- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోకో బోట్ రోబో.. కొబ్బరి రైతుల దోస్తీ.!
ఒక చిన్న ఐడియానే.. కేరళ కొబ్బరి రైతాంగ దిశనే మార్చేసింది.

అతడొక 23 ఏళ్ల కుర్రాడు.
ఏదో టైంపాస్ కోసం చిన్న చిన్న ఎక్స్‌పరిమెంట్లు చేసేవాడు.
చేస్తుంటే చేస్తుంటే ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది.
ఆ చిన్న ఐడియానే..
ఇవాళ కేరళ కొబ్బరి రైతాంగ దిశనే మార్చేసింది.
- దిశ, ఫీచర్స్
కేరళలోని కోజికోడ్. 23 ఏళ్ల అషిన్ పి.కృష్ణ "అల్టర్ సేజ్ ఇన్నోవేషన్స్" అనే స్టార్టప్ ప్రారంభించాడు. చిన్న చిన్న "ఇన్నోవేషన్స్" చేస్తుండేవాడు. ఆ ఆసక్తి క్రమంగా రైతాంగంవైపు దృష్టి మళ్లింది. చిన్నప్పటి నుంచి చూస్తున్న "కొబ్బరికోత"కు ఏదైనా పరిష్కారం చూపించాలనే ఆలోచనతో ఒక ఆవిష్కరణ చేశాడు.
20 మీటర్ల చెట్లనూ..
"కొబ్బరి కోత" కోసం ఒక "సెమీ ఆటోమేటెడ్ రోబోట్" తయారు చేశాడు. దానిపేరు "కోకో బోట్". 10 కిలోలకన్నా తక్కువ బరువుంటుంది ఇది. మనిషి ఎంతయితే వేగంగా కొబ్బరిచెట్లు ఎక్కి కొబ్బరి కాయలు కోస్తాడో అంతకంటే వేగంగా పనిచేసే సామర్థ్యం దానికుంది. "వైర్‌లెస్ రోబోటిక్ ఆర్మ్" ద్వారా కొబ్బరి కోయలు కోస్తుందది. అంతే కాదు "ప్లాంట్ మేనేజ్మెంట్" కూడా చేస్తోంది. సులభంగా నేర్చుకోగల "కన్సోల్" ద్వారా నియంత్రించబడే ఈ "రోబోట్" 20 మీటర్ల ఎత్తయిన చెట్లను కూడా సునాయాసంగా ఎక్కుతుంది.
విప్లవాత్మక మార్పులు
మామూలుగా 20 మీటర్ల ఎత్తయిన కొబ్బరి చెట్లను ఎక్కి కాయలు తెంపాలంటే మనుషులకు భయం. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అనే ఆందోళన ఉంటుంది. కానీ అషిన్ రూపొందించిన "కోకో బోట్" మనిషి ఎక్కలేని చెట్లను కూడా ఎక్కి కొబ్బరికాయలు కోస్తుంది. ప్రమాదకరమైన పనిని కూడా సురక్షితంగా.. సులభతరంగా చేస్తూ కొబ్బరిసాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. అషిన్‌కు ఇది కేవలం వృత్తి మాత్రమే కాదు. చిన్నప్పుడు బాల్కనీలో కాలయాపన ప్రయోగంగా ప్రారంభమై.. తర్వాత జీవన సంకల్పంగా మారిన ఆవిష్కరణ.
అగ్రి హ్యాకథాన్‌లో సత్తా
అషిన్.. చిన్నప్పుడు టీవీలో "యానిమేటెడ్ క్రియేషన్"తో స్ఫూర్తి పొందాడు. 2020లో ఒకసారి స్నానం చేస్తూ కిటికీలోంచి కొబ్బరి చెట్లను చూస్తూ ఉన్నాడు. ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటీ.? మావాళ్లకీ సమస్య.? అంతపెద్ద కొబ్బరి చెట్టును మనిషి ఎక్కి తెంపాల్సిందేనా.? అనే ఆలోచన మనసులో మెదిలింది. ఇగ అప్పటి నుంచి సొంత దృక్పథంతో రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. "జాతీయ సైన్స్ ఈవెంట్"లో తన టాలెంట్ చూపించాలి అనుకున్నా అవకాశం కోల్పోయాడు. 2023లో "కేరళ వ్యవసాయ శాఖ" నిర్వహించిన "అగ్రి హ్యాకథాన్"లో "కోకో బోట్" విజయం సాధించింది.
మహిళలకూ తోడుగా
అగ్రి హ్యాకథాన్‌లో "కోకో బోట్".. "నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్" (నాబార్డ్) దృష్టిని ఆకర్షించింది. అషిన్ చేపట్టబోయే ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. "కోకో బోట్" కొబ్బరి వ్యవసాయాన్ని సురక్షితంగా.. అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ సముదాయాలకు.. ముఖ్యంగా "కుడుంబశ్రీ" మహిళలు.. "ఆశా" కార్యకర్తలకు నెలకు రూ. 18,000- 20,000 ఆదాయ అవకాశాలను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ రోబోట్ రాత్రి పగలు పనిచేయగల సామర్థ్యం.. మానవ కోతగాళ్లకు సాధ్యంకాన్ని సమయ సౌలభ్యాన్ని అందిస్తోంది.
భవిష్యత్ అడుగులు
"కోకో బోట్" ప్రస్తుతం "బూట్‌స్ట్రాప్"తో నడుస్తోంది. ఇప్పటికే అనుకున్న సామర్థ్యం కంటే ఎక్కువే పనిచేస్తోంది. మనుషులకు అత్యంత ప్రమాదకరంగా మారిన కొబ్బరి కాయలు కోయడాన్ని పూర్తిగా "రోబో"మయం చేసేందుకు అషిన్ కృషి చేస్తున్నాడు. 2025 చివరి నాటికి తయారీకి సిద్ధమైన ప్రొటోటైప్‌ను అభివృద్ధి చేసేందుకు తీవ్రమైన కృషి జరుగుతోంది. ఈ రోబోట్ మార్కెట్లో రూ.1 లక్షలోపే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నాబార్డ్.. వడగర కొబ్బరి ఉత్పత్తిదారుల కంపెనీ. మేకర్ విలేజ్.. ఐఐఎం కోజికోడ్.. మారికో లిమిటెడ్ వంటివి "కోకో బోట్" కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.






