- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానమ్మ.. తాతలు గాలిమోటర్ ఎక్కాలె.!
ఒక మనవడిగా చేసేదైమైనా ఉంటుందని ఆలోచించారా ఎప్పుడైనా.?

దిశ, ఫీచర్స్: మన అమ్మమ్మలు.. నానమ్మలు.. తాతయ్యలు జీవితాలను ఎంతో త్యాగం చేస్తే మనం ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం ఎంతో ఎత్తుకు ఎదిగి ఉండొచ్చు. సకల సౌకర్యాలు కలిగి ఉండొచ్చు. వాటన్నింటికి కారణం మన పెద్దవాళ్లే. బాధ్యతలన్నీ తీరిపోయి.. శేష జీవితాన్ని గడుపుతున్న అమ్మమ్మలు.. నానమ్మలు.. తాతలకు ఒక మనవడిగా.. మనవరాలిగా మనం చేసేదైమైనా ఉంటుందని ఆలోచించారా ఎప్పుడైనా.? అంకిత్‌లా ఇప్పుడాలోచించండి.
సడెన్ సర్‌ప్రైజ్..
విమానమెక్కాలని ఎవరికుండదు.? ఎప్పుడూ ఎక్కని వాళ్లకు అదొక కొత్త ప్రపంచం. హర్యానాకు చెందిన అంకిత్ అనే యువకుడు వాళ్ల తాత.. నానమ్మలకు ఒక మరిచిపోలేని అనుభూతి కలిగించాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్లంటే అంకిత్‌కు చాలా ప్రేమ. వాళ్లు లేనిదే తనకీ జీవితం లేదనుకునే మనస్తత్వం కలవాడు. ఎలాగోలా వాళ్లను విమానం ఎక్కించాలనుకున్నాడు. అదికూడా ముందస్తు సమాచారం లేకుండా. అలా బయటికి వెళ్లొద్దామని చెప్పి నేరుగా విమానాశ్రమానికి తీసుకొచ్చాడు. వాళ్లు ఆశ్చర్యపోయారు. అంతకు ముందెప్పుడు వాళ్లు విమానం ఎక్కలేదు. ఇక అంతర్జాతీయ ట్రిప్ ఊహకు కూడా అందదు.
కళ్లలో ఆనందం..
అంకిత్ తాత నాన్నమ్మలు విమానం ఎక్కిన స్వీట్ మెమొరీస్ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దానికి ''దాదీజీస్ ఫస్ట్ ఫ్లైట్'' అనే క్యాప్షన్ పెట్టాడు. ఇక ఆ వీడియో నెట్టింట్లో ఫుల్ వైరలైంది. ఆ వీడియోలో ఆ వృద్ధ దంపతులు ఎయిర్‌పోర్ట్ బయట నిలబడి ఉత్సాహంతో మాట్లాడుకుంటూ కనిపిస్తారు. వారి ముఖాల్లో కొంత ఆందోళన.. అంతకుమించి సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సర్‌ప్రైజ్ వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరవడమే కాదు.. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. వారి కళ్లలో ఆనందం చూస్తుంటే మా నానమ్మ.. తాత గుర్తుకొచ్చారు అని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
ఒతకరికొకరు పట్టుకుని..
ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగుపెట్టినప్పుడు అంకిత్ వాళ్ల తాత.. నానమ్మ ఒకరికొకరు చేతులు పట్టుకుని ముందుకు సాగారు. చుట్టూ ఉన్న రద్దీ.. ఆధునిక సౌకర్యాలు వాళ్లను ఆశ్చర్యపరిచాయి. విమానం ఎక్కేముందు ఎంతో ఉత్సాహంగా ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతారు. ఆ క్షణాలు వీడియోలో సజీవంగా కనిపిస్తాయి. వృద్ధాప్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఆ ఇద్దర్ని చూస్తే అర్థమైతుంది. నిజంగా సామాన్యులకు ఇలాంటి అనుభవాలు తమ జీవితాన్ని మరింత ఉల్లాసభరితంగా మారుస్తాయి. విమానంలో కూర్చున్నంక ఆనందం రెట్టింపైంది.
కిటికీలోంచి ఆకాశం..
విమానమెక్కాకే తెలిసింది వాళ్లు వెళ్లేది దుబాయ్ అనీ. కిటికీలోంచి ఆకాశ దృశ్యాలు అద్భుతంగా అనిపించింది. దుబాయ్ చేరుకున్నాక టాక్సీలో ప్రయాణం.. స్కై-హై ఇన్‌ఫినిటీ పూల్ నుంచి నగర దృశ్యాలు చూడటం వారి జీవితంలో మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి. మనవడితో గడిపిన ఈ సమయం వారికి అమూల్యమైంది. అంకిత్ షేర్ చేసిన వీడియోకు దాదాపు 30 లక్షల వ్యూస్.. 3.1 లక్షల లైక్‌లు వచ్చాయి. డబ్బు.. హోదా.. బిజీతో చాలామంది వాళ్ల గ్రాండ్ పేరెంట్స్‌ని పట్టించుకోరు. కొందరైతే వాళ్లను మనుషులుగానే చూడరు. అలాంటివాళ్లకు అంకిత్ ఒక గుణపాఠం చెప్పాడు.






