బస్సులో విలువైన వస్తువులు మర్చిపోయారా.. డోంట్ వర్రీ.. మీ ఇంటికే తెచ్చి ఇస్తారు

by Muthe.Rajitha |

బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బ్యాగుల వంటి విలువైన వస్తువులు మర్చిపోతుంటారు.

బస్సులో విలువైన వస్తువులు మర్చిపోయారా.. డోంట్ వర్రీ.. మీ ఇంటికే తెచ్చి ఇస్తారు
X

దిశ, వెబ్ డెస్క్ : బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బ్యాగుల వంటి విలువైన వస్తువులు మర్చిపోతుంటారు. అలాగే కండక్టర్ టికెట్ వెనకాల రాసిన చిల్లర కూడా బస్సు దిగే హైరానాలో మర్చిపోతుంటాం. ఇంక అవి వస్తాయనే ఆశలు వదిలేసుకుంటాం కూడా. అయితే ఇకపై అలాంటి కంగారు అవసరం లేదు. ఆర్టీసీ అమలు చేస్తున్న ‘లాస్ట్‌ ప్రాపర్టీ హ్యాండోవర్‌’ విధానం ద్వారా వాటిని తిరిగి పొందే అవకాశం ఉంది. బస్సులో మర్చిపోయినవి తిరిగి పొందేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ అయితే 08662570005, టీజీఆర్టీసీ అయితే 040 69440000 నంబర్‌కు ఫోన్‌ చేసి టికెట్‌పై ఉన్న కండక్టర్, లేదా డ్రైవర్‌ కోడ్‌ చెబితే నేరుగా వారి నంబర్లు ఇస్తారు. వారికి ఫోన్‌ చేసి సామాన్ల వివరాలు చెబితే మర్చిపోయినవాటి జాడ తెలుసుకోవచ్చు.

టికెట్‌ తీసుకుని మిగిలిన చిల్లర దిగేటప్పుడు మర్చిపోయినా ఇదే నంబర్లకు ఫోన్‌ చేస్తే కండక్టర్‌ నంబరు చెబుతారు. వారికి కాల్‌ చేస్తే యూపీఐ విధానంలో మీ చిల్లర తిరిగి పంపుతారు. ఇవేవి తెలియకపోయినా ఆ బస్సు ఏ డిపో పరిధిలోనిదో తెలుసుకుని మేనేజర్‌కు ఫోన్‌ చేసి టికెట్‌పై ఉన్న నంబరు చెబితే కండక్టర్, డ్రైవర్‌ ఫోన్‌ నంబరు, వివరాలు చెబుతారు. ఇక నిబంధనల ప్రకారం డ్రైవర్, కండక్టర్లు ట్రిప్‌ పూర్తి కాగానే బస్సులో సామాన్లు ఎవరైనా మర్చిపోతే వాటిని డిపోలోని ఎర్నింగ్‌ సెక్షన్‌లోని డీపీ క్లర్క్‌కు అప్పగించాల్సి ఉంటుంది. పోగొట్టుకున్న వారు నేరుగా ఆ క్లర్క్‌ను సంప్రదించినా దొరకడానికి అవకాశం ఉంది.

పోగొట్టుకున్న వస్తువుల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుని వారివే అని నిర్ధారించుకున్న తర్వాతే అప్పగిస్తారు. కాని మనం మర్చిపోయిన వస్తువులు తోటి ప్రయాణికులు తీసుకుని దిగిపోతే ఎవరు ఏం చేయలేరు. ప్రయాణికులు ఎవరు వస్తువులు తీయకున్నా బస్సు డ్రైవర్, కండక్టర్‌ బాధ్యతగా లేకుంటే ఫలితం ఉండదు. ఈ విధానం ఫలవంతంగా సాగాలంటే ఇటు తోటి ప్రయాణికులకు, సిబ్బందికి ఇద్దరికీ బాధ్యత ఉండాలి అంటున్నారు ఆర్టీసీ అధికారులు.

Next Story