- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అపురూపం.. ఆయన చెక్కిన శిల్పం.. జాతీయస్థాయిలోనూ గుర్తింపు పొందిన హోతి బస్వరాజ్
అపురూపం.. ఆయన చెక్కిన శిల్పం.. జాతీయస్థాయిలోనూ గుర్తింపు పొందిన హోతి బస్వరాజ్

దిశ, ఝరాసంగం : ఆయన శిల్పాలు చెక్కితే నటరాజు నాట్యమాడినట్టు ఉంటుంది. ప్రాచీన ఆధునిక శిల్పకళ నైపుణ్యతను ఓనరించి జీవం ఉట్టిపడేలా శిల్పాల తయారీలో దిట్ట.. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన హోతి బస్వరాజ్. దేవతల విగ్రహాలు, మహాత్ముల ప్రతిమలు, మహనీయుల కళాకృతులును రూపొందించడంలో ఆయనది అందవేసిన చేయి.
సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన అడివప్ప, గిరిజాబాయి దంపతుల ఆరో సంతానమే బస్వరాజ్. తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే చిత్రాలను గీయడం ప్రారంభించిన బస్వరాజ్.. జేఎన్ టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మైసూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు.
కళాఖండాలకు ప్రాణంపోసి..
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో కళాఖండాలను బస్వరాజ్ రూపొందించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ మ్యూజియాలను ఆయనే నిర్మించారు. అందులో ముఖ్యమైనవి శ్రీశైలం మన్ననూరు, వరంగల్ సమ్మక్క సారక్క మ్యూజియం, కొమరం భీమ్ తదితర ప్రాంతాలలో ఆదివాసీల మ్యూజియంల రూపకల్పనలో బస్వరాజ్ ది కీలకపాత్ర. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో బసవేశ్వరుడు, శివాజీ, స్వామి వివేకానంద, భక్త రామదాసు, రాణా ప్రతాప్, భగత్ సింగ్, గౌతమ బుద్ధుడు, కొమరం భీమ్, మదర్ థెరిసా, చాకలి ఐలమ్మ, తెలంగాణ తల్లి, జయశంకర్, కొమరం భీమ్, దేశ నాయకులు, సామాజిక, సంఘసంస్కర్తల విగ్రహాలను ఆయన తయారు చేశారు.
ప్రదర్శనలు.. అవార్డులు
ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలలో శిల్పకళాలపై 18 పైగా ప్రదర్శనలు చేశారు. అందులో ముఖ్యమైనవి ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అగ్నిపథ్ సొసైటీ న్యూఢిల్లీ, లలిత కళా అకాడమీ ఢిల్లీ, 2007లో 49వ జాతీయ ప్రదర్శనలో ఆయన రూపొందించిన కళలను ప్రదర్శించారు. 2017 లో తెలంగాణ బతుకమ్మ వేడుకలలో రూపొందించిన బతుకమ్మకు ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. 4వ ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆయన ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. 2023 లో న్యూఢిల్లీలో నిర్వహించిన 63 వ జాతీయ స్థాయి కళా ప్రదర్శనలో పాల్గొన్నారు. 2024 లో ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్ట్ కౌన్సిల్లో తన కళలను ప్రదర్శించారు. 28సంవత్సరాల పాటు శిల్పాలను తయారు చేస్తున్న బస్వరాజ్ ను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఉత్తమ శిల్పిగా గుర్తించి ప్రత్యేకంగా సన్మానించింది. 2022లో బెంగళూరు డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2024 లో జాతీయస్థాయి ది ఇండియా అకాడమీ ఆఫ్ ఫైనాన్స్ అమృత్ సర్ అవార్డు అందుకున్నారు.
ఉచితంగా శిక్షణ ఇస్తా : హోతి బస్వరాజ్, శిల్పి
ఈ మధ్యకాలంలో కళాకారులకు బదులుగా వ్యాపారులు కళా రంగంలో వచ్చి కళలను అపహరించి సొమ్ము చేసుకుంటున్నారు. అసలైన కళాకారుల జీవితాలు దుర్భరం అవుతున్నాయి. కళలను అభ్యసించి జీవనం సాగించే నిజమైన కళాకారులను ప్రోత్సహించాలి. రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలి. హైదరాబాద్ లో ప్రత్యేకంగా శిల్ప కళాశాల ఉంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వారు సంప్రదిస్తే ఉచితంగా శిక్షణ ఇస్తాను.






