తల్లి ఆశయం కోసం అనాథలకు అమ్మయింది

by Daayi Srishailam |

తల్లి అడుగుజాడల్లో నడుస్తూ అనాథల "మమతల కోవెల"ను కొనసాగిస్తోంది.

తల్లి ఆశయం కోసం అనాథలకు అమ్మయింది
X

తల్లిదండ్రుల నుంచి..

ఆస్తులు.. భూములు పొందుతాం.

ఇవే వారసత్వ సంపదగా భావిస్తాం.

కానీ.. పూణెకు చెందిన ఒకావిడ సేవను వారసత్వ సంపదగా స్వీకరించింది.

వేలాదిమందికి "అమ్మ"గా ఆదరించి సింధూథాయ్ కూతురే మమత.

తల్లి అడుగుజాడల్లో నడుస్తూ అనాథల "మమతల కోవెల"ను కొనసాగిస్తోంది.

దిశ, ఫీచర్స్: ప్రేమలేని జీవితాలు ఎలా ఉంటాయో అనాథలకు తెలుసు. అలాంటి అనాథలకు అమ్మయి.. ఏ బిడ్డా ప్రేమ అందక బాధపడకూడదని ప్రేమను పంచింది. కష్టాల కడలి నుంచి ఉద్భవించిన ఆ ప్రేమ.. థాయ్ లేకున్నా వేలాదిమంది జీవితాల్లో వెలుగునిస్తోంది.

గ్రామ బహిష్కరణ

సింధూథాయ్ సాపకల్ నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకుంది. 12 ఏళ్ల వయసులో పెళ్లి జరిగింది. మమతా సాపకల్ ఆమె నాలుగో బిడ్డ. మమత కడుపులో ఉన్నప్పుడు.. ఆవుపేడ సేకరించే మహిళలకు జరుగుతున్న అన్యాయంపై సింధూథాయ్ ప్రశ్నించింది. అప్పట్లో అదొక పెద్ద ఇష్యూ అయింది. కాంట్రాక్టర్లు ఆమెపై పగబట్టారు. గ్రామస్తులతో కలిసి గ్రామ బహిష్కరణ చేయించి.. ఓ రోడ్డు పక్కన వదిలేశారు. సింధూ చనిపోయిందనుకొని ఊరొళ్లంతా మర్చిపోయారు. అప్పుడు ఆమె తొమ్మిది నెలల గర్భిణి.

బిచ్చమెత్తుకొని..

ఒత్తిడితో ప్రసవ వేదన మొదలైంది. నాభి తాడును కత్తిరించడానికి ఆమె చేతిలో ఏమీ లేదు. అప్పుడొక పదునైన రాయి మాత్రమే దొరికింది. ఈ కఠిన పరిస్థితుల్లోనే మమత జన్మించింది. కానీ సింధుథాయ్ కుంగిపోలేదు. ప్రేమకు మానవరూపంగా మారాలని నిర్ణయించుకుంది. ఒకానొక ఉదయం వేళ.. తన నవజాత శిశువును గుండెకు హత్తుకొని ఊర్లో కనిపించింది. గ్రామస్తులంతా పరేషాన్ అయ్యారు. అప్పటికీ ఆమె నలుగురు పిల్లల తల్లి. ఒకచేత్తో పిల్లలు.. ఇంకోచేత్తో సంచి పట్టుకొని బిచ్చమెత్తడం ప్రారంభించింది.

కాష్టాల మంటపై చపాతీ

సింధూథాయ్ జీవితం కష్టాలతో నిండినప్పటికీ ఆమె సమాజం పట్ల దయాగుణంతోనే ఉండేది. ఒకసారి ఎవరిదో శవం దహనం అవుతుండగా చూసింది. బంధువులు వెళ్లిపోయారు. అక్కడ వదిలేసిన పిండి ముద్దతో చపాతీ తయరుచేసి కాష్టం మంటకు కాల్చుకుతింటున్న బాలిక కనిపించింది. తల్లిలేదు.. తండ్రి లేడు. ఇల్లనేదే పుట్టుకతో లేదు. ఆ సన్నివేశం చూసిన తర్వాత ఆమెలో కరుణ మరింత ఎక్కువయింది. తనకు లభించని ప్రేమను.. ఇతరులకు కల్పించాలని అనుకుంది.

అభాగ్యులకు అండగా

సర్టిఫికేట్ల మీద కనిపించే తన నలుగురి పిల్లలకే కాదు.. అభాగ్యులైన అనాథలందరికీ తల్లిగా ప్రేమనందించాలని 1998లో "సన్మతి బాల నికేతన్" ఆశ్రమాన్ని స్థాపించింది సింధూ థాయ్. అనాథలకు ఆహారం.. వసతి.. విద్య.. బట్టలు.. పునరావాసం వంటి సేవలను అందిస్తోంది. "గోపికా గాయ్ రక్షణ కేంద్రం"ను 2007లో స్థాపించింది. వృద్ధ ఆవుల సంరక్షణ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. "తీర్థరూప ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ సెంటర్‌"ను 2017లో ప్రారంభించి కుటుంబ నిర్లక్ష్యానికి గురవుతున్న పిల్లలకు ఆశ్రయమిస్తోంది.

మమత అనురాగం

2021లో సింధూథాయ్‌కి పద్మశ్రీ వరించింది. 2022లో కన్నుమూసింది. "మాయ్" అని ప్రేమగా పిలుచుకునే అనాథల గుండె పగిలినంత పనైంది. సింధూ కూతురు మమత తన తల్లి సేవతత్వాన్ని వారసత్వంగా తీసుకొని ఆశ్రయాలను నడిపిస్తోంది. సోషల్ వర్క్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసిన మమత.. తన తల్లిలా ప్రేమ.. మమతాను రాగాలను కొనసాగిస్తోంది. సింధూథాయ్ పెంచిన ఎంతోమంది ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్లంతా ఆశ్రమానికి ఏదో ఒక రూపంలో ఆసరై సింధూథాయ్ రుణం తీర్చుకుంటున్నారు.

Next Story