- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Yoga Day 2026 : ఆనందం, ఆరోగ్యం.. యోగాతో అన్నీ సాధ్యం!
శరీరం, మనస్సు, శ్వాసను ఒకదానితో ఒకటి అనుసంధానించే ఒక ప్రాచీన భారతీయ జీవన విధానమే యోగా

దిశ, ఫీచర్స్ : జీవితంలో కొన్నింటిని పూర్తిగా కోల్పోయినా తిరిగి కొంతకాలానికి సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని కోల్పోతేనే కష్టం అంటారు పెద్దలు.. నిపుణులు. అందుకే ఆరోగ్యంపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయని చెబుతుంటారు. అలాంటి వాటిలో యోగా కూడా ఒకటి. 2026, జూన్ 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం చాలామంది దీని చర్చించుకుంటున్నారు. ఇంతకీ యోగా అంటే ఏమిటి? దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యోగా అంటే ఏమిటి?
‘యోగా’ అనే పదం సంస్కృత మూలమైన ‘యుజ్’ నుండి వచ్చింది. దీని అర్థం ‘జత చేయడం’ లేదా ‘ఏకం చేయడం’ సాధారణ భాషలో చెప్పాలంటే, మన శరీరం, మనస్సు, శ్వాసను ఒకదానితో ఒకటి అనుసంధానించే ఒక ప్రాచీన భారతీయ జీవన విధానమే యోగా. ఇందులో కేవలం శారీరక ఆసనాలు (వ్యాయామం) మాత్రమే కాకుండా, ప్రాణాయామం (శ్వాస నియంత్రణ), ధ్యానం (Meditation), కొన్ని నియమ నిబంధనలు భాగమై ఉంటాయని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇది మనిషిని శారీరకంగా దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఏ వయసు వారు చేయవచ్చు?
యోగా చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. ఐదేళ్లు పైబడిన పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా చేయవచ్చు. ఇది కూడా ఒక రకమైన వ్యాయామం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు ఆటపాటలతో కూడిన సులువైన ఆసనాలు చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో మానసిక ప్రశాంతత కోసం, బరువు నియంత్రణ కోసం, శారీరక ఫిట్‌నెస్ కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి యువత, మధ్య వయస్కులు కూడా దీని పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు తగ్గడానికి, శరీరం సులువుగా కదలడానికి (Mobility), మానసిక ఉల్లాసానికి తేలికపాటి యోగాసనాలు, ప్రాణాయామం అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
రోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా కండరాలు, కీళ్లు సాగే గుణాన్ని (Flexibility) సంతరించుకుంటాయి. దీనివల్ల బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ధ్యానం, శ్వాస ప్రక్రియల వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలు తగ్గి, డిప్రెషన్ వంటి సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా యోగా వల్ల రక్తప్రసరణ బాగా జరిగి, రక్తపోటు (Blood Pressure) అదుపులో ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల నిద్రలేమి (Insomnia) సమస్యలు తొలగిపోయి, గాఢ నిద్ర పడుతుంది. ఇక క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, శ్వాసకోస సమస్యలు తగ్గుతాయి. వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. కొన్ని రకాల యోగాసనాలు పొట్ట భాగంలోని అవయవాలను ఉత్తేజపరిచి, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
*గమనిక: గర్భిణులు, వెన్నునొప్పి, గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం యోగా చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే.. ముందుగా నిపుణులైన యోగా బోధకులు(Instructor) లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే చేయాలి.






