డబ్బులు కట్టినా.. ఫ్లాట్ ఇవ్వడం లేదా..? ఇలా చేయండి!

by Javid Pasha |   (  Updated:2026-05-13 06:05:06  IST  )

అందమైన బ్రోచర్లను చూసి ఆ రంగుల ప్రపంచం నిజమేననుకొని కొందరు ప్రీలాంచ్ కింద, మరికొందరు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్లాట్లు బుక్ చేస్తారు.

డబ్బులు కట్టినా.. ఫ్లాట్ ఇవ్వడం లేదా..? ఇలా చేయండి!
X

దిశ, తెలంగాణ బ్యూరో:ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. దాని కోసం 20, 30 ఏండ్లు శ్రమిస్తారు. అప్పటి దాకా ఈఎంఐలు చెల్లించడానికైనా సిద్ధపడారు. రూ. కోటి ఒకేసారి చెల్లించడం వీలు కాదు. కానీ అడ్వాన్స్ చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకోవడం, ఆ తర్వాత వాయిదాల పద్ధతిన మిగతా అమౌంట్ చెల్లించడం సహజంగానే జరుగుతుంది. ఇందుకుగాను బిల్డర్ ఫ్లాట్ అందించేందుకు ఓ గడువు చెప్తాడు. ఆ గడువు కోసం కస్టమర్లు ఎదురుచూస్తుంటారు. కానీ కొందరు గడువు ముగుస్తున్నా స్లాబ్స్ కూడా వేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు.

అనుమతులు, నిర్మాణం, డబ్బుల సర్దుబాటులో లోపాలు వంటి కారణాలు చూపిస్తూ ఏండ్లు గడుపుతుండడం చూస్తున్నాం. కస్టమర్లు చెల్లించిన డబ్బులను మరో ప్రాజెక్టు కోసమో, భూముల కొనుగోలుకో వినియోగించడం.. అసలు ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బుల కొరత ఏర్పడిందని చేతులెత్తేయడం వింటూనే ఉన్నాం. ఇలా కంపెనీలు రూ. వందల కోట్లు మూట గట్టుకొని జెండా ఎత్తేసినవి ఉన్నాయి. కొందరు యజమానులు జైలు పాలైన ఘటనలు కూడా ఉన్నాయి. ఐతే ఇక్కడ ఏ కంపెనీ కూడా ఆర్థికంగా నష్టపోదనేది వాస్తవం. ఫ్లాట్ల కోసం కస్టమర్ల నుంచి సేకరించిన అమౌంట్‌ను మరో ప్రాజెక్టులో వెచ్చించడం, భూములు కొనుగోలు చేయడం ద్వారా రెట్టింపు లాభాలను ఆర్జిస్తారు. వాటి గురించి నష్టపోయిన కస్టమర్లకు తెలియకుండా జాగ్రత్త పడడం వీరి కన్నింగ్ మెంటాలిటీ.

అందమైన బ్రోచర్లు

ఎత్తయిన బిల్డింగ్. హైరైజ్డ్.. ఇంట్లో విండో నుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. చల్లటి గాలి, వెలుతురుకు ఎలాంటి ఢోకా లేదు. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. క్లబ్ హౌజ్, క్రీడా మైదానాలు, ఇండోర్ గేమ్స్, అవుట్ డోర్ స్టేడియం.. ఒక్కటేమిటి స్కూల్, కాలేజీ, షాపింగ్ మాల్.. అన్నీ బ్రోచర్‌లో దర్శనమిస్తాయి. దాన్ని చూసి రంగుల ప్రపంచం నిజమేననుకొని కొందరు ప్రీలాంచ్ కింద, మరికొందరు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద.. ఫ్లాట్లు బుక్ చేస్తారు. ఇంకొందరు అన్ని రకాల అనుమతులు వచ్చాయని డబ్బులు చెల్లిస్తారు. మూడేండ్లల్లో గృహ ప్రవేశం చేయొచ్చు. మీ పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చే సరికి ఇక్కడే ఉండొచ్చునంటూ ఏజెంట్లు నమ్మిస్తారు. ఏజెంట్ల మాటలు నమ్మి, అందమైన బ్రోచర్లు చూసి కూడబెట్టిన సొమ్ము, బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ అమౌంట్.. అంతా కట్టి రశీదులు తీసుకుంటారు. కానీ నాలుగు, ఐదు ఏండ్లయినా ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. ఫ్లాట్ చేతికి అందదు. గృహ ప్రవేశం మాట అంటుంచితే.. అది కళ్ల ముందు వెక్కిరిస్తూ కనిపిస్తుంది. సమాధానం చెప్పేందుకు అసలు యజమాని దొరకడు. దొరికినా టైం లేదంటాడు. మీటింగ్స్ అంటూ దాటవేత ధోరణి అవలంభిస్తాడు. చెల్లించిన అమౌంట్‌కి వడ్డీలు కడుతుంటారు, కానీ సొంతిల్లు మాత్రం రాదు.

అప్పుడేం చేయాలి?

ఫ్లాట్ బుక్ చేసుకుని సంవత్సరాలుగా ఇల్లు రాకపోతే? బిల్డర్‌పై ఎలాంటి చర్య తీసుకోవాలి? చాలా మంది జీవితాంతం సంపాదించిన డబ్బుతో ఫ్లాట్ బుక్ చేస్తారు. ఇక ప్రాజెక్ట్ సంవత్సరాల పాటు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఓవైపు ఈఎంఐలు కడుతుంటారు కానీ, ఇల్లు మాత్రం రాదు. అలాంటి సమయంలో “ఏం చేయాలి?” అనేది తెలుసుకోవాలి. ఆలస్యం చేస్తే కస్టమర్ నష్టపోవాల్సిన అవసరం లేదు. చట్టం రక్షణనిస్తుంది. ఈఎంఐలు చెల్లిస్తూ ఫ్లాట్, ఇల్లు వచ్చిన నాడు వచ్చిందనుకుంటే పొరపాటు. హక్కు కోసం పోరాడాలి. అప్పుడే వడ్డీతో సహా చెల్లించిన సొమ్మయినా వస్తుంది. లేదంటే ఇల్లయినా దక్కుతుంది.

నిజాలు ఏమిటి?

*బిల్డర్ హామీ ఇచ్చిన సమయానికి ఫ్లాట్ అందించాలి. లేదంటే చట్టపరంగా అది తప్పు.

*ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము వాపస్ చేయాలి. వడ్డీతో సహా చెల్లించాలి. అలా అడిగే హక్కు కొనుగోలుదారుడికి ఉంది.

*రెరా(తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ) చట్టం ప్రకారం సదరు కంపెనీ లేదా బిల్డర్ బాధ్యతలు స్పష్టంగా ఉన్నాయి.

*ఫ్లాట్ అందించడంలో ఎంత ఆలస్యమైతే అంత మేరకు నష్టపరిహారాన్ని కోరే హక్కు ఉంది.

*అందుకే అగ్రిమెంట్ టైం లైన్ చాలా ప్రధానం.

పరిష్కారానికి ఏం చేయాలి?

*సదరు కంపెనీ లేదా బిల్డర్‌‌కు లిఖిత పూర్వకంగా నోటీసు ఇవ్వాలి. దానికి ఏం సమాధానం వస్తుందో చూడాలి.

*ఆ తర్వాత రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ)లో ఫిర్యాదు చేయాలి.

*అవసరమైతే వినియోగదారుల కోర్టులో కేసు కూడా పెట్టొచ్చు.

*ఐతే అగ్రిమెంట్ పత్రాలు, బ్రోచర్లు, హామీ పత్రాలు, డబ్బులు చెల్లించిన రశీదులను భద్రంగా ఉంచుకోవాలి.

Read More.. పెట్టుబడి పెడదాం రండి.. నిమ్జ్‌తో భవిష్యత్ బంగారం!

Next Story