New Year's Resolutions : ఈసారైనా సంతోషంగా ఉందామా!!

by Javid Pasha |

హ్యాపీనెస్ అంటే.. కేవలం మనకు ఇష్టమైన అనుభవం మాత్రమే కానవసరం లేదు. దు:ఖం, సుఖం అనేవి ఏ మాత్రం కాదు. అదొక న్యూట్రల్ ఎక్స్‌పీరియన్స్ (Neutral Experience) అంటున్నారు నిపుణులు.

New Years Resolutions : ఈసారైనా సంతోషంగా ఉందామా!!
X

దిశ, ఫీచర్స్ : మంచో చెడో, సుఖమో దుఃఖమో, బాధలో, భావోద్వేగాలో, సంతోషాలో, సంబురాలో.. ఏవైతేనేం.. చూస్తుండగానే ఏడాది గడిపోయింది. మరో పది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరి మనసులో గత అనుభవాల తాలూకు ఆలోచనలు మెదులుతున్నాయి. మధుర జ్ఞాపకాలో, చేదు అనుభవాలో ప్రతీ హృదయాన్ని తట్టి లేపుతున్నాయి. జరిగిందేదో జరిగింది. అది మంచైనా, చెడైనా గడిచిందంతా ఇక గతమే.. కాబట్టి వర్తమానంలో సరైన ప్రణాళికతో ముందుకెళదాం. వచ్చే ఏడాదంతా సంతోషంగా ఉందాం.. అనే లక్ష్యం వైపు అడుగేస్తోంది ఆధునిక యువత. యువతే కాదు పిల్లలు, పెద్దలు ప్రతీ ఒక్కరి ఫైనల్ డెసిషన్ ఒక్కటే. ఏంటంటే వచ్చే ఏడాదంతా హ్యాపీగా ఉండటమే. అయితే అలా అనుకున్నంత మాత్రాన సంతోషంగా ఉండలేరు. అది మీరు క్రియేట్ చేసుకోవాల్సిన విషయం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం పదండి!

ఫీలయ్యే తీరును బట్టే..

హ్యాపీనెస్ అంటే.. కేవలం మనకు ఇష్టమైన అనుభవం మాత్రమే కానవసరం లేదు. దు:ఖం, సుఖం అనేవి ఏ మాత్రం కాదు. అదొక న్యూట్రల్ ఎక్స్‌పీరియన్స్ (Neutral Experience) అంటున్నారు నిపుణులు. మనిషి ఏం చేసినా సరే.. చివరిగా కోరుకునేది జీవితంలో సంతోషంగా ఉండడం మాత్రమే. అయితే ఆ సంతోషమనేది కేవలం ఆస్తి, అంతస్తులు, హోదా, విలాసవంతమైన జీవితం ద్వారా మాత్రమే లభిస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇవన్నీ ఉన్నంత మాత్రానా సంతోషంగా ఉంటారనడానికి లేదు. ఎందుకంటే.. రియల్ హ్యాపీనెస్ అనేది మనలోనే, మన మనసులోనే, మనం ఫీలయ్యే విధానంలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సంతోషంగా జీవించేవారి జీవిత అనుభవం కూడా ఇదే కదా చెబుతున్నది!

వెతికితే దొరకదు!

అనుకున్నంత మాత్రానా అన్నీ జరిగిపోవు. అనుకోలేదని కూడా అన్నీ ఆగిపోవు. కాబట్టి ఒడిదుడుకులు సహజం. కాబట్టి ఏం జరిగినా స్వీకరించేలా సిద్ధంగా ఉండాలంటారు నిపుణులు. ఎందుకంటే.. కాలం మన కోసం ఆగదు. మన చేతిలోనూ ఉండదు. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండాలనే సంకల్పం మీలో ఉంటే నిజంగానే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే విజయం సంతోషాన్ని ఇస్తుందని, ఓటమి బాధను ఇస్తుందని కూడా ఎప్పుడూ అనుకోకూడదు. గెలుపు సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటే.. ఓటమి ఎదురైనప్పడు బాధపడుతుంటారు. అందుకే ఎప్పుడూ కూడా సంతోషాన్ని బయట వెతుక్కోకూడదు. అది మీ హృదయాంతరాల్లో ఉంటుంది. మీరు భావించే దానిని బట్టి టుంటుంది. అందుకే సంతోషాన్ని వెతుక్కునే పనిలో పడి మీ లక్ష్యాన్ని వదులుకోకండి. దానిని చేరుకోవాలనే కృషి, పట్టుదల కూడా మీలో సంతోషాన్ని నింపుతాయి. అలాగే ఓటమి ఎదురైనప్పుడు దానిని అధిగమించే ప్రయత్నం కూడా సంతోషాన్నిస్తుంది.

అంతా మన చేతుల్లోనే..

నిజమైన సంతోషమంటే..ప్రశాంతమైన మనసే అని నిపుణులు చెబుతుంటారు. కొందరు తమకు ఆస్తులు లేకున్నా, అవసరమైన వనరులు లేకున్నా, ఇతరులతో పోల్చుకున్నప్పుడు తక్కువ సౌకర్యాలున్నా సరే సంతోషంగా ఉంటారు.. ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తుంటారు. ఇది కదా నిజమైన సంతోషమంటే.. ఇలాంటి వారు ఓటమికి భయపడరు. పైగా ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సంతోషంగా ఉండాలనేది పూర్తిగా వ్యక్తిగత భావన, వ్యక్తిగత నిర్ణయం దానిని ఇతరులు ఇవ్వలేరు. మన నుంచి లాక్కోలేరు కూడా. ఎందుకంటే ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగిపోవాలా.. చిరునవ్వుతో వాటిని ఎదుర్కొవాలా అనేది ఎవరు డిసైడ్ చేసినా ఫైనల్‌గా ఏం చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. కోపం, బాధ, జెలసీ, ఓవర్ థింకింగ్, పగ, ప్రతీకారం, దురలవాట్లు వంటివి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పైగా జీవితంలో సంతోషాన్ని దూరం చేస్తాయి. మన కోసం మనం కాకుండా ఇతరుల గురించి ఆలోచించడంలోనే జీవితం వృథా అవుతుంది. కాబట్టి సంతోషంగా ఉండాలంటే వాటిని వదిలేయండి. నిజాయితీగా, క్రమశిక్షణగా మెలగండి. ఎవరు ఏమనుకున్నా మంచి వైపు అడుగేయండి. రాబోయే సంవత్సరంలో నిజంగా మీరు సంతోషంగా ఉండాలనుకుంటే.. ఏం చేయాలోనని బుర్రపాడు చేసుకోకండి. ప్రస్తుతం ఉన్న వాటిని అనుభవిస్తూ ముందుకు సాగితే చాలు. ఎందుకంటే సంతోషమనేది బజార్లో దొరికే వస్తువు కాదు. ఎవరో మనకు ఇచ్చేది కాదు. అది కేవలం మనం ఫీలయ్యే దానిని బట్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు తల్చుకుంటే ప్రతీక్షణాన్ని సంతోషకరమైనదిగా క్రియేట్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంకెందుకాలస్యం కొత్త సంవత్సరంలోనూ అదే చేయండి!

Next Story