- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక ఆవిష్కరణ.. రెండు ముఖాలు..! లాభమా.. నష్టమా?
మానవజాతి చరిత్రలో అతి శక్తివంతమైన ఆవిష్కరణలు రెండు రకాల ప్రభావాలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒకటి భవిష్యత్తును తీర్చిదిద్దేది అయితే, మరొకటి దాన్ని నాశనం చేసేది.

దిశ, ఫీచర్స్ : ప్రపంచమంతా మారిపోతోంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. ఏఐ మొదలు కొని క్వాంటం కంప్యూటర్ల దాకా రోజుకో కొత్త ఆవిష్కరణతో, కొత్త సమాచారంతో శాస్త్రవేత్తలు మనల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఇప్పటికే అనేక ఆవిష్కరణలు జరిగి అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. మానవాళికి రక్షణను, సౌకర్యాలను అందిస్తున్నాయి. అయితే ఇదంతా నాణేకి ఒకవైపు మాత్రమే. సరికొత్త ఆవిష్కరణల గురించి డిస్కస్ జరిగినప్పుడల్లా చాలామందికి టెక్నాలజీ గురించిన పాజిటివ్ కోణాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. కానీ ప్రతీ ఆవిష్కరణకు రెండు ముఖాలు ఉన్నాయని, వాటి వెనుక మంచితో పాటు చెడు, పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా ఉన్నాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. టెక్నాలజీ చరిత్రలో అటువంటి కొన్ని ఆవిష్కరణలు- వాటి ప్రయోజనాలు-నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన ఆవిష్కరణలు
మానవజాతి చరిత్రలో అతి శక్తివంతమైన ఆవిష్కరణలు రెండు రకాల ప్రభావాలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒకటి భవిష్యత్తును తీర్చిదిద్దేది అయితే, మరొకటి దాన్ని నాశనం చేసేది. ఉదాహరణకు న్యూక్లియర్ ఆయుధాల ఆవిష్కరణ రక్షణ కోసం అతి ముఖ్యమైననప్పటికీ ఒక్క నిమిషంలో నగరాలను బూడిద చేయగలవు. ఇక తమ సృష్టికర్తలను మించిపోయే కృత్రిమ మేధస్సు (AGI), జన్యుమార్పిడి టూల్స్ (CRISPR) రోగాలను నయం చేయగలవు. కానీ అనుకోకుండా కొత్త వైరస్‌లను పుట్టించవచ్చు. అలాగే ఆటోమేషన్ డ్రోన్లు, నానోబాట్స్, క్వాంటమ్ కంప్యూటర్లు మేలు చేసే ఆవిష్కరణలే అయినప్పటికీ, అప్రమత్తంగా ఉండకపోతే అనేక నష్టాలు కూడా ఉన్నాయి.
న్యూక్లియర్ టెక్నాలజీ
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతి చేతిలోకి వచ్చిన అతి శక్తివంతమైన ఆయుధం న్యూక్లియర్ బాం*బు. ఒక్క బాం*బుతోనే లక్షల మంది ప్రాణాలు పోతాయి. మొత్తం నగరం ఒక్క క్షణంలో బూడిద అవుతుంది. ఇది యుద్ధాలను ఆపే “భయం”గా పనిచేసి 1945 నుంచి పెద్ద యుద్ధాలు జరగకుండా చేసిందని కొందరు అంటారు. కానీ ఇప్పుడు రష్యా, అమెరికా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌ల చేతుల్లో వేలాది బాంబులు ఉన్నాయి. ఏమాత్రం తప్పిదం జరిగినా మానవ నాగరికత మొత్తం నాశనమైపోతుంది. రేడియేషన్ ప్రభావం తరతరాల వరకు కొనసాగుతుంది.
కృత్రిమ మేధస్సు (AGI/Superintelligence)
ఇప్పటివరకు మనం చూసిన ChatGPT, మెటా ఏఐ, “నారో AI” వంటివి ఎటువంటి అద్భుతాలు చేస్తున్నాయో తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) కూడా మరింత సామర్థ్యంతో అందుబాటులోకి రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఏ విషయంలోనైనా మనిషి లాగా ఆలోచించగల, తమను తాము మెరుగుపడగల టెక్నాలజీతో రూపొందుతాయి. దీంతో క్యాన్సర్ నిర్మూలన, వాతావరణ మార్పుల పరిష్కారం, అంతరిక్ష పరిశోధన వంటివి మరింత సులభతరం అవుతాయి. కానీ ఒకవేళ వాటి లక్ష్యాలు దారితప్పితే.. అనుకోకుండా సాంకేతిక లోపం ఏర్పడితే.. లేదా ఎవరో దురుద్దేశంతో ఉపయోగిస్తే? ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని నిక్ బోస్ట్రమ్, ఎలాన్ మస్క్, జియాఫ్రీ హింటన్ వంటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే నిజానికి AGI మానవజాతి చివరి ఆవిష్కరణ కావచ్చు.
జన్యు మార్పిడి (CRISPR)
2012లో కనుగొన్న CRISPR-Cas9 జెనెటిక్ ఎడిటింగ్ సాంకేతికత మానవ డీఎన్ఏ(DNA)ను కత్తెరలాగా కోసి, మార్చగలదు. ఇప్పటికే హెచ్‌ఐవీ(HIV), క్యాన్సర్ వంటి జన్యు రుగ్మతలను నయం చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కావలసిన రంగు, ఎత్తు, తెలివి గల “డిజైనర్ బేబీస్” ను క్రియేట్ చేయడం కూడా సాధ్యమే అంటున్నారు నిపుణులు. కానీ ఈ క్రమంలో ఒక చిన్న తప్పిదం జరిగినా.. కొత్త రోగాలు, జన్యు అసమతుల్యత (Genetic imbalance) వంటివి వస్తాయి. 2018లో చైనా శాస్త్రవేత్త హీ జియాన్‌కుయ్(He Jiankui) ఇద్దరు పిల్లలకు సంబంధించిన డీఎన్ఏ మార్చగలిగాడు. కానీ అది బెడిసి కొట్టింది. దీంతో జెన్ ఎడిటింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించారు.
డ్రోన్స్, కిల్లర్ రోబోట్స్
ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో డ్రోన్లు తమంతట తామే టార్గెట్‌ను గుర్తించి దాడి చేస్తున్నాయి. వీటిని ఉపయోగించడంవల్ల ఖర్చు ఆదా అవడంతోపాటు సైనికులకు ప్రాణ నష్టం లేకుండా అవి యుద్ధం చేయగలవు. కానీ ఈ డ్రోన్ల ప్రయోగంలో ఒకవేళ AI తప్పుగా గుర్తిస్తే? టార్గెట్ చేసిన శత్రువుకు బదులు సాధారణ పౌరులపై దాడి జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు? యూఎన్‌లో “కిల్లర్ రోబోట్స్”పై నిషేధం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సాంకేతికత మానవాళికి ముప్పు.
నానోటెక్నాలజీ
రక్తంలో ప్రవేశించి క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే, ధమనుల్లో అడ్డుపడిన కొలెస్ట్రాల్‌ను తొలగించే నానో రోబోట్స్ గురించి తెలిసిందే. ఒక విధంగా ఇది భవిష్యత్ మెడిసిన్ అని చెప్పవచ్చు. ఈ సాంకేతికతతో మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఏమాత్రం తప్పిదం జరిగినా, అవి రక్తంలో ప్రవేశించాక అనుకోకుండా తమను తాము స్వయం అభివృద్ధి(self-replicating) చేసుకొని అనియంత్రితంగా పెరిగితే మాత్రం డేంజరే. “గ్రే గూ” థియరీ ప్రకారం.. భూమిపై ఉన్న అన్ని పదార్థాలను నానోబాట్స్‌గా మార్చేస్తే జీవం మొత్తం నాశనం అవుతుంది.
డీప్‌ఫేక్ టెక్నాలజీ
రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది సాంకేతికత. అయితే ప్రయోజనం కోసం వాడితే మంచిదే. కానీ కొన్నిసార్లు స్వార్థం కోసం వాడేవారూ లేకపోలేదు. అలాంటిదే డీప్‌ఫేక్ టెక్నాలజీ. ఇప్పటికే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మాట్లాడని మాటలు మాట్లాడినట్టు, చేయని పనులు చేసినట్టు వీడియోలు వైరల్ అయిన సంఘటనలు చాలా జరిగాయి. అయితే ఈ డీప్‌ఫేక్‌ను ఎన్నికల్లో, యుద్ధాల్లో తారుమారు చేయడానికి ఉపయోగిస్తే..? వామ్మో.. ప్రజలు నిజమేదో-అబద్ధమేదో గుర్తించలేరు. అంతెందుకు 2024 అమెరికా ఎన్నికల్లోనే డీప్‌ఫేక్ వీడియోలు లక్షల మందిని మోసం చేసినట్లు వార్తలు వచ్చాయి. అంటే ప్రయోజనాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయి.
క్వాంటమ్ కంప్యూటింగ్
గూగుల్, ఐబీఎం, చైనా క్వాంటమ్ కంప్యూటర్లు రోజురోజుకూ శక్తివంతమవుతున్నాయి. ఇవి గణిత సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తాయి. కొత్త మెడిసిన్స్‌ను కనుగొనడం సులభం అవుతుంది. కానీ ఇవే కంప్యూటర్లు తప్పుగా ఉపయోగిస్తే.. అనుకోని లోపాలు తలెత్తితే.. ప్రస్తుత బ్యాంక్, మిలిటరీ ఎన్‌క్రిప్షన్‌ను ఒక్క నిమిషంలో బద్దలు కొట్టగలవు. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవచ్చు.
సైబర్ వార్‌ఫేర్
సైబర్ వార్‌ఫేర్ అంటే ఒక దేశం మరొక దేశం లేదా సంస్థపై రాజకీయ, ఆర్థిక, సైనిక లక్ష్యాలతో ఇంటర్నెట్ ద్వారా దాడులు చేయడం. ఇందులో హ్యాకింగ్, మాల్వేర్, DDoS, స్పైవేర్, జీరో-డే ఎక్స్‌ప్లాయిట్స్ వంటి టూల్స్ ఉపయోగిస్తారు. ఒక్క బుల్లెట్ కాల్చకుండానే విద్యుత్ గ్రిడ్‌లు, బ్యాంకులు, ఆస్పత్రులు, రక్షణ వ్యవస్థలు స్తంభింపజేయవచ్చు. ఉదాహరణకు.. 2007లో రష్యా ఎస్టోనియా బ్యాంకులు, పార్లమెంట్ వెబ్‌సైట్లపై భారీ DDoS దాడి చేసి మొత్తం దేశాన్ని ఆన్‌లైన్‌లో మూగబోయేలా చేసింది. ఇప్పటికీ రష్యా, చైనా, ఉత్తర కొరియా హ్యాకర్లు విద్యుత్ గ్రిడ్‌లు, ఆస్పత్రులు, బ్యాంకులను స్తంభింపజేస్తున్నారు. 2021లో అమెరికా గ్యాసోలిన్ పైప్‌లైన్ హ్యాక్‌తోనే దేశం మొత్తం పెట్రోల్ కొరత పడింది. రక్షణ ప్రయోజనాలకోసమని ఈ సాంకేతికతను డెవలప్ చేసినప్పటికీ, శత్రు దేశాలను లేదా ప్రయోజనాలు స్తంభింపజేయడంతో కొందరు నష్టపోతారు. అంటే ప్రతీ సాంకేతికత ఆవిష్కరణ వెనుక మంచీ చెడూ అనే రెండు ముఖాలు ఉంటాయి. వాటిని ఎప్పుడూ మంచికి ఉపయోగించుకోవాలనేదే సాంకేతిక ఆవిష్కరణల ముఖ్య ఉద్దేశమని నిపుణులు అంటున్నారు. Link






