మీ భూమిని కబ్జా చేశారా?... ఈ స్టెప్స్ ఫాలో అయితే న్యాయం జరగొచ్చు..

by Sujitha Rachapalli |

తెలంగాణ, ఏపీలో భూముల ధరలు పెరిగాయి. దాంతో సొంత భూములను కూడా రోజూ చూడకపోతే ఎవరో ఒకరు కబ్జా చేసేందుకు అవకాశాలు లేకపోలేదు.

మీ భూమిని కబ్జా చేశారా?... ఈ స్టెప్స్ ఫాలో అయితే న్యాయం జరగొచ్చు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ, ఏపీలో భూముల ధరలు పెరిగాయి. దాంతో సొంత భూములను కూడా రోజూ చూడకపోతే ఎవరో ఒకరు కబ్జా చేసేందుకు అవకాశాలు లేకపోలేదు. మీది అని తెలిసినా బలవంతులు, రాజకీయ, అధికార అండదండలు కలిగిన వాళ్లు ఆక్రమించుకోవచ్చు. లేదంటే వేరే భూమిని కొనుగోలు చేసి మీ భూమి అని వాదించవచ్చు. అంటే ఒక సర్వే నంబరులో కొని, మరో సర్వే నంబరులోని భూమిని పొషిషన్‌లోకి వచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. అంతెందుకు.. మీ భూమి భద్రంగానే ఉందని, ఉపాధి కోసం మీరు ఊరిని వదిలేసి నగరానికి వలసెళ్లిపోవచ్చు. అప్పుడు మీ ల్యాండ్‌ని కాపాడేందుకు ఎవరూ ఉండకపోవచ్చు. ఖాళీగా ఉందని ఫెన్సింగ్ పెట్టే రోజులివి. అందుకే మీ ల్యాండ్‌ని ఎవరైనా కబ్జా చేసినప్పుడు అంత ఈజీగా తిరిగి పొందడం కష్టమైన రోజులివి. అలాంటప్పుడు ఏమేం చేయాలో నిపుణులు సూచిస్తున్న అంశాలు మీ కోసం. ముందుగా ల్యాండ్ డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవాలి. రెవెన్యూ రికార్డుల్లో మీ పేరిట భూమి నమోదైనప్పటికీ మీకు ఆ భూమి ఏ విధంగా సంక్రమించిందన్న అంశానికి మీరే బాధ్యులుగా చూస్తారు. రికార్డుల్లో ఉన్నప్పటికీ మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయని ప్రశ్నిస్తారు. అందుకే మీ దగ్గరే ఉన్నా.. ఆ భూమిలో మీరే సాగు చేసుకుంటున్నా.. ఏ రోజు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. అందుకే రికార్డుల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. భూముల విలువలు పెరిగిన నేపథ్యంలో కాపాడుకోవడం అంత ఈజీ కాదని కేసులు, కబ్జాలు, ఫిర్యాదుల సంఖ్య స్పష్టం చేస్తుంది.

గ్రామ పంచాయతీకి సమాచారం: ఫస్ట్ మీకు తెలిసిన వార్డు సభ్యుడు, సర్పంచ్‌కి సమాచారం ఇవ్వాలి. అలాగే పంచాయతీ కార్యదర్శికి కూడా రాతపూర్వక విజ్ఞప్తి చేయాలి. స్థానిక సంస్థలో మొదటి ఫిర్యాదు చేయడం ద్వారా ఊరి వారందరికీ తెలుస్తుంది. దాంతో మీకు బలం చేకూరుతుంది.

వీఆర్వో/జీపీవో: ఏపీలో వీఆర్వో, తెలంగాణలో జీపీవోను కలవండి. వారి దగ్గర భూమికి సంబంధించిన రికార్డులు ఉంటాయి. వారికి మీ డాక్యుమెంట్లు సమర్పించండి. ఆక్రమణ నిజమో, కాదో వెంటనే రికార్డుల ప్రకారం తేల్చేస్తారు.

తహశీల్దార్‌కు ఫిర్యాదు: వీఆర్వో/జీపీవోల దగ్గర పని కాకపోతే నేరుగా తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయండి. భూ వివాదాల్లో తహశీల్దార్‌కు అధికారాలు ఉంటాయి. ఆయన విచారణ చేసి న్యాయం చేయొచ్చు.

ఆర్డీవోకి అప్పీల్: వీఆర్వో/జీపీవో, తహశీల్దార్లు పట్టించుకోకపోతే ఆర్డీవో దగ్గరికి వెళ్లండి. అప్పీల్ చేసుకోవచ్చు. తహశీల్దార్ తీసుకున్న నిర్ణయంపై ఆర్డీవో పునర్విచారణ చేయిస్తారు.

కలెక్టర్‌కు మొర: గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాకపోవచ్చు. కబ్జా చేసిన వాళ్లు పెద్దవాళ్లు కావచ్చు. రాజకీయ అండదండలు ఉండొచ్చు. అప్పుడు కలెక్టర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చు. కలెక్టర్ విచారణ చేసి నివేదిక సమర్పించమని కోరవచ్చు.

పోలీసులకు ఫిర్యాదు: రెవెన్యూ యంత్రాంగం నుంచి న్యాయం కోసం ప్రయత్నిస్తూనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయొచ్చు. తగిన డాక్యుమెంట్లను సమర్పించాలి.

సివిల్ కోర్టులో దావా: ఆ భూమి తమదేనని, హక్కులు నిరూపించుకునేందుకు సివిల్ సూట్ వేయొచ్చు. రెవెన్యూ అధికారులతోనే న్యాయం పొందడానికి ప్రయత్నించాలి. అక్కడ న్యాయం దక్కకపోతే కోర్టును ఆశ్రయించక తప్పదు. ఆ భూమికి మీకు సంక్రమించిన క్రమాన్ని వివరించాలి. వారసత్వంగా వచ్చిందా? స్టాంప్ డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ ద్వారా కొన్నారా? ఎవరి నుంచి కొన్నారు? మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకాలు వంటివన్నీ సమర్పించాలి.

రికార్డులు పరిశీలించాలి: ఆంధ్రప్రదేశ్​‌లో మీ భూమి(meebhoomi.ap.gov.in), తెలంగాణలో భూ భారతి(bhubharathi.telanganga.gov.in) పోర్టల్‌లో వివరాలను చెక్ చేసుకోవాలి. ఆన్ లైన్‌లో ఈసీ, పట్టాదారు పాసు పుస్తకం, పహానీ/అడంగల్ వంటి అన్ని పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవాలి.

సర్వేకు దరఖాస్తు: మీ డాక్యుమెంట్ల ద్వారా ల్యాండ్ సర్వేకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకోవడం ద్వారా మీ హద్దులు పక్కా అవుతాయి.

లోక్ అదాలత్: పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారుల దగ్గర న్యాయం దక్కకపోతే గ్రామంలోని పెద్దల ద్వారానే ఏమైనా పరిష్కారం లభిస్తుందో ప్రయత్నించాలి. ఆ తర్వాత కోర్టుకు వెళ్లే ముందు లోక్ అదాలత్ ద్వారా వేగంగా పరిష్కారం పొందడానికి అవకాశం ఉంది.

లీగల్ సర్వీస్: ప్రతి జిల్లాలోనూ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉన్నాయి. జిల్లా జడ్జీల ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. అక్కడ పేద రైతులకు ఉచితంగా న్యాయ సాయం అందిస్తారు. అక్కడ ఇచ్చే న్యాయ సలహాల ఆధారంగా తదుపరి చర్యలకు ముందడుగు వేయాలి.

హైకోర్టులోనూ రిట్: ఎక్కడా న్యాయం దక్కడం లేదని భావిస్తే నిరాశకు గురి కావద్దు. న్యాయస్థానాల్లోనూ హక్కులు పొందడానికి ఛాన్స్ ఉంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల పరిష్కారం కాకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు.

చట్టాలు ఉన్నాయా?: ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో దీనికి పటిష్టమైన చట్టాలు అనాదిగా వస్తున్నాయి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ పవర్ ఫుల్. దీని ఆధారంగా కబ్జాకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులకు అధికారాలను కట్టబెట్టారు.

Next Story