- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్దె ఇంటిని.. అందమైన నందనవనంగా మార్చేశాడు..!
అపార్ట్‌మెంట్‌లో ఎంత సౌందర్యాన్ని సృష్టించవచ్చో నిరూపించే ఆకర్షణీయ ఇల్లుగా మార్చేశాడు

దిశ, ఫీచర్స్: బెంగళూరులోని సయ్యద్ అల్ఫతాహ్ మంజూర్ అనే యువకుడు అద్దె ఇంట్లో అద్భుతాలు సృష్టించాడు. కేవలం 300 చదరపు అడుగుల ఇంటిలో పెద్ద వనం లాంటి గార్డెన్‌ను తయారుచేసి అపార్ట్‌మెంట్‌లో ఎంత సౌందర్యాన్ని సృష్టించవచ్చో నిరూపించే ఆకర్షణీయ ఇల్లుగా మార్చేశాడు.
జీవం పోశాడు
సయ్యద్‌కు చిన్నప్పటి మొక్కలంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న మార్కెట్ నుంచి విత్తనాలు తెస్తే వాటిని నాటేవాడు. స్కూల్ ఏజ్‌లోనే వందలాది మొక్కలు నాటేవాడు. ముఖ్యంగా కీరదోస మొక్కలు. పెద్దయ్యాక కూడా ఆ అలవాటు అలాగే కొనసాగింది. 2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో సయ్యద్ తన ఈ చిన్ననాటి అభిరుచికి తిరిగి జీవం పోశాడు. జూన్ 2020లో ఇంట్లో మొక్కల స్థలాన్ని సృష్టించాడు. ఈ రోజు అతని తోటలో 500 విభిన్న రకాల మొక్కలున్నాయి. ఇవి కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు, పుష్పించే మొక్కలతో సమృద్ధిగా ఉన్నాయి.
రఫ్ అండ్ టఫ్
ఇంటి తోట కోసం ప్రిపేరైనప్పుడు అతను ముఖ్యంగా మట్టి నాణ్యతపై శ్రద్ధ పెట్టాడు. వర్మీకంపోస్ట్‌నే ఎంచుకున్నాడు. ఇది మట్టి నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.. పోషకాల లభ్యతను పెంచుతుందనేది అతడి అభిప్రాయం. మట్టిని గాలితో నిండిన తేమను నిలుపుకునేలా చేయడం వల్ల తరచూ నీరు పోయాల్సిన అవసరం ఉండదు. సహజ వాతావరణానికి అనుగుణంగా పెరిగేలా "రఫ్ అండ్ టఫ్" మొక్కలను ఎంచుకున్నాడు. బెంగళూరులో వర్షాల వల్ల ఇంటి తోటను నిర్వహించడం అంత ఈజీ కాదు. కానీ సయ్యద్ వర్షాకాలంలో నెలరోజుల పాటు నీరు పోయకుండా తోటను పెంచాడు.
పిల్లల్లా చూసుకుంటాడు
తోటను నిర్వహించడంలో అత్యంత ముఖ్యమైన రహస్యం ఏమిటంటే మొక్కలతో ఒక బంధం ఏర్పరచుకోవడం అని అంటాడు సయ్యద్. మొక్కలతో ప్రతి రోజూ కొంత సమయం గడుపుతాడు. యాంత్రిక షెడ్యూల్‌కు బదులు మొక్కల అవసరాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తాడు. కొన్నిసార్లు మొక్కలకు నీరు అవసరమని అనిపిస్తుంది. మరికొన్నిసార్లు అది వాడిపోతున్నట్లు కనిపిస్తుంది. కాబట్టీ సమతుల్యంగా నీటిని అందించి అందమైన, ఆరోగ్యకరమైన తోటను పెంపుదల చేశాడు. మొక్కలను కేవలం పెంచి వదిలేయడం కాకుండా.. నిత్యం వాటిని పిల్లల్లా చూసుకుంటాడు.
అద్దె ఇల్లే అయినా..
సయ్యద్ తోటలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. 60 మిలియన్ సంవత్సరాల నాటి శిలాజం ఉంది. నేపాల్‌లోని కాళీ గండకీ నది వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు ఆ అమ్మోనైట్ శిలాజాన్ని తీసుకొచ్చాడట. స్విర్లింగ్ షెల్ ఆకారంలోని నల్లని శిలాజం, డిస్క్ గుర్తులతో పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అత్యంత విలువైన సేకరణలో ఒకటిగా నిలిచింది. ఒక్క మొక్క పెంచుకోవడం చాలా పెద్ద కష్టమని అనుకునే వాళ్లకు సయ్యద్ అల్ఫతా ఒక చక్కని పాఠం. అద్దె ఇంట్లో అది కూడా కేవలం 300 చదరపు అడుగుల స్థలంలో ఏకంగా 500 మొక్కలతో చిన్న అడవిలా తోటను పెంచుకున్నాడంటే మాటలు కాదు.






