చూపు కోల్పోయినా.. ముందుచూపు కోల్పోలేదు.!

by Daayi Srishailam |

ఆసియన్ పారా గేమ్స్‌లో చెస్ మెడల్ గెలిచిన మొదటి ఇండియన్ ఉమన్‌

చూపు కోల్పోయినా.. ముందుచూపు కోల్పోలేదు.!
X

దిశ, ఫీచర్స్: సంకల్పం గట్టిగా ఉన్నవాళ్లకే సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటివాళ్లలో గుజరాత్‌కు చెందిన హిమాన్షి రాఠీ ఒకరు. ఇంటర్మీడియెట్లో చూపు కోల్పోతే.. జీవితమంతా అయిపోయిందని అనుకున్నారంతా. కానీ.. హిమాన్షీ కొత్త దారిని ఎంచుకుంది. చదరంగంలో రాణించి ఆసియన్ పారా గేమ్స్‌లో చెస్ మెడల్ గెలిచిన మొదటి ఇండియన్ ఉమన్‌గా నిలిచింది.

చదరంగం వైపు..

హిమాన్షికి రెటినైటిస్ పిగ్మెంటోసా అనే అరుదైన కంటి వ్యాధి సోకింది. ఇది వంశపారంపర్యంగా వచ్చింది. వాళ్ల అమ్మమ్మ, అత్త, అక్కకు కూడా ఇదే సమస్య. డాక్టర్లు చికిత్స లేదన్నారు. ఇది రెటినాను దెబ్బతీసి క్రమంగా చూపును కోల్పోయేలా చేస్తుంది. 4వ తరగతి వరకు విద్యా మందిర్‌లో చదివిన హిమాన్షి చూపు మరింత బలహీనమవ్వడంతో అహ్మదాబాద్‌లోని అంధ్య కన్యా ప్రకాశ్ అంధ పాఠశాలలో చేరింది. తనకు బ్రెయిలీ తెలియదు. మొబిలిటీ, అడాప్టేషన్ నేర్చుకుందిగానీ.. 12వ తరగతి నాటికి పూర్తిగా చూపుకోల్పోయింది. సంగీతం.. చదరంగం ఏది ఎంపిక చేసుకుంటావని టీచర్లడిగితే చెస్ అని చెప్పింది.

జల్పన్ కోచింగ్..

చెస్ పట్ల ఆసక్తి పెరిగిన తర్వాత హిమాన్షి బ్లయిండ్ పీపుల్స్ అసోసియేషన్ (బీపీఏ)లో చేరింది. ఇది దివ్యాంగులకు మద్దతుగా నిలిచే పెద్ద సంస్థ. బీపీఏలో కోచింగ్ ఆమెకు చాలా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకు వాళ్లు చేయూతనిచ్చారు. దర్శన్ పాండ్యా, హేమల్ థంకి, పరితోష్ దవే వంటి మెంటార్ల సహకారంతో చెస్‌లో ఆరితేరింది. తొలిసారిగా గుజరాత్ చెస్ అసోసియేషన్ ఫర్ విజువల్లీ చాలెంజ్డ్ (జీసీఏవీసీ) ద్వారా టోర్నమెంట్లో పాల్గొన్నది. క్రమంగా అన్ని కాంపిటీషన్స్‌కు వెళ్లేది. అలా ఆసియన్ పారా గేమ్స్ కంటే ముందు ఇంటర్నేషనల్ ప్లేయర్ జల్పన్ భట్ దగ్గర కోచింగ్ తీసుకుంది.

మొదటి ఇండియన్ ఉమన్..

హిమాన్షికి షార్ప్ మెమరీ ఉంది. లాంగ్ వేరియేషన్లు సులభంగా గుర్తుంచుకుంటుంది. తనొక డిఫెన్సివ్ ప్లేయర్. చైనా టోర్నమెంట్ ముందు మూడు నెలలు ఇంటెన్సివ్ ట్రైనింగ్ తీసుకుంది. మ్యాచ్‌లలో ప్రత్యర్థుల స్ట్రాటజీలు అధ్యయనం చేసి ప్లాన్ నేర్చుకుంది. 2019, 2020లో నేషనల్ ఛాంపియన్. 2022లో ఫ్రాన్స్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో 14వ స్థానం సాధించింది. 2022లో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫర్ బ్లయిండ్ నేషనల్ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ గెలిచింది. చైనాలోని హాంగ్‌జౌలో 2023 ఆసియన్ పారా గేమ్స్‌లో హిమాన్షి పాల్గొని చెస్ మెడల్ గెలిచిన మొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించింది.

టార్గెట్ ఆసియన్ పారా గేమ్స్‌- 2028

పూర్తి సమయం ఉద్యోగం చేస్తూనే కాంపిటీటివ్స్‌కు ప్రిపేరవుతుంది హిమాన్షి. వేరే ఇతర వ్యాపకాలు కూడా ఉండాలని అన్నింట్లోనూ ప్రయత్నాలు చేస్తోంది. తనకు గుజరాతీ సాహిత్యమంటే ఇష్టం. ఫ్రెంచ్ భాష నేర్చుకుంటోంది. లా చేస్తోంది. చూపు లేకపోయినా గుజరాత్ యూనివర్శిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో బీఏ, ఎంఏ పూర్తి చేసి రెండింట్లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. ప్రతి టోర్నమెంట్ మెడల్స్ కోసమే కాదు.. మన స్కిల్స్ మెరుగుపరచుకోవడానికే అంటున్న హిమాన్షి 2028లో జపాన్‌లో జరిగే ఆసియన్ పారా గేమ్స్‌కు సిద్ధమవుతుంది.

Next Story