- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్‌గా ఫ్యూచర్ సిటీ
ఫ్యూచర్ సిటీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్.. దక్షిణాధి రాష్ట్రాలకు సెంటర్ పాయింట్‌గా.. హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయం.. పెరగనున్న రియల్ భూమ్

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక ఫ్యూచర్ సిటీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. హైస్పీడ్ హబ్‌గా తీర్చిదిద్ధాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు హై స్పీడ్ రైలు కనెక్టివిటీ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. హైదరాబాద్ - పూణే - ముంబై కారిడార్ డీపీఆర్ ఇప్పటికే పూర్తి కావడంతోపాటు చెన్నై వయా అమరావతి, బెంగళూరు సర్వే జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశానికి కేంద్రంగా మారనుండటంతో.. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగానికి చెందిన ఆఫీసులకు స్థలాలు కేటాయించారు. ప్రపంచంలోని ఫార్చూన్ కంపెనీలకు సంబంధించిన ఆఫీసులను కూడా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ ఏరియాలో రియల్ భూమ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
హై స్పీడ్ కారిడార్లు…
హైదరాబాద్ - పూణే - ముంబై హై స్పీడ్ రైల్వే కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే పూర్తయింది. ప్రాజెక్ట్ అమలు దశలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. మొత్తం 761 కి.మీ గల హైదరాబాద్ - ముంబై కారిడార్‌లో మొత్తం స్టేషన్లు 12.. అందులో 10 ఎలివేటెడ్, 2 అండర్గ్రౌండ్ ఉండనున్నాయి. వికారాబాద్ దగ్గర 4.6 కి.మీ టన్నెల్ నిర్మించే అంశం పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాన్ స్టాప్‌గా 2 గంటల 55 నిమిషాల్లో చేరొచ్చని అధికారులు చెబుతున్నారు. గంటకు 330కి.మీ స్పీడ్‌తో 3గంటల 21నిమిషాల్లో గమ్యస్థానం చేరుకునేలా హై స్పీడ్ రైల్లు మార్గాన్ని నిర్మించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ - అమరావతి - చెన్నై కారిడార్‌పై సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతోపాటు భారత్ ఫ్యూచర్ సిటీ - బెంగళూరు కారిడార్‌లో మన్ననూర్ సోమశిల ప్రాంతాలను కలుపుతూ కారిడార్ డిజైన్ చేశారు.
ఇప్పటికే కార్పొరేట్ ఆఫీసులు…
ఫ్యూచర్ సిటీని కార్పొరేట్ కంపెనీలకు అడ్డాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ ఆథారిటీ(ఎఫ్సీడీఏ) ఆఫీసు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌కు సైతం శంకుస్థాపన చేశారు. సింగరేణి కార్పొరేట్ ఆఫీసుకు 10 ఎకరాల స్థలం కేటాయించారు. త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం) ఆఫీసుకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వీటితోపాటు ప్రపంచంలో 500 పేరు మోసిన కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ఆఫీసులను సైతం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన ఆఫీసులు హైదరాబాద్‌లో 85 మాత్రమే ఉన్నాయి. కానీ ఫ్యూచర్ సిటీలో 500 ఫార్చూన్ కంపెనీలకు సంబంధించిన ఆఫీసులను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.






