- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eye health : కళ్లల్లో రెటినా రంగు మారడం.. ఆ వ్యాధి సంకేతమేనా?
కాంతిలో రెటినా గోల్డ్ లేదా గ్రే కలర్‌లో మారి మెరుస్తూ ఉంటే అది ఒగుచి అనే కంటి వ్యాధి లక్షనం కావచ్చు!

దిశ, ఫీచర్స్ : శిశువులు మొదలు కొని పదేళ్లలోపు చిన్నారుల కళ్లు సాధారణంగా మెరుస్తూ.. ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాబట్టి దీనివల్ల ఎటువంటి నష్టమూ లేదు. అయితే రెటినాలో రంగు మారడం, ముఖ్యంగా బంగారు లేదా బూడిద రంగులో (Shiny gold or gray) కనిపిస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు కంటివైద్య నిపుణులు. ఎందుకంటే ఇది అత్యంత అరుదైన ఒగుచి వ్యాధి(Oguchi Disease) లక్షణం కావచ్చునని చెబుతున్నారు. ఇది జన్యు సంబంధిత కంటి వ్యాధి. పుట్టుకతోనే వచ్చే స్థిరమైన నైట్ బ్లైండ్‌నెస్(congenital stationary night blindness)తో కూడుకుని ఉంటుంది. ఇంతకీ ఇదెలా వస్తుంది? లక్షణాలేమిటి? నివారణ ఎలా? తదితర వివరాలను ఇటీవల ఒక సైంటిఫిక్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిపూట ఆ సమస్య..
ఒగుచి అనే అరుదైన జెనెటిక్ రిలేటెడ్ కంటి వ్యాధి ప్రధాన లక్షణం ఏమిటంటే.. కాంతిలో రెటినా (fundus) గోల్డ్ లేదా గ్రే కలర్‌లో మారి మెరుస్తూ ఉంటుంది. చీకటిలో 2 నుంచి 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు ఆ సాధారణ రంగు అదృశ్యమై ఎరుపు రంగు వస్తుంది. ఈ మార్పు కారణంగా కంటి లోపలి భాగం కలర్ మారినట్లు కనిపిస్తుంది. అందుకే కొందరు దీనిని ‘ కంటి రంగు మారడం’ అని వర్ణిస్తుంటారు. ఇది చాలా వరకు శిశువు దశలో, బాల్యంలో మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ వ్యాధి ఉన్నవారికి పగటిపూట చూపు (day vision), రంగుల గుర్తింపు సాధారణంగానే ఉంటాయి. కానీ రాత్రిపూట మాత్రం చూపు తగ్గుతుందని కంటి వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఇది తరచుగా కనిపించే సాధారణ కంటి వ్యాధి కాదు. చాలా అరుదుగా వస్తుంది కాబట్టి. కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే దీని గురించి మరిన్ని అధ్యయనాలు, పరిశోధనలు అవసరమని కూడా వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అరుదైనదే కానీ..
ఒగుచి అనే కంటి వ్యాధి కేసులు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా నమోదవుతున్నాయి. ఉదాహరణకు 2024, 2025, 2026లో కొన్ని కేసులు నమోదైనట్లు మాత్రమే రిపోర్టులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సుమారు 50+ కేసులు మాత్రమే లిటరేచర్‌లో ఉండగా.. జపాన్‌లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇక భారత దేశం విషయానికి వస్తే ఇక్కడ కూడా చాలా అరుదుగానే ఒగుచి కేసులు నమోదయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 1969లో 3 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2018లో ఒక ఏడేళ్ల బాలుడికి, 2019లో ఒక బాలుడికి, 2020, 2024లో సోదరులైన ఇద్దరు బాలురకు ఒగుచి అనే కంటి వ్యాధి సోకింది. 2025లో ఒక ముఖ్యమైన జన్యు అధ్యయనం సందర్భంగా 16 ఒగుచి కేసులు గుర్తించారు. వీటిలో 69% (11/16)కి SAG & GRK1 జీన్ మ్యూటేషన్లు (SAG 38%, GRK1 31%) కనుగొన్నారు. భారత్‌లో జన్యు టెస్టింగ్ పెరగడం వల్ల ఈ ఒగుచి కేసులు వెలుగులోకి వస్తున్నాయని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు.
నివారణ లేదా చికిత్స
ఒగుచి అనేది జన్యుపరమైనది కాబట్టి పూర్తి నివారణ లేదు. ఇది దగ్గరి సంబంధాలలో పెళ్లిళ్లు చేసుకునేవారిలో (ఉదాహరణకు బావ మరదళ్లు) వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఒకే బ్లడ్ రిలేషన్ ఉన్నవారు పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు అరుదుగా ఒగుచి వ్యాధి వచ్చే చాన్స్ ఉంటుందని కంటి వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఒకే జన్యు సంబంధిత సంబంధాలకు దూరంగా ఉండటం నివారణలో ఒక భాగమని చెబుతున్నారు. ఒకసారి ఒగుచి వచ్చాక నిర్దిష్ట చికిత్స లేదు. సపోర్టివ్ కేర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రిపూట చూపు సరిగ్గా ఉండదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించినది కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే కంటి వైద్య నిపుణులను సంప్రదించగలరు.






