- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్క్రీన్ వెనుక అసలు ముప్పు.. మీ శరీరానికే!
హెవీ స్క్రీన్ టైమ్ మానసిక సమస్యలకే పరిమితం కాదు. అది శరీరంలోని వివిధ భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది!

దిశ, ఫీచర్స్ : ఫోన్‌లో హెవీ స్క్రీన్ టైమ్ లేదా టెక్నాలజీ అధిక వాడకం మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించే మనం ఆలోచిస్తుంటాం. కానీ అది శరీరంపై కూడా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ వంటి డిజిటల్ పరికరాలు వాడేవారిలో ఇది ఎక్కువగా జరుగుతుంది. వీటిని ఉపయోగించడంవల్ల శరీరంలో ఏర్పడే భౌతిక సమస్యలనే ‘ఫోన్ బాడీ’గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇంతకీ ఈ సమస్యలు ఏవి? ఎందుకు వస్తాయి? ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టెక్ నెక్ సమస్య..
ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇటీవల అనేకమంది ‘టెక్ నెక్’ (tech neck) అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. స్క్రీన్ చూడటానికి తల వంచడం వల్ల ఈ సమస్య వస్తున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తలవంచి ఫోన్ స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు.. 27 కేజీల వరకు ఒత్తిడి పడుతుందని, దీంతో తరచుగా అలా చేసేవారిలో స్పైన్ డిస్కులు, కీళ్లు, కండరాలు దెబ్బతినే అవకాశం ఉందని, ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా తగ్గవచ్చునని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కాలక్రమంలో శరీర ఆకృతి మారిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు.
కంటి సమస్యలు..
ఫోన్ అధికంగా ఉపయోగించడంవల్ల మయోపియా (దగ్గర చూపు) వంటి కంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయని ఓహియో స్టేట్ యూనివర్సిటీ (Ohio State University). అధ్యయనం పేర్కొన్నది. అయితే దగ్గరగా చూడడం కంటే, ఇండోర్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి అభివృద్ధి దెబ్బతినవచ్చునని చెబుతున్నారు. ఇక ఫోన్ చూస్తూ బయట ఎక్కువ సమయం గడపడం వల్ల రెటినాలో డొపమైన్ విడుదలై కంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. గ్రిప్ స్ట్రెంగ్త్ (చేతి బలం) కూడా తగ్గుతుంది. సెడెంటరీ లైఫ్‌స్టైల్, కంప్యూటర్ ఆధారిత పనుల వల్ల యువతలో కండర బలం తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
‘ఫోన్ బాడీ’ లక్షణాలు
తరచుగా ఫోన్ లేదా స్క్రీన్ చూసే అలవాటు ఒక్క మానసిక సమస్యకే పరిమితం కాదు. అది శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చేతులు బలహీనంగా అనిపించడం, దృష్టి మసకబారడం, మెడ వంకరబాటు(Neck stiffness), చర్మ సమస్యలు (స్మార్ట్‌వాచ్ వల్ల ఇరిటేషన్ లేదా ఎక్జిమా) వంటివి పెరుగుతున్నాయి. వీటినే నిపుణులు ‘ఫోన్ బాడీ’ లక్షణాలుగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా మోటార్ స్కిల్స్ (చేతులు, కళ్లు సమన్వయం దారితప్పడం) కూడా దెబ్బతినవచ్చు. ఇక పిల్లల్లో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే ఫైన్ మోటార్ స్కిల్స్ తగ్గి, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌పై ప్రభావం పడవచ్చు అంటున్నారు నిపుణులు.
పరిష్కారాలు
‘ఫోన్‌ను కళ్లకు దగ్గరగా కాకుండా సమాన స్థాయిలో పట్టుకోవాలి. మరీ దగ్గరగా కాకుండా స్క్రీన్ దూరంగా ఉంచాలి. అలాగే 30 నిమిషాలకొకసారి 20 నిమిషాల బ్రేక్ తీసుకోవాలి’ అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్లపాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడటం అనేది 20-20-20 రూల్ కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు. అలాగే చేతుల బలం పెంచడానికి వ్యాయామాలు (గ్రిప్ ఎక్సర్‌సైజెస్) చేయడం, స్మార్ట్‌వాచ్ ధరించే అలవాటు ఉంటే దానిని తీసేసి చర్మం శుభ్రం చేయడం కూడా ముఖ్యమే. హ్యాండ్స్-ఆన్ యాక్టివిటీలు (వంట, రాయడం, ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం) వంటివి చేయడం ద్వారా కూడా మోటార్ స్కిల్స్ మెరుగుపరచవచ్చు ముఖ్యంగా టెక్నాలజీని హెవీగా కాకుండా పరిమితంగా వాడటం, స్క్రీన్ టైమ్ తగ్గించడం వంటివి ‘పోన్ బాడీ’ లక్షణాలను తగ్గిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.






