ఇళ్ల పట్టాల పేరుతో మోసం: వైసీపీ నేత తురకా కిషోర్‌పై కేసు నమోదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-11 08:13:04  IST  )

నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి మోసం చేశారని వైసీపీ నేత తురకా కిషోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేద లబ్దిదారులకు జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు..

ఇళ్ల పట్టాల పేరుతో మోసం: వైసీపీ నేత తురకా కిషోర్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఇళ్ల పట్టాలు పేరుతో మోసం చేశారని వైసీపీ నేత తురకా కిషోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేద లబ్దిదారులకు జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే విజయాబాబు, శ్రీనునాయక్ అనే లబ్ధిదారుల నుంచి తురకా కిషోర్ రూ. 4.50 లక్షలు తీసుకుని నకిలీ పట్టాలు ఇచ్చారు. దీంతో బాధితులు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన విచారణ చేపట్టాలని రెవెన్యూ, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. తురకా కిషోర్ నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని తేలింది. దీంతో తురకా కిషోర్‌తో పాటు ఆయన బంధువు చల్లా శివపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీసులు ఇచ్చి ఇద్దరినీ కూడా విచారించాలని నిర్ణయించారు. విచారణ అనంతరం తురకా కిషోర్, చల్లా శివపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

అప్పట్లోనే అరెస్ట్, రిమాండ్, బెయిల్

కాగా జగన్ అధికారంలో ఉన్న సమయంలో తురకా కిషోర్ అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్ద ప్రధాన అనుచరుడిగా పని చేశారు. అయితే ఆ సమయంలో మాచర్ల పర్యటనకు వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడి చేశారు. ఈ కేసులోనూ ఆయన అరెస్ట్ అయి రిమాండ్‌కు వెళ్లి బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా కూడా కేసు నమోదు కావడంతో తురకా కిషోర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Next Story