- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. అమ్మకానికి రంగం సిద్ధం
ఉద్యోగాల నోటిఫికేషన్ పడలేదు... పడుతుందో లేదో గ్యారెంటీ లేదు.. కానీ ఆ ఉద్యోగాల విక్రయాలకు అప్పుడే బేరం కుదుర్చుకున్నారు.

దిశ, నల్లగొండ బ్యూరో : ఉద్యోగాల నోటిఫికేషన్ పడలేదు... పడుతుందో లేదో గ్యారెంటీ లేదు.. కానీ ఆ ఉద్యోగాల విక్రయాలకు అప్పుడే బేరం కుదుర్చుకున్నారు. అవి రెగ్యులర్ పోస్టులు కూడా కాదు... కేవలం కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే.. అయినా వాటికి చాలా పెద్ద మొత్తంలో ఖరీదు నిర్ణయించారు. ఇది ఎక్కడో కాదు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నడుస్తున్న తతంగం. ఓ సీనియర్ అధికారి, క్లర్క్ కీలక సూత్రధారులని తెలుస్తుంది.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఆరు ఖాళీలు..
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఆరు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో నాలుగు పోస్టులలో నలుగురు టెక్నీషియన్లు కాంట్రాక్ట్ పద్ధతిలో ముగ్గురు, ఒకరు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేశారు. అదనంగా రెండు ఖాళీ పోస్టులున్నాయి. అయితే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేసిన నలుగురిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వారిని టెర్మినేట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మొత్తం ఆరు పోస్టుల భర్తీ కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టర్కు ఫైల్ పంపించారు. ఈ ఉద్యోగులను "నేషనల్ హెల్త్ మిషన్""( ఎన్ హెచ్ ఎం) స్కీం కింద తీసుకోనున్నారు. అయితే గతంలో పనిచేసిన అభ్యర్థులకు ఈ పోస్టులలో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఒక పోస్ట్ కు రూ.2 లక్షలు..?
అత్యంత తొందరలో నోటిఫికేషన్ రాబోతున్న 6 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు వైద్య శాఖ కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అధికారి, ఓ క్లర్క్ ఇద్దరు కలిపి బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని మార్కెట్లో పల్లి బఠానీల మాదిరిగా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఒక్కొక్క పోస్టుకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పటికే అభ్యర్థుల నుంచి అడ్వాన్స్ గా కొంత సొమ్ము తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
డీల్ కుదరకనే ఎల్డీసీ పోస్టులు పెండింగ్..
డీఎంహెచ్ ఓ పరిధిలో రెండు " లో డివిజన్ కంప్యూటర్" ( ఎల్డీసీ ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి మునుగోడు రెండవది గుడిపెల్లిలో ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా మార్కెట్ లో సరుకు మాదిరిగా అంగట్లో పెట్టారు. వైద్యశాఖలో పనిచేస్తున్న ఆ పోస్టులో చేర్చుతామంటూ నమ్మబలికి కొంతమంది దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు. ఒకరి వద్ద రూ. 50 వేలు, మరోకరి వద్ద రూ. 40 వేలు తీసుకున్నారని సమాచారం. ఇలా మరో ముగ్గురి వద్ద కూడా డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది. స్వయంగా " ఫోన్ పే " ద్వారానే ఓ క్లర్క్ కు పంపించారు. ఫోన్ పే ద్వారా వచ్చిన సొమ్మును 4 నెలలు తన దగ్గర పెట్టుకుని ఆ తర్వాత బేరం కుదరటం లేదని తిరిగి ఇచ్చారని సమాచారం. అయితే ఆ పోస్టులను ఆశించిన వ్యక్తుల ఫోన్ పే.. క్లర్క్ ఫోన్ పే పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంగట్లో సరుకుల మాదిరిగా ఈ ఉద్యోగాలు అమ్మకానికి ప్రధాన సూత్రధారులు ఓ సీనియర్ అధికారి, క్లర్క్ అంటూ సంబంధిత డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పోస్టులు కూడా సరైన బేరం కుదరకనే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.






