గ్రీన్ ఇండియా ద్వారా 12400 మంది ప్రభావితమై 37 టన్నుల సీఓ2 ఉద్గారాలను తగ్గించారు

by Daayi Srishailam |

వారెవరు.. అదెలా సాధ్యమైందో తెలుసుకుందాం

గ్రీన్ ఇండియా ద్వారా 12400 మంది ప్రభావితమై 37 టన్నుల సీఓ2 ఉద్గారాలను తగ్గించారు
X

దిశ, ఫీచర్స్: గ్రీన్ ఇండియా ద్వారా ఆర్థిక వ్యవస్థకు శక్తిని అందించడానికి దేశవ్యాప్తంగా 12400 మంది ప్రభావితమై దాదాపు 37 టన్నుల సీఓ2 ఉద్గారాలను తగ్గించగలిగారు. వారెవరు.. అదెలా సాధ్యమైందో తెలుసుకుందాం.

30% ఆదాయం

మీనూదేవిది ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా సిఖర్ గ్రామం. స్వయం ఉపాధిమార్గంగా పిండిగిర్నీ నడిపిస్తోంది. గిర్నీ కోసం డీజిల్ వాడేది. ఖర్చెక్కువ.. కాలుష్యమూ ఎక్కువే. ఇలా కాదనుకొని దానిని "డెవలప్‌మెంట్ ఆల్టర్‌నేటివ్స్" సంస్థ ద్వారా సౌరశక్తితో నడిచే యంత్రంగా మార్చింది. నిర్వహణ ఖర్చులు 70%కి తగ్గిపోయి ఆదాయం 30% పెరిగింది. ఇదే ఉత్సాహంతో సోలార్ దర్జీ యూనిట్‌ను ఏర్పాటుకు ప్రిపేరవుతోంది. తనతో పాటు మరింత మందికి ఉపాధి మార్గం చూపించాలనేది ఆమె ఆలోచన. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వల్ల పర్యావరణ సవాళ్లను అధిగమించొచ్చని మీనూదేవి అంటోంది.

లాభసాటి ఉపాధి

కమల విస్తర్ల తయారీ యూనిట్ నడుపుతోంది. మొదట్లో సాంప్రదాయ ఇంధనంతో ఈ యూనిట్ నడిచేది. గిరాకీ బాగానే అయ్యేది కానీ గల్లాపెట్టె ఎప్పుడూ ఖాళీగానే ఉండేది. ఇలా ఎందుకవుతుందీ అని ఆలోచన చేస్తే.. ఇంధన ఖర్చుల వల్లే అని తెలిసింది. ఇక అప్పటి నుంచి సోలార్ విద్యుత్ సాయంతో ఆమె తన విస్తర్ల యూనిట్‌ను నడిపిస్తోంది. సోలార్‌ను ఇంధన శక్తిగా మార్చుకున్నప్పటి నుంచి ఆమె వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వర్కర్లకు కూడా పనివేతనం పెంచి సాధికారత దిశగా అడుగులు వేస్తోంది.

ప్రపంచ‌బ్యాంక్ మాట

మీనూదేవి కావచ్చు.. కమల కావచ్చు. తమ చిరు వ్యాపార నిర్వహణలో అవగానతో ముందుకెళ్లడం వల్లనే విజయం సాధ్యమైంది. వీరిలో ఎంతోమంది మహిళలు వ్యాపారాల్లో లక్ష్యాలను చేరుకుంటున్నారు. వాతావరణాన్ని పరిరక్షిస్తూ వ్యాపారం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంక్ తన 2022 నివేదికలో పేర్కొన్నది. ఇదే ఫార్ములాతో ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకొని డెవలప్‌మెంట్ ఆల్టర్‌నేటివ్స్ సంస్థ ఉర్జా మండల సురక్షిత శక్తి కేంద్రం వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. స్వయం ఉపాధి పొందేవాళ్లకు ఇదెంతగానో ఉపయోగపడుతోంది.

117 కేంద్రాలు

ఉర్జా మండల్ స్కీమ్ ద్వారా మహిళలను శక్తి కార్యకలాపాల్లో.. ఆర్థిక నిర్వహణలో భాగస్వాములను చేస్తారు. అధునాతన.. ప్రత్యామ్నాయ వనరుల వినియోగం ద్వారా వ్యాపారం నడిపేలా ప్రోత్సహించి సాంకేతిక శిక్షణ ఇస్తారు. బ్యాంకు మద్దతు కూడా ఇప్పించి సోలార్ మైక్రోగ్రిడ్ మోడల్స్ ద్వారా పునరుత్పాదక శక్తి పరిష్కారాలను అందిస్తోంది. ఇలా యూపీ.. జార్ఖండ్‌లో 117 ప్రాథమిక కేంద్రాలు ఏర్పడ్డాయి. వీటిద్వారా 12,408 మంది లాభపడ్డారు. ఇప్పటివరకు 37 టన్నుల సీఓ2 ఉద్గారాలు తగ్గించబడ్డాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతీ సంవత్సరం 100 టన్నుల కంటే ఎక్కువ సీఓ2 తగ్గింపును సాధించగలదు.

గ్రీన్ ఇండియా కోసమే..

సక్సెస్ రేట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక నూనె నిక్షేప యూనిట్ ఉంది. దీని ద్వారా పచ్చళ్లు.. ప్లేట్ తయారీ యూనిట్స్ నడుస్తున్నాయి. వాటి వార్షికాదాయం సుమారు రూ.3–4 లక్షలు. వీటిలో 10-15 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వివిధ వస్తువులు తయారీ చేస్తారు. ఈ తయారీ కేంద్రాలు 10-15 కిలోవాట్ సామర్థ్యపు సౌరశక్తితో నడుస్తున్నాయి. శక్తి మార్కెట్లు అనే సేవా ఆధారితకేంద్రాలతో ఇవి నడుస్తున్నాయి. ఇలా గ్రీన్ ఇండియా కోసం గ్రేట్ మూవ్‌మెంట్‌ను భుజాల మీదేస్కున్నారు మహిళలు.

Next Story