సిమెంటుపై జీఎస్టీ తగ్గింపు

by Daayi Srishailam |

28 శాతం నుంచి 18 శాతానికి కుదింపు

సిమెంటుపై జీఎస్టీ తగ్గింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వర్గానికి మేలు కలిగేలా నిర్ణయం తీసుకున్నది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత కీలకమైన సిమెంటు వినియోగంపై వెసులుబాటు కల్పించింది. దీనిపై జీఎస్టీని తగ్గించింది. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు కలుగనున్నది. అందుబాటు ధరల్లో ఇండ్లు లభించేందుకు తోడ్పాటునందిస్తుంది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి. ఇప్పటి దాకా నాలుగు స్థాయిల్లో ఉన్న జీఎస్టీని రెండింటికి తగ్గించింది. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం స్లాట్ రేట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 5, 18 శాతం రేట్లు మాత్రమే ఉంటాయి. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువులన్నీ ఈ రెండు స్లాట్స్ ల్లో ఏదో ఒక దాని పరిధిలోకి వస్తాయి. విలాసవంతమైన వస్తువులపై పన్ను రేటు 40 శాతంగా ఉంది. అలాగే కన్ స్ట్రక్షన్ కి అత్యంత అవసరమైన సిమెంటుపై జీఎస్టీ ఇప్పటి దాకా 28 శాతం ఉంది. ఇప్పుడు దాన్ని 18 శాతానికి తగ్గించారు. అంటే ఏకంగా 10 శాతం తగ్గింది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గనున్నది. డెవలపర్లకు ఊరట కలుగుతుంది. అలాగే ఇండ్ల కొనుగోలుదార్లకు కాస్త తగ్గింపు ధరల్లోనే సొంతిండ్లు లభించే అవకాశం ఏర్పడింది.

ప్రభుత్వ రంగానికీ మేలు

ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా అందుబాటు ఇండ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఎక్కువగా వినియోగించే సిమెంట్ పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయంగా రియల్ ఎస్టేట్ వర్గ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా పెట్టుబడి తగ్గుతుందని, ప్రాజెక్టు కాస్ట్ కూడా కాస్త తగ్గుతుందంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇది అమలవుతుండడం వల్ల డెవలపర్లకు, గృహ కొనుగోలుదార్లకు మేలు కలిగించే అంశంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తూ ఇండ్లను మరింత అందుబాటులోకి తెస్తాయి. ఈ సవరణ వల్ల డెవలపర్లతో పాటు వినియోగదారులకు, గృహ నిర్మాణ రంగానికి ప్రయోజనం కలుగుతుందంటున్నారు.

Next Story