గోల్డ్.. రియల్ ఎస్టేట్.. స్టాక్ మార్కెట్.. దేనిపై ఇన్వెస్ట్ చేస్తే బెటర్?

by Javid Pasha |   (  Updated:2026-02-11 12:00:56  IST  )

రియల్ ఎస్టేట్, బంగారం ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది పెట్టుబడిదారులకు సవాల్‌గా మారింది. ఎక్కువ లాభాలు ఎక్కడొస్తే ఆ రంగంవైపే వెళ్తున్నారు.

గోల్డ్.. రియల్ ఎస్టేట్.. స్టాక్ మార్కెట్.. దేనిపై ఇన్వెస్ట్ చేస్తే బెటర్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. తులం రూ.1.70 లక్షలకు చేరువలో ఉన్నది. రూ.2 లక్షలు కూడా కావచ్చు. అయితే ఎక్కడి దాకా? ఎప్పటి దాకా? అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. కాగా గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ విషయాలకు వస్తే పెట్టుబడికి ఏది బెస్ట్? ప్రస్తుతం ఎక్కువ మంది ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఏ రంగం సేఫ్ ? వీటన్నింటికి ఒకే ఒక చక్కటి సమాధానం రియల్ ఎస్టేట్ అంటున్నారు నిపుణులు.

యెస్.. బంగారం, షేర్ మార్కెట్ల కంటే ఇళ్లు, ప్లాట్ల కొనుగోలు ద్వారానే అధిక రాబడి వస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక నిపుణులు ఇదే చెబుతున్నారు. అయితే గోల్డ్, డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లల్లోనూ నష్టాలేమీ ఉండవు. కానీ వీటి పెరుగుదల ఏదో ఒక చోట నిలిచిపోవచ్చు. కానీ భూముల ధరలు ఆగిన దాఖలాలేవీ ఇప్పటి వరకు లేవు. 20 ఏండ్ల క్రితం గజం రూ.1000 ఉన్న చోట.. నేడు రూ.లక్ష దాటింది. అంటే రెండు దశాబ్దాల్లోనే ఇంతటి మార్పు ఉంది కదా అనే సమాధానం వస్తున్నది.

పొదుపు సొమ్ముతో పెట్టుబడి

ఎవరైనా సరే తాము సంపాదించే దాంట్లో ప్రతీ రూపాయిని సంరక్షించుకుంటారు. ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును పొదుపు చేస్తారు. అలా కూడబెట్టిన పెద్ద మొత్తాన్ని ఏదో ఒక‌ రంగంలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వారి భవిష్యత్తు లక్ష్యంగా ఆస్తులను కూడబెట్టాలని భావిస్తారు. ఇలాంటప్పుడే డబ్బు ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే సురక్షితంగా ఉంటుంది? ఎక్కువ రాబడి వచ్చే రంగమేది? అనే ప్రాథమిక సందేహం అందరికీ వస్తుంది. అయితే ఇంతకాలం అందరూ భూములపైనే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపారు. కానీ గడిచిన రెండేండ్లుగా బంగారం, వెండిపై పెట్టుబడులకు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత స్థానంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్‌‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా అందరూ బంగారం వైపే చూస్తున్నారు.

బంగారమే ఆస్తి.. సంస్కృతి

భారతీయ సంప్రదాయంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంది. అలంకరించుకోవడానికే కాదు.. అది సంస్కృతిలో భాగంగా, ఆస్తిగా భావిస్తారు. అందుకే చాలా మంది మహిళలు ఆభరణాల కొనుగోళ్లకే కాకుండా డబ్బులను బంగారంపై పెట్టుబడిగా పెడుతుంటారు. అయితే ఇటీవల ధరలు బాగా పెరుగుతుండటంతో గోల్డ్‌ను ఇన్వెస్ట్మెంట్‌కి కూడా అనువైనది భావిస్తున్నారు. పొదుపు చేసుకున్న డబ్బులతో బంగారం కొనేందుకే ఇష్టపడుతున్నారు. ధరలు పెరగడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయన్న ఆశతో చాలామంది ఉంటున్నారు.

ఏది బెటర్​?

ప్రస్తుతం రియల్ ఎస్టేట్, బంగారం ఈ రెండింటిలో ఏది బెటర్? పెట్టుబడిదారులకు ఇదో పెద్ద సవాల్‌గా మారింది. ఎవరైనా.. ఎక్కువ లాభాలు ఎక్కడొస్తే ఆ రంగంవైపే వెళ్తారు. ప్రస్తుతానికి బంగారం ధర మాత్రమే విపరీతంగా పెరుగుతున్నది. ఇదే క్రమంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మందగించింది. ఏ సెక్టార్‌లోనైనా పెద్దగా బూమ్ లేనప్పుడు పెట్టుబడి పెడితే.. బూమ్ వచ్చినప్పుడు లాభాల పంట పండుతుందని ఆర్థిక నిపుణుల సూచన. దీని ప్రకారం బంగారమా.. రియల్ ఎస్టేట్ రంగమా? అనేది తేల్చుకోవాలి. పెరుగుతున్న బంగారాన్ని కొనాలా? భూమిని కొనాలా? ఇది సంక్లిష్టమే. కానీ తక్కువ ధరకు దొరికే భూమి వైపు ఆలోచించడం కూడా సరైందేనని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.

నివేదికలేం చెబుతున్నాయ్?

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ వెల్త్ కన్వర్సేషన్ రిపోర్ట్ ప్రకారం.. 20 సంవత్సరాల క్రితం రూ.లక్ష బంగారంలో పెట్టుబడి పెడితే.. ఇప్పుడది రూ.15.5 లక్షలు అయ్యింది. అంటే 15% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినట్లు. అదే రూ.లక్ష 20 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడిగా పెడితే.. ప్రాంతాన్ని బట్టి రూ.24 నుంచి 32 లక్షలు అయ్యిందని నివేదిక చెబుతోంది. అంటే సుమారుగా 28 % కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినట్లు.

రియల్ ఎస్టేట్‌లో రెంటల్ ఆదాయం పరిగణనలోకి తీసుకుంటే.. మరి కొంత పెరుగుతుంది. ఈ డేటా ఆధారంగా దీర్ఘ కాలంలో రియల్ ఎస్టేట్ స్థిరత్వం, డ్యూయల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మెరుగ్గా నిలుస్తుందని నిపుణుల అంచనా. గడిచిన 10 నుంచి 15 సంవత్సరాల డేటా చూస్తే బంగారం షార్ట్‌టెర్మ్ ర్యాలీలలో ముందంజలో ఉంటూ వస్తున్నది. కానీ దీర్ఘ కాలంలో రియల్ ఎస్టేట్ బెటర్ ఆప్షన్ అంటున్నారు రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ఇన్వెస్ట్‌మెంట్ సులభమైన ప్రక్రియ. నేరుగా బంగారం కొనుగోలు చేయడంతో పాటు సావరిన్ గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ ద్వారా తక్షణ కొనుగోళ్లు లేదా విక్రయాలు సాధ్యం అవుతాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరాస్తుల కొనుగోలుతో పాటు అమ్మకం విషయంలో మార్కెట్‌కు పరిస్థితులకు అనుగుణంగా కొంత ఎదురుచూడాల్సి వస్తుంది.

Next Story