- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వయసు పెరిగినా గుండె సామర్థ్యం తగ్గకూడదంటే.. మీరు చేయాల్సింది ఇదే!
డీహైడ్రేషన్ అనేది ఒక ప్రమాదక పరిస్థితి. రక్తం మందంగా మారి, గుండె ఆక్సిజన్‌ను శరీరం అంతటా పంపడానికి అధిక శ్రమపడాల్సి వస్తుంది.

దిశ, ఫీచర్స్ : వయసు పెరిగేకొద్దీ శరీరంలోని అవయవాల పనితీరులోనూ మార్పు వస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యం సమీపిస్తున్నప్పుడు కణాల క్షీణత, గుండె సామర్థ్యం మునుపటికంటే తగ్గడం వంటివి సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఏజ్‌తో పాటు గుండె సామర్థ్యం త్వరగా క్షీణించకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ సరైన మోతాదులో నీరు తాగుతూ.. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH) పరిశోధనలు కూడా ఈ పద్ధతి ఏజ్ పెరిగే కొద్దీ గుండె సామర్థ్యం తగ్గడాన్ని నెమ్మదింపజేస్తుందని, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొన్నది.
గుండెపై ఒత్తిడి
వాస్తవానికి డీహైడ్రేషన్ అనేది ఒక ప్రమాదక పరిస్థితి. ఇది సంభవించినప్పుడు శరీరంలోని రక్తం మందంగా మారి, గుండె శరీరం మొత్తానికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి, వ్యర్థాలను తొలగించడానికి ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. దీంతో దీర్ఘకాలంలో గుండెపై అదనపు ఒత్తిడి పెరిగి సమస్యలు ఏర్పడవచ్చు. గుండె పనితీరులో నెమ్మదించడం లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటివి కూడా సంభవించవచ్చు. అందుకే హైడ్రేటెడ్‌గా ఉండటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఇది ఇంకా ముఖ్యం.
సోడియం లెవెల్స్ ముఖ్యం
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గుండె సాధారణ లయ(rhythm)లో చేయడానికి సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్ సరైన బ్యాలెన్స్‌లో ఉండాలి. డీహైడ్రేషన్ వల్ల ఈ బ్యాలెన్స్ దెబ్బతిని పాల్పిటేషన్స్ లాంటి హృదయ స్పందన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు సీరం సోడియం స్థాయిలను హైడ్రేషన్ సూచికగా ఉపయోగించి ట్రాక్ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మిడ్‌లైఫ్‌లో 143 mEq/L నుంచి ఎక్కువ సీరం సోడియం ఉన్నవారిలో హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 39% ఎక్కువగా ఉందని, గుండె గోడలు(కండరాలు) మందగించడం(left ventricular walls) కూడా ఎక్కువ అవుతుందని తేలింది. ఇలాంటి ముప్పు సంభవించకుండా ఉండే ఏకైక మార్గం హైడ్రేటెడ్‌గా ఉండటం. అందుకోసం సరిపడా నీళ్లు తాగాలి.
రోజుకు ఎంత నీరు తాగాలి?
పరిశోధకుల ప్రకారం.. స్త్రీలు రోజుకు 1.5 నుంచి 2.1 లీటర్లు, పురుషులు 2 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలి. అయితే అందరికీ, అన్ని సందర్భాల్లో ఇంతే కచ్చితంగా నీరు తాగాలని కూడా ఫిక్స్ కాకండి. మీరు నివసించే ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, మారుతున్న వాతావరణం, మీ ఆరోగ్య స్థితి, వయసును బట్టి నీరు తాగే విధానంలో, తీసుకునే కంటెంట్‌లో ఎక్కువ, తక్కువలు అవసరం కావచ్చు. మీ శరీర తత్వాన్ని బట్టి వైద్య నిపుణులు సూచించే దానిని పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు నీటి మోతాదు తగ్గించాల్సి రావచ్చు. మొత్తానికి సరైన హైడ్రేషన్ గుండె ఆరోగ్యానికి దీర్ఘకాలికంగా సహాయపడుతుందనేది మాత్రం అర్థం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగనీ ఇదొక్కటే గుండె ఆరోగ్యానికి మ్యాజిక్ క్యూర్ కాదు. శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్య స్థితిని బట్టి అవసరం మారుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






