రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఒత్తిడి.. ఆ వ్యాధులకు ఇదే కారణమా?

by Javid Pasha |

ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ సొంత శరీర కణాలపైనే దాడిచేస్తుంది. దీంతో బాడీ నిరంతరం ‘ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్’లో ఉంటుంది.

రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఒత్తిడి.. ఆ వ్యాధులకు ఇదే కారణమా?
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి కామన్. అయితే అది దీర్ఘకాలికంగా ఉండిపోతే మాత్రం రిస్క్ తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. క్రానిక్ స్ట్రెస్ రుమటాయిడ్, ఆర్థరైటిస్, సోరియాసిస్, థైరాయిడ్ వంటి ఆటో ఇమ్యూన్ (Autoimmune) వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇది శరీరంలో వాపును నియంత్రించే హార్మోన్లను దెబ్బతీస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. దీంతో పలు ఇతర అనారోగ్యాలు దాడిచేసే అవకాశం పెరుగుతుంది.

ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ సొంత శరీర కణాలు, ఎముకలు, అవయవాలపై దాడిచేస్తుంది. పైగా శరీరం నిరంతరం ‘ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్’లో ఉంటుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ ఓవర్లీ యాక్టివ్‌గా మారుతుంది. సాధారణంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాలు, వ్యాధికారకాల నుంచి రక్షిస్తుంది. కానీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడినప్పుడు ఇది దారితప్పుతుంది. శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను కూడా ప్రమాదకరమైనవిగా భావించి వాటిపై దాడి చేస్తుంది. దీంతో వాపు, నొప్పి, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటివి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నివారణ ఎలా?

దీర్ఘకాలిక ఒత్తిడే ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ప్రధాన కారణం. కాబట్టి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, అభిరుచులు ఫాలో అవడం లేదా సంగీతం వినడం వంటి అలవాట్ల ద్వారా స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఇక ఆహారాల విషయానికి వస్తే ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, చేపలు, నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెరలకు దూరంగా ఉండాలి. దీంతోపాటు వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం, రోజుకు 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటివి చేయకూడదు. శరీరానికి సూర్యరశ్మి(విటమిన్ డి) తగినంతగా అందేలా చూసుకోవాలి. ఇవన్నీ మీలోని ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయని, నియంత్రణలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story