- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Memories : దృశ్యం వెనుక కథ.. కొన్ని క్షణాలు ఆగుతూ.. వింతగా చూస్తూ..
అతని తలపై కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదో అనుమానంతో కొన్ని క్షణాలు ఆగుతూ.. వింతగా చూస్తూ వెళ్తున్నారు.

దిశ, ఫీచర్స్ : ఉదయం 8 గంటలు. ఆ ప్రాంతమంతా వచ్చీపోయే జనాలతో రద్దీగా ఉంది. కొందరు టూవీలర్లపై వస్తుంటే.. మరికొందరు నడచుకుంటూ వెళ్తున్నారు. కొందరు ఫోన్లల్లో ఏదో మాట్లాడుకుంటూ ముందుకు సాగుతుంటే.. ఇంకొందరు చేతుల్లో సంచులు పట్టుకొని అటూ ఇటూ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. అలా ఎవరికి వారు బిజీ బిజీగా వెళ్తున్న జనం మాత్రం అక్కడికి రాగానే ఒక్కసారిగా ఆగి, అటువైపు ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు పోతున్నారు. సరిగ్గా అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న నేనూ అదే చేశారు. అందరితోపాటూ ఆ దృశ్యం నన్ను కూడా ఆశ్చర్యపరిచింది. అయితే అందరూ ఎవరి దారిన వారు వెళ్లసాగారు. నేను మాత్రం అసలు విషయం తెలుసుకునే వెళ్లాలన్న ఉత్సుకతతో అక్కడే ఆగిపోయాను. ఇంతకీ ఏమిటీ రద్దీ ప్రాంతం, ఏమిటా వింత దృశ్యం అనే కదా మీ సందేహం. లెట్స్ గో అండ్ రీడ్!
కొన్ని క్షణాలు ఆగుతూ.. వింతగా చూస్తూ..
ఆ ప్రాంతమేదో కాదు.. బెంగళూరులోని న్యూ తిప్పాసంద్ర మార్కెట్. ఆ వింత దృశ్యమేదో కాదు.. ఓ కూరగాయల వ్యాపారి తలపై ఏఐ హెడ్‌గేర్ ధరించి తన వ్యాపారం తాను కొనసాగిస్తున్నాడు. కానీ.. మార్కెట్లో ఎన్నడూ లేనిది, అక్కడి జనాలెవరూ ఎప్పుడూ ధరించనిది అతని తలపై కొత్తగా కనిపించేసరికి అటు నుంచి పోయే జనాలంతా ఆశ్చర్యపోతున్నారు. అదేమిటో అనే అనుమానంతో కొన్ని క్షణాలు ఆగుతూ.. వింతగా చూస్తూ వెళ్తున్నారు. నేను కూడా వెళ్లాను కాబట్టి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేశాను. అతను పేరు చెప్పలేదు కానీ.. ఓ ఏఐ ఆధారిత కంపెనీ కోసం అలా చేస్తున్నాని, అందుకు గాను తనకు పారితోశికం కూడా ఇస్తున్నారని పేర్కొన్నాడు. అంటే.. ఆ కూరగాయల విక్రేత తన రోజువారీ పనిచేస్తూనే ఏఐ డేటాకోసం ప్రత్యేక హెడ్‌గేర్ ధరిస్తున్నాడు.
హెడ్‌గేర్ ధరించి.. ఐఫోన్ అమర్చి..
సదరు కూరగాయల విక్రేత హెడ్‌గేర్ పరికరంలో ఐఫోన్‌ను నుదురు భాగంలో అమర్చి, మెమరీ కార్డ్‌తో కలిపి రియల్-వరల్డ్ డేటాను సేకరిస్తున్నాడు. అందుకుగాను సదరు కంపెనీ తనకు గంటకు రూ. 350 చొప్పున చెల్లిస్తోందని, నిబంధనల ప్రకారం ఆ కంపెనీ పేరు బహిర్గతం చేయలేనని స్పష్టం చేశాడు. అయితే ఈ అవకాశం ద్వారా నెలకు సుమారు లక్ష రూపాయలు సంపాదించే చాన్స్ వచ్చిందని, కాకపోతే ఈ ఆఫర్ ఎప్పటికీ ఉండదని పేర్కొన్నాడు. ఇదంతా నేను మీతో ఎందుకు పంచుకోవాల్సి వచ్చిందంటే.. ఆధునిక కాలంలో ఏఐ టెక్నాలజీ సాధారణ జీవితాల్లో సైతం భాగమవుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా అనేక రూపాల్లో మానవ జీవితాలను ప్రభావితం చేస్తుందని గుర్తు చేయడమే. అంతేకాకుండా ఆ దృశ్యం మారుతున్న కాలాన్ని కళ్లకు కట్టడమే కాకుండా, సాంకేతిక యుగంలో మానవులు మారాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తూ.. భవిష్యత్తును కళ్లకు కట్టింది. కాబట్టి ఆ రోజు నా జీవితంలో ఎదురైన ఈ సంఘటన కేవలం ఒక దృశ్యమే కాదండోయ్.. అదొక ప్రపంచ భవిష్యత్ దర్శనం కూడా..!
- వైభవ్






