Memories : అడవిలో ఆ రోజు..!

by Javid Pasha |

ఏ మర్రి చెట్ల మీది నుంచి వాటి కొమ్మలనూ, రెమ్మలనూ స్పృశిస్తూ వచ్చిందో కానీ.. ఒక చల్లటి పవనం మా ముఖాలను, వీపులను తడిమినట్టు అయింది.

Memories : అడవిలో ఆ రోజు..!
X

దిశ, ఫీచర్స్ : పట్ట పగలు.. మిట్ట మధ్యాహ్నం.. దట్టమైన చిట్టడవి.. దాని పక్కనే మా వ్యవసాయ పొలం. అసలే ఎండాకాలం. బాగా ఉబ్బరిస్తోంది. వేసవి సెలవులు కాబట్టి నేను కూడా మా అమ్మా, నాన్న, నానమ్మలతో కలిసి పొలం దగ్గరే ఉన్నాను. చుట్టు పక్కల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎప్పుడూ చల్లటి గాలి వీచేది కానీ.. ఆ రోజు మధ్యాహ్న సమయంలో ఎందుకో వాతావరణం స్తంభించినట్లు ఉంది. ముఖ్యంగా గాలి వీయడం లేదు. చెట్లు ఊగడం లేదు. అప్పుడప్పుడూ ఇది సహజమే. కొన్నిసార్లు గాలి కూడా రెస్టు తీసుకుంటదో ఏమో కానీ..! స్తంభించిపోతూ ఉంటుంది. సరిగ్గా ఆ రోజు అదే జరిగింది.

చల్లగాలి కోసం..

అంతలోనే మా పొలం పక్కన ఉండే పిల్లలు కూడా వచ్చేశారు. బాగా ఉబ్బరిస్తుంది కదరా.. అడవిలోకి వెళ్తే చల్లగా ఉంటుందేమో పోదాం పదండి అనుకొని అందరం కలిసి మా పొలాలు దాటి అడవిలోకి వెళ్తున్నాం. ఏ మర్రి చెట్ల మీది నుంచి వాటి కొమ్మలనూ, రెమ్మలనూ స్పృశిస్తూ వచ్చిందో కానీ.. ఒక చల్లటి పవనం మా ముఖాలను, వీపులను తడిమినట్టు అయింది. ఏ మద్దిమానుల నీడలో నుంచి దిగ్గున లేచి వచ్చిందో కానీ.. ఆ చల్లగాలి మా కోసమే వచ్చిందేమో అనిపించింది ఆ క్షణం. హాయిగా అందరం దానిని ఆస్వాదిస్తూ అలాగే లోపలికి వెళ్తున్నాం.

అందరం కలిసి..

అప్పుడ నా వయసు పదేండ్లలోపే. నాతోపాటు ఉన్న దోస్తుగాల్ల ఏజ్ కూడా దాదాపు అంతే మహా అయితే ఒకటి రెండు సంవత్సరాలు ఇటూ ఇటూ కావచ్చు. మేం మొత్తం నలుగురం ఉన్నాం. అలా అడవిలోకి వెళ్తూ ఉండటం, చల్లగా అనిపిస్తూ ఉండటంతో ఇంకా ముందుకు పోతున్నాం. నిజానికి మాకు అడవిలో తిరగడం కొత్తేం కాదు. మా అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య లేదా పొలం పక్కన ఉండే వాళ్లు పెద్దలు ఎవ్వరు అడవికి వెళ్లినా మేం కూడా వెంటపోయేవాళ్లం. కొన్నిసార్లు ఎండాకాలంలో మా నానమ్మ, తాతయ్య తునికాకుకోసం, చిర్మన్ అంటు(చిగురు) కోసం అడవికి వెళ్తే నేను కూడా వెంట వెళ్లేవాన్ని, మరికొన్నిసార్లు పిల్లలం అందరం కలిసి కూడా పెద్దల వెంబడి అడవికిపోయేవాళ్లం.

తప్పిపోయాం కానీ..

అడవిలో తిరిగిన అలవాటే కానీ.. ఆ రోజు సంతోషంలో అడవిలోకి ఎంత దూరం నడుచుకుంటూ పోయామో మాకే తెల్వదు. తిరిగి వద్దామని ప్రయత్నిస్తే అడవిలోకే పోతున్నాం కానీ.. మా చేను బాట దొరకడం లేదు. అంటే అప్పుడర్థమైంది. మేం తప్పిపోయాం అని. అయినా మాకు పెద్దగా భయం అనిపించలేదు. ఎందుకంటే.. అడవికి చుట్టు పక్కల పొలాల వాళ్లు, చుట్టు పక్కల ఊర్లవాళ్లు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఎవరైనా కలిస్తే వారి వెంబడి వెళ్తాం అని ఒక దగ్గర గుట్టమీదకు పోయి అక్కడ పొన్న చెట్టు కింద బండ మీద కూర్చున్నాం. నిజానికి ఆ చెట్టుకింద బండ దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ప్రకృతి మలిచిన అద్భుతం కావచ్చు. కానీ మాకోసమే అన్నట్లు తోచింది ఆ సమయంలో. అక్కడ కూర్చున్న మాకు అడవి వాతావరణం కొంత సేపు నిశ్శబ్దంగా, మరికొంత సేపు భయంకరంగా తోస్తోంది.

ఆ వాతావరణమే వేరు..

రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు నెమళ్లు, మరికొన్నిసార్లు గుడ్లగూబలు, ఇంకొన్నిసార్లు నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. చుట్టూ పచ్చటి అడవి, కొండలు, రకరకాల పక్షలు, జంతువుల శబ్దాలు నిజంగా అడవి వాతావరణం ఎంత బాగుంటుందో అసలు. యాదికొస్తే ఇప్పటికీ అడవికిపోయి ఒక్కరోజైనా ఉండిరావాలనిపిస్తుంది. అంతబాగుంటుంది అడవి అనుబంధం. సమయం గడుస్తోంది. మేకలకాడికి వచ్చిన వాళ్లు, తునికాకు కోసం వచ్చిన వాళ్లు మమ్మల్ని పలకరిస్తు్న్నారు. కానీ వారంతా వేరేవైపు వెళ్లేవాళ్లు. ఏమైందో ఆ రోజు మా పొలాలవైపు వెళ్లేవారు ఒక్కరు కూడా కనబడలేదు.

ఆ రోజులు.. ఆ అనుబంధాలే వేరు..

సమయం మించిపోతోంది. అప్పటికే సాయంత్రం నాలుగ్గంటు కావస్తోంది కావచ్చు. ఇక ఇలాగే ఉంటే రాత్రంతా అడవిలోనే ఉండాల్సి వస్తుందనుకొని, అక్కడ నుంచి కాస్త ముందుకు కదిలాం. అక్కడ ఎత్తైన చెట్లపై ఎక్కి మా అమ్మ, నాన్న, నానమ్మ, పొలం పక్కవాళ్ల పేర్లతో గట్టిగా పిలువడం మొదలు పెట్టాం. చెట్లు కొండల మధ్య ప్రతిధ్వనులతో ఆ శబ్దం పెద్దగానే ధ్వనిస్తోంది. మా వ్యవసాయ పొలం దగ్గర వాళ్లకు కూడా వినిపించింది. వాళ్లకు కూడా అర్థమైంది. వీళ్లు తప్పి పోయారని.. మా నాన్న, మా పొలం పక్కన ఉండే కొండయ్య మామ కలిసి అక్కడికి వచ్చారు. ముందు జాగ్రత్తగా ముంతలో నీళ్లు కూడా పట్టుకొచ్చారు. అప్పటికే కాస్త దాహంతో ఉన్నమేము ఆ నీళ్లు గట గటా తాగేశాం. వాళ్లు నవ్వుతూ ఇక్కడికి ఎందుకు వచ్చారురా చెట్లు దట్టంగా ఉంటాయి. మీకు బాట తెల్వదు అన్నారు. మేం చల్లగాలికోసం అంటూ ముసి ముసి నవ్వాం. ఇక అందరం కలిసి మళ్లీ మా పొలంవైపు అడుగులు వేశాం. అడవిలో తప్పిపోయిన ఆ రోజు, ఆ దోస్తులు, మాకు పొలం పక్కవాళ్లు, మా మధ్య ఉన్న ప్రేమాను బంధాలు ఇప్పటికీ నా మదిలో పదిలమే. అప్పుడప్పుగూ గుర్తుకు వస్తూ అడవివైపు పానం లాగుతూ ఉంటుంది కూడా!

- మొహమ్మద్ జునైద్

Next Story