Father's Day : నాన్నే ప్రపంచం.. నాన్నంటేనే ఆనందం.. నాన్నుంటేనే గుండె ధైర్యం

by Javid Pasha |   (  Updated:2025-06-15 06:55:26  IST  )

Father's Day : నాన్నే ప్రపంచం.. నాన్నంటేనే ఆనందం.. నాన్నుంటేనే గుండె ధైర్యం

Fathers Day : నాన్నే ప్రపంచం.. నాన్నంటేనే ఆనందం.. నాన్నుంటేనే గుండె ధైర్యం
X

దిశ, ఫీచర్స్ : అమ్మ మనసు వెన్న అంటుంటారు చాలా మంది. నాన్న మనసు కూడా అంతేనండోయ్. బయటకు గాంభీర్యంగా కనిపిస్తాడు కానీ.. పిల్లలపై ప్రేమ విషయంలో మాత్రం వెన్నలా, మంచులా కరుగుతూనే ఉంటాడు. అందుకే నాన్నంటే పిల్లలకు ఎంతో ప్రేమ. నాన్నకూ పిల్లలంటే అంతే ప్రేమ. నిజానికి నాన్న ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అదో అనిర్వచనీయ ఆనందం. అక్షరాల్లో వర్ణించలేని అనురాగ బంధం. దేనితోపోల్చలేని గొప్ప త్యాగ నిరతి.

అరుదైన సందర్భం

ఉదయం లేచినప్పటి నుంచి ప్రతీ ఒక్కరి మనసులో నాన్న గురించిన ఆలోచనలేవో సుడులు తిరుగుతూ ఉండవచ్చు. ఒడిసి పట్టుకున్నవో, మనసులో గూడు కట్టుకున్నవో ఏవైతేనేం నాన్న జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతూ ఉండవచ్చు. ఎందుకంటే నేడు ఫాదర్స్ డే. నాన్న ప్రత్యక్షంగా కళ్లముందున్నా లేకున్నా అతనితో అనుబంధాన్ని, అతని ప్రేమలోని వాత్సల్యాన్ని, అతను పంచిన ఆప్యాయతను గుర్తుచేసుకునే మరో అరుదైన సందర్భమిది.

భారం మోస్తూ.. బాధ్యత వహిస్తూ..

నవమాసాలు మోసి బిడ్డను కనే తల్లిది పేగు బంధమైతే.. ఆ బంధానికి బాధ్యత వహిస్తూ, భారమంతా మోస్తూ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాడు నాన్న. తను ఎలా ఉన్నా సరే.. తన పిల్లలు మాత్రం బాగుండాలని కోరుకుంటాడు. తను తిన్నా తినక పోయినా, తన బిడ్డల కడుపు నిండితే చాలనుకుంటాడు. తను చదువుకున్నా చదువుకోకపోయినా తన పిల్లల్ని మాత్రం గొప్పగా చదివించాలనుకుంటాడు. అందుకోసం పడరాని పాట్లు పడతాడు. కష్టమైన పనులన్నీ చేస్తాడు. ఇష్టం లేని ఉద్యోగాల్లో సైతం ఇమిడిపోతూ పిల్లల భవిష్యత్తుకోసం కలలు కంటుంటాడు. నాన్నంటే అంతే మరి.. పిల్లలకోసం ఏమైనా చేస్తాడు పిచ్చి తండ్రి.

తప్పటడుగులు.. పరిష్కారాలు

బుడి బుడి అడుగుల తప్పటడుగులు భయపెడుతుంటే.. వేలు పట్టుకొని నడక నేర్పిన నాన్న జ్ఞాపకం ప్రతీ ఒక్కరి మనసులో పదిలమే కదా..! బడికెళ్లనని మొండికేసినప్పుడు, చదువుల ఒడిలో అలసి సొలసినప్పుడు, చదువుల్లో ఫెయిలై బాధపడినప్పుడు, మార్కుల తక్కువొచ్చి ఫీలైనప్పుడు, ప్రేమ భావనలు చుట్టు ముట్టినప్పుడు, ఒంటరై కంటతడి పెట్టినప్పుడు నేనున్నానని భుజం తట్టి పరిష్కారం చూపిన నాన్న చొరవను ఎవరైనా మరువగలరా? బడికెళ్లేటప్పుడు తన బిడ్డ కోసం అన్నీ సమకూర్చుతాడు. బాధల్లో కూరుకుపోయినప్పుడు బయటపడే మార్గం వెతుకుతాడు. ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి మరీ అందరిలా చదివించాలని, పోషించాలని ఆరాట పడుతాడు. అందుకే నాన్నకు ఎప్పటికీ రుణపడే ఉంటుంది పిల్లల ప్రపంచం.

Next Story