- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

తేనెటీగలు తేనెమాత్రమే ఇవ్వవు.
ప్రకృతిలో ప్రతీదానిపై వాటి ప్రభావం ఉంటుంది.
పంటలు.. పండ్లు.. పూలు.. ఆఖరికి మనిషి జీవితంపైనా.
అంత ఉందా వాటికి.? అనిపిస్తుంది కదా.?
అమిత్ గోడ్సే కూడా తొలుత అలాగే అనుకున్నాడు.
కానీ ఇప్పుడు.. ఆయనొక తేనెటీగల మనిషి.
- దిశ, ఫీచర్స్
వ్యవసాయంలో రసాయనాలు ఎక్కువయ్యాయి. పురుగుల మందులకైతే లిమిటే లేదు. తెగులొచ్చినా.. తేమొచ్చినా.. అన్నింటికీ ఫస్ట్ ఛాయిస్‌గా పురుగుల మందులనే వాడుతున్నారు రైతులు. ఇది మానవ మనుగడకే ప్రమాదం చేస్తుందని గుర్తించాడు పూణెకు చెందిన అమిత్ గోడ్సే.
70% తేనెటీగల ద్వారా
ప్రపంచంలో దాదాపు 70% పరాగ సంపర్కం తేనెటీగల ద్వారానే జరుగుతుంది. అంటే మన ఆహారంలో మూడోవంతు నేరుగా ఈ తేనెటీగలపైనే ఆధారపడి ఉంది. ఉదాహరణకు ఉల్లిగడ్డలే. ఇండియాలో ప్రతీ సంవత్సరం 15,000 టన్నుల ఉల్లి విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 70% తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఉల్లి పొలాల్లో తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి కారణం విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకం.. ఏకరీతి పంటల సాగు.. నగర విస్తరణ. ఈ మూడు కారణాల వల్ల పొలాల్లోని తేనెటీగలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.
పెస్ట్ టు పెట్
తేనెటీగల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో పొలాలు పరాగ సంపర్కంలో నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సవాలును అధిగమించేందుకు ముంబైలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేశాడు అమిత్. పూణెకు వచ్చి తేనెటీగలను సంరక్షించే పనిలో మునిగిపోయాడు. తేనెటీగల పెంపకంలో ఎలాంటి అనుభవం లేకపోయినా ఐదు రకాల తేనెటీగల జాతులకు వేర్వేరు రక్షణ పద్ధతులను ఉపయోగిస్తూ ఇప్పటివరకు 17,000పైగా తేనెటీగల పెట్టెలను రక్షించాడు. "పెస్ట్ టు పెట్" అనే సంస్థను ఏర్పాటుచేసి ఈ కార్యక్రమాలను చేపడుతున్నాడు.
ఏం చేస్తాడు.?
పెస్ట్ టు పెట్‌లో భాగంగా.. నగర ప్రాంతాల నుంచి రక్షించిన తేనెటీగలను పొలాలకు తరలిస్తాడు. దీనివల్ల సహజ పరాగ సంపర్కాన్ని పునరుద్ధరిస్తున్నాడు. అంతటితో ఆగకుండా.. తేనెటీగల వైవిధ్యాన్ని పెంచేందుకు పూణెలో 5,000 చెట్లను నాటాడు. ఆ చెట్లపై తేనెటగల కోసం సురక్షిత నివాసాలు ఏర్పరుస్తున్నారు. అంటే తేనెటీగల గూళ్లను నిర్మిస్తున్నారు. ఇవి తేనెటీగల సహజ పరాగ సంపర్కానికి తోడ్పడుతున్నాయి. పొలాల్లో ఎదురవుతున్న నిశ్శబ్ద సంక్షోభం.. సవాళ్లను అధగమించేలా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నాడు అమిత్.
తేనెటీగల మనిషి
తేనెటీగలను రక్షించడం వల్ల పరాగ సంపర్కకర్తలను కాపాడినట్లు అవుతుంది. ఆహారభద్రత కూడా కాపాడినట్లవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30% తేనెటీగల సంఖ్య ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో అమిత్ కృషి ఎంతో గొప్పది. ఇదొక సరళమైన సత్యాన్ని గుర్తుచేస్తూ అందరినీ ఆ దిశగా ఆలోచింపజేస్తుంది. ఇంత విలువైన ప్రాణి సంరక్షణ చేస్తున్నాడు కాబట్టీ అమిత్ గోడ్సేను "పూణె తేనటీగల మనిషి" అని పిలుస్తుంటారు. కాబట్టీ.. అమిత్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. "మనం విలువైనదిగా భావించాల్సింది తేనె మాత్రమే కాదు.. పెద్ద ప్రయోజనాలిచ్చే చిన్న జీవులైన తేనెటీగలు" అనీ.






