Willpower : సంకల్పం ముందు ఓడిన వైకల్యం.. కుటుంబానికి ఆసరగా మారిన యువకుడు

by Javid Pasha |   (  Updated:2025-09-18 09:57:36  IST  )

జీవన పోరాటం ఎలాంటి కష్టాలలో ఉన్న వారికైనా బతుకు మీద ఆశలు పుట్టించేలా చేస్తుందంటే అతిశయోక్తి లేదు. అందుకు చక్కటి ఉదాహరణ హాజీమ్ పాషా. అతని సంకల్పం ముందు వైకల్యం ఓడిందనే చెప్పాలి.

Willpower : సంకల్పం ముందు ఓడిన వైకల్యం.. కుటుంబానికి ఆసరగా మారిన యువకుడు
X

దిశ, తాండూరు : శ్రమించి బతకాలన్న తపన, ఆశ, ఆశయం ఉంటే చాలు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించి జీవిత పోరాటంలో ముందుకు సాగొచ్చుని నిరూపించారు హాజీమ్ పాషా. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తనకు తానే సాటి అన్నట్టు స్వయం ఉపాధి పొందుతున్నాడు. బైక్ పంచర్ పని చేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచి నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన హాజీమ్ పాషాది నిరుపేద కుటుంబం. ఆరేండ్ల క్రితం తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. తల్లిదండ్రులు మృతి చెందిన ఎడాది క్రితం సబాబేగంతో హాజీమ్ పాషా కు వివాహం జరిగింది. ఈ దంపతులకు అలీసా, అలీనా ఇద్దరు ఆడపిల్లలు. అంగవైకల్యం కారణంగా నడుము నుంచి కాలి వేళ్ల వరకు చలనం లేకపోవడంతో చేతుల సహాయంతో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్తాడు. ఆయన చేస్తున్న జీవన పోరాటం ఎలాంటి కష్టాలలో ఉన్న వారికైనా బతుకు మీద ఆశలు పుట్టించేలా చేస్తుందంటే అతిశయోక్తి లేదు. ఎన్నికష్టాలు ఎదురొచ్చినా.. ఎదురోడ్డి నిలవాలన్న హాజీమ్ పాషా సంకల్పం ముందు వైకల్యం ఓడిందనే చెప్పాలి.

సెంటు భూమి లేదు..

నిరుపేద కుటుంబానికి చెందిన మౌలానా, షరీఫా బేగం దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కూతురు. కూతురికి పెళ్లి అయింది. అనారోగ్యం కారణంగా ఓ కొడుకు చనిపోయాడు. పెద్ద కొడుకు షాన్ పాషాకు పక్షవాతం రావడంతో 10 ఏళ్ల నుంచి బెడ్డుకే పరిమితమయ్యాడు. చిన్నకొడుకు హైమద్ హైదరాబాదులో పనిచేస్తుండు. మూడో కొడుకు హాజీమ్ పాషాకు పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది.

చేతులే కాళ్లు..

హాజీమ్ పాషాకు నడుము నుంచి కాలి వేళ్ల వరకు చలనం ఉండదు. చేతుల సహాయంతో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్తాడు. వర్షాలతో రోడ్డుపై బురదలో ఉన్న కూడా ప్రతిరోజు పిల్లలను బడికి అతనే పంపిస్తాడు. తాండూరు, బషీరాబాద్ వెళ్లాలంటే రోడ్డుపైకి వచ్చి బస్సులేదా ఆటోలలో వెళ్తాడు. పాఠశాల, మరుగుదొడ్డి, సరుకులకు, ఇతర పనుల కోసం ప్రతి రోజు 3 కిలోమీటర్లు చేతుల సహాయంతో ప్రయాణం చేస్తాడు.

కిరాణాషాప్ పెట్టుకుంటా : సబాబేగం, జీవన్గి గ్రామం

ఇంటిలో కుటుంబ సభ్యుల సంరక్షణ, వంట చేయడం, ఇంటిని శుభ్రపరచడం, కిరాణా సామాను తేవడం వంటి అనేక బాధ్యతలను చూసుకుంటా. సంపాదన బాధ్యత అంతా నా భర్త పైనే భారం ఉంది. డబ్బులు ఉంటే చిన్నపాటి కిరాణా షాప్ పెట్టాలని ఉంది. కిరాణా షాప్ తోనా భర్తపై కొద్దిగా భారం తగ్గుతుంది.

నా కష్టం పగవాడికీ రావద్దు : హాజీమ్ పాషా, జీవన్గి గ్రామం

పుట్టుకతోనే కాళ్లు లేవు. అన్నకు పక్షవాతం. తమ్ముడు హైదరాబాద్ లో.. నా భార్య ఇంటి పనులు, పిల్లలను చూసుకుంటూ.. మా అన్నకు సేవచేస్తుంది. నాకు 4 వేల పింఛన్ వస్తుంది. బైక్ పంచర్ చేస్తే.. రోజు 100 నుంచి 200 సంపాదిస్తా. నిత్యావసర సరుకులు, జ్వరాలు, ఇతర ఖర్చులకు ఈ డబ్బులే నెల మొత్తం ఖర్చు చేస్తాం. 2 నెలలుగా కురుస్తున్న వర్షాలతో ఉపాధి లేక ఇబ్బందిగా ఉంది. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు.


Next Story