హెపటైటిస్ బి & సి వైరస్‌లతో లివర్ డ్యామేజ్..! జాగ్రత్తలివిగో..

by Javid Pasha |   (  Updated:2026-01-06 12:21:57  IST  )

హెపటైటిస్ బి అండ్ సి రెండూ తీవ్రమైతే లివర్ ఇన్‌ఫ్లమేషన్‌ను(హెపటైటిస్) కలిగిస్తాయి. ఇది దీర్ఘకాలికమైతే సిర్రోసిస్ (లివర్ స్కారింగ్), లివర్ ఫెయిల్యూర్, అలాగే హెపటోసెల్యులార్ కార్సినోమా (లివర్ క్యాన్సర్)కు దారితీస్తుంది.

హెపటైటిస్ బి & సి వైరస్‌లతో లివర్ డ్యామేజ్..! జాగ్రత్తలివిగో..
X

దిశ, ఫీచర్స్ : హెపటైటిస్ బి (Hepatitis B) అనేది హెపటైటిస్ బి వైరస్ (HBV) వల్ల కలిగే లివర్ (కాలేయం) ఇన్ఫెక్షన్, ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలిక వ్యాధిని కలిగిస్తుంది. హెపటైటిస్ సి (Hepatitis C) అనేది హెపటైటిస్ సి వైరస్ (HCV) వల్ల వచ్చే, రక్తం ద్వారా సంక్రమించే లివర్ ఇన్ఫెక్షన్, ఇది తేలికపాటి నుండి జీవితకాల వ్యాధి వరకు ఉండవచ్చు. ముఖ్యంగా సిర్రోసిస్ అండ్ లివర్ క్యాన్సర్‌కు దారితీస్తుంది.

వైరస్‌లుఎలా సోకుతుంది?

హెపటైటిస్ బి వైరస్ ప్రధానంగా తల్లిలో ఉంటే బిడ్డకు సంక్రమిస్తుంది. లేదా బాల్యంలో (ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు), వైరస్ కలిగిన వ్యక్తుల శరీర ద్రవాలు, రక్తం ద్వారా, అపరిశుభ్రమైన చికిత్సల ద్వారా, పచ్చబొట్లు లేదా టాటూలు వేయించుకోవడంవల్ల సంక్రమించే అవకాశం ఎక్కువ. వయోజనులలో సంక్రమణ తక్కువగా ఆలస్యంగా బయటపడుతుంది. బాల్యంలో 95% వరకు త్వరగా సంక్రమిస్తుంది.

ఇక హెపటైటిస్ సి వైరస్ ప్రధానంగా ఇప్పటికే అది సోకిన రక్తం మరొకరికి పొరపాటున ఎక్కించడం ద్వారానో, సూదులు షేర్ చేయడం ద్వారానో, అసురక్షిత మెడికల్ ప్రొసీజర్లు, అస్క్రీన్డ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ద్వారా సంక్రమిస్తుంది. తల్లికి ఉంటే బిడ్డకు సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. కానీ చాలా తక్కువ. అయితే ఇది బ్రెస్ట్ మిల్క్, ఆహారం, నీరు లేదా సాధారణ స్పర్శ సంబంధాల ద్వారా సంక్రమించదు.

ఏం జరుగుతుంది?

హెపటైటిస్ బి అండ్ సి రెండూ తీవ్రమైతే లివర్ ఇన్‌ఫ్లమేషన్‌ను(హెపటైటిస్) కలిగిస్తాయి. ఇది దీర్ఘకాలికమైతే సిర్రోసిస్ (లివర్ స్కారింగ్), లివర్ ఫెయిల్యూర్, అలాగే హెపటోసెల్యులార్ కార్సినోమా (లివర్ క్యాన్సర్)కు దారితీస్తుంది. హెపటైటిస్ బి దీర్ఘకాలికమైతే 15-25% మందిలో ఈ సమస్యలు వస్తాయి. 2022లో దీనివల్ల 1.1 మిలియన్ మరణాలు సంభవించాయి. ఇక హెపటైటిస్ సి దీర్ఘకాలికమైతే 70% మందిలో వస్తుంది. HIV ఉన్నవారిలో ఇది మరింత తీవ్రమవుతుంది.

లక్షణాలు ఏమిటి?

హెపటైటిస్ బి, సి రెండు వైరస్‌ల లక్షణాలు సేమ్ టు సేమ్ ఉంటాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లో జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, ఉదర నొప్పి, యూరిన్ ముదురు రంగులో రావడం, మలం తేలికగా ఉండటం, జాయింట్ పెయిన్, జాండిస్ (చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి) వంటి లక్షణాలు ఉండవచ్చు. చాలా మందిలో లక్షణాలు లేకుండా కూడా హెపటైటిస్ ఉంటాయి. అది దీర్ఘకాలంగా కొనసాగితే దశాబ్దాల తర్వాత లివర్ డ్యామేజ్ లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కేసుల్లో లివర్ ఫెయిల్యూర్ మరణానికి దారితీయవచ్చు.

నివారణ-చికిత్స

హెపటైటిస్ బి నివారణ కోసం సురక్షితమైన వ్యాక్సిన్ (పుట్టిన వెంటనే ఇవ్వాలి, బూస్టర్ డోసులు) దాదాపు 100% రక్షణ ఇస్తుంది. హెపటైటిస్ సి కోసం వ్యాక్సిన్ లేదు. కానీ ఒకరికి వాడని సూదులు, మరొకరికి వాడటం, బ్లేడ్‌లు ఉపయోగించడం వంటివి చేయకుండా ఉండాలి. సేఫ్ మెడికల్ ప్రాక్టీసెస్, స్క్రీన్డ్ బ్లడ్, సేఫ్ సెక్స్ వంటివి నివారణ చర్యల్లో భాగం.

చికిత్స విషయానికి వస్తే.. హెపటైటిస్ బి తీవ్రమైనదైతే సపోర్టివ్ కేర్ (విశ్రాంతి, డైట్, ఫ్లూయిడ్స్) అవసరం అవుతుంది. వైద్య నిపుణులు చికిత్స అందిస్తారు. ఒకవేళ అది దీర్ఘకాలికమైతే యాంటీవైరల్ మందులు (టెనోఫోవిర్, ఎంటెకావిర్) జీవితకాలం తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల సిర్రోసిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. హెపటైటిస్ సి నివారణకు డైరెక్ట్-యాక్టింగ్ యాంటీవైరల్స్ (DAAs) లాంటి ఓరల్ మందులు (సోఫోస్బువిర్, డాక్లాటాస్విర్) 12-24 వారాలు తీసుకుంటే 95% క్యూర్ అవుతుంది. ఆల్కహాల్ తీసుకోకపోవడం, హెల్తీ వెయిట్ మెయింటెయిన్ చేయడం వంటివి సహాయపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story