యువర్ రీడింగ్ సర్కిల్.. పార్కులే పుస్తక నిలయాలు

by Daayi Srishailam |

యువర్ రీడింగ్ సర్కిల్ ఇప్పుడు పుస్తక ప్రేమికులను ఒకే చోటుకు చేర్చే వేదికగా మారింది

యువర్ రీడింగ్ సర్కిల్.. పార్కులే పుస్తక నిలయాలు
X

దిశ, ఫీచర్స్: ఇప్పుడంతా ఆధునిక జీవితం. పాష్ లైఫ్ స్టయిల్. స్క్రీన్లు, స్వయిప్‌ల మధ్య చదవడం నేటి యువతకు ఒక పీస్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఐతే.. ఈ సౌకర్యాన్ని గదుల్లో లేదా లైబ్రరీలకు మాత్రమే పరిమితం చేయకుండా పార్కుల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేశారు అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు కాలేజీ ఫ్రెండ్స్.

పుస్తక ప్రేమికుల సోపతి..

హీత్ దోషి.. ఓమ్ ఠక్కర్ కాలేజీ ఫ్రెండ్స్. యువత ఎక్కువగా వచ్చే పార్కులను ఉచిత మినీ పుస్తకాలయాలుగా మార్చాలనేది వారి ఆలోచన. పుస్తక లోకానికి దూరమవుతున్న నగర యువతను రీడింగ్‌కు దగ్గర చేయాలనుకున్నారు వాళ్లు. ఆ ఆలోచనతో "యువర్ రీడింగ్ సర్కిల్"ను ప్రారంభించారు. చదవడం పట్ల ప్రేమను పెంచడమే తమ ఆలోచన. చదవడమంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు. ఆలోచనలు పంచుకోవడం.. చర్చించడం కూడా అందులో భాగమే. 2023లో ప్రారంభించిన "యువర్ రీడింగ్ సర్కిల్" ఇప్పుడు పుస్తక ప్రేమికులను ఒకే చోటుకు చేర్చే వేదికగా మారింది.

స్నేహాలకు వేదిక..

పార్కులను ఉచిత పుస్తకాలయాలుగా మార్చాలనే ఆలోచనను తొలుత వాట్సాప్ గ్రూప్‌లు.. బుక్ క్లబ్‌లు.. వీకెండ్ గ్యాదరింగ్స్‌లో పంచుకొని సమాచారాన్ని విస్తరింపజేశారు. దీనికి చాలామంది కనెక్ట్ అయ్యారు. వాస్తవానికి ప్రస్తుతం అసలు పుస్తకాల గురించి చర్చించుకునే అవకాశాలే లేవు. అంతా స్మార్ట్.. డిజిటలైజ్డ్ ఉపకరణాలే వాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లాంచ్ చేసిన తమ స్టార్టప్‌ కాన్సెప్ట్‌ను చాలా తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆలోచనలు పంచుకోవడం.. స్నేహాలు ఏర్పరచుకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారిపోయింది. ఆలోచన వినూత్నంగా ఉండటంతో అన్నిరకాల వాళ్లు కనెక్ట్ అయ్యారు.

పరిమల్‌లో ఫస్ట్ లైబ్రరీ..

తమ ఆలోచనను అమలు చేయడానికి హీత్.. ఓమ్‌ కేరళలోని పెరుంకులం గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. అక్కడ ప్రతీ రెండు మూడు వందల మీటర్లకొక చిన్న పబ్లిక్ లైబ్రరీ ఉంటుంది. ఇవి విజయవంతం కావడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రజలను ఎలా ఆకర్షితులను చేయాలో తెలుసుకొని కొతకాల పాటు ఈ అంశంపై అధ్యయనం చేశారు. ప్రజలు ఉదయం.. సాయంత్రాలు పార్కులను సందర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారని గ్రహించి.. తమ మినీ లైబ్రరీలకు వాటినే కేంద్రాలుగా ఎంచుకున్నారు. అలా పరిమల్ గార్డెన్‌లో మొదటి మినీ లైబ్రరీని ఏర్పాటు చేశారు.

ఐదు లైబ్రరీలు..

ప్రతి లైబ్రరీకి ఇద్దరు వాలంటీర్లను పెట్టారు. పుస్తకాల నిర్వహణ.. క్లీనింగ్ మాత్రమే కాదు.. లైబ్రరీకి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు ఈ వాలంటీర్లు. దీనిద్వారా తమ కాన్సెప్టును తెలియజేయడంతో పాటు మరికొంతమంది రీడర్లను.. వాలంటీర్లను.. డోనర్లను ఆకర్షింపజేస్తున్నారు. దీంతో "యువర్ రీడింగ్ సర్కిల్" చేస్తున్న ప్రయత్నం గురించి ఇప్పుడు ఇతర నగరాలకే కాదు.. దేశాలకు కూడా వ్యాపించింది. అహ్మదాబాద్‌లో ఇలాంటివి ఐదు మినీ లైబ్రరీలు ఉన్నాయి. రోజూ 15-20 మంది పుస్తకాలు మారుస్తుంటారు. సొసైటీ గురించి చర్చిస్తుంటారు జనాలు.

Next Story