్ మైల్స్ రిచర్డ్‌సన్ (University of Derby) నడిపిన ఎర్త్ (Earth) జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యనం కూడా ఈ అంశంపై మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 1800 నుంచి 2020 వరకు సుమారు 220 సంవత్సరాలలో మానవులు ప్రకృతితో కలిగి ఉన్న సంబంధం(nature connectedness) 60%కి పైగా తగ్గిపోయినట్లు ఒక డేటా ఆధారిత మోడల్ (agent-based model) ద్వారా గుర్తించారు.

పదాల వాడకంలోనూ ప్రకృతి మిస్సింగ్..!

ముఖ్యంగా పట్టణీకరణ (urbanization), స్థానిక జీవవైవిధ్య నష్టం, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వర్తించిన ప్రకృతిపట్ల ఆసక్తి, ఇంటర్‌జెనరేషనల్ ట్రాన్స్‌మిషన్ (intergenerational transmission) వంటి అంశాలను అధ్యయనం ట్రాక్ చేసింది. ఒకప్పటితో పోలిస్తే ఆధునిక పుస్తకాల్లో, సాహిత్యంలో ‘నది, పుష్పం, గరిక, నాచు (river, blossom, moss) వంటి ప్రకృతి సంబంధిత పదాల వాడకం కూడా 60.6% వరకు తగ్గడం ఈ పరిస్థితికి అద్దం పడుతున్నదని నిపుణులు అంటున్నారు. దీనినే ‘extinction of experience’ అనే సమస్యగా అభివర్ణిస్తున్నారు. అంటే ఇక్కడ చెట్టు పుట్ట, గుట్ట, చెరువు, నది, వెన్నెల, ఆకాశం, చెట్టు నీడ, అటవీ ప్రయాణం వంటి ప్రకృతితో ముడివడిన రోజువారీ అర్థవంతమైన అనుభవాలు మానవులకు తగ్గిపోయాయి. ఇంటర్‌జెనరేషనల్ ట్రాన్స్‌మిషన్ దీనికి ప్రధాన కారణమని అధ్యయనం పేర్కొన్నది.

అర్బనైజేషనే కారణమా?

పెరుగుతున్న పట్టణీకరణ, పని, ఉపాధి, ఉద్యోగాలకోసం నగరాలకు వలసలు వంటివి కూడా కారణం అవుతున్నాయి. అలాగే తల్లిదండ్రులు ప్రకృతితో తక్కువ సంబంధం కలిగి ఉంటే, పిల్లలకు కూడా అదే బదిలీ అవుతూ ఉన్నదని, దీంతో ప్రకృతికి దూరంగా ఉండే ఒక సైకిల్ ఆధునిక తరంలో ఏర్పడుతున్నదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ సమయంలో పిల్లల నేచర్ కనెక్షన్స్ బాగా తగ్గుతున్నాయి. ఈ పరిస్థితులు అనేక రకాల మానసిక, శారీరక అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. కాబట్టి బాల్యం నుంచి యవ్వనం వరకు ప్రకృతితో కనెక్షన్ కలిగి ఉండే జీవన శైలిని నిర్వహించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తగ్గితే మానవుల ఫ్లోరిషింగ్ (flourishing) ప్రభావితం అవుతుందని చెబుతున్నారు.

ఏం చేయాలి?

ప్రకృతితో అనుబంధం తగ్గకూడదంటే ఆధునిక పరిస్థితుల్లో కూడా నేచర్‌తో కనెక్ట్ అయ్యే బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ను కొనసాగించాలి. ఇది కేవలం వ్యక్తిగతంగానే కాకుండా.. వ్యవస్థాపరంగా కూడా జరగాలి. ప్రభుత్వాలు పాలనాపరమైన విధానాల్లో ప్రకృతితో సంబంధం కలిగి ఉండే జీవనశైలి పరిస్థితులను పునరుద్ధరించే కార్యకలాపాలను ప్రోత్సహించాలని నిపుణులు అంటున్నారు. అందుకు అవసరమైన వాతావరణం కల్పించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో గ్రీన్ స్పేస్ పెంచడం, బాల్యంలో నేచర్ ఎక్స్‌పోజర్, హెల్త్‌కేర్‌లో ప్రకృతిని ఇంటిగ్రేట్ చేయడం, రోజువారీ నిర్ణయాల్లో ఎకాలజికల్ థింకింగ్ తీసుకురావడం వంటివి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు.

Next Story