ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 68.84 శాతం ఉత్తీర్ణత

by Malleboina Mahesh |

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) నేడు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (IPASE 2026) ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షల్లో మొత్తం 68.84% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 68.84 శాతం ఉత్తీర్ణత
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) గురువారం (జూన్ 11) ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (IPASE 2026) ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. క్రమం తప్పకుండా నిర్వహించిన వార్షిక పరీక్షల్లో ఒకటి, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం మే 13 నుండి మే 21 వరకు ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించిన సంగతి తెలిసిందే. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాలకు సంబంధించిన మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షల్లో మొత్తం 68.84% ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,31,128 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో రికార్డు స్థాయిలో 68.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి బోర్డు అధికారిక వెబ్‌సైట్ల https://results.cgg.gov.in/ ద్వారా మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఈసారి విద్యార్థులకు విడిగా భౌతిక (Physical) మార్కుల మెమో ప్రతులను సరఫరా చేయబోమని స్పష్టం చేసింది. బోర్డు అసలు పాస్ సర్టిఫికెట్ అందించే వరకు విద్యార్థులు ఈ డౌన్‌లోడ్ చేసుకున్న డిజిటల్ మార్క్స్ మెమోనే రికార్డుగా భద్రపరుచుకోవాలని సూచించింది. ఫలితాల యాక్సెస్‌లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా విద్యార్థులు ఇంటర్ బోర్డు హెల్ప్‌లైన్ నంబర్ 040-24603315 ను సంప్రదించవచ్చు.

Next Story