బ్రెయిన్ స్ట్రోక్‌‌ గురించి బెంగొద్దు..‘అల్ట్రాసౌండ్ హెల్మెట్‌’ వచ్చేసింది!

by B.Srinivas |   (  Updated:2026-01-22 12:09:48  IST  )

బ్రెయిన్ స్ట్రోక్‌ కు సులభమైన చికిత్స అందించేందుకు ‘అల్ట్రాసౌండ్ హెల్మెట్‌’ను జార్జియా శాస్త్రవేత్తలు తయారు చేశారు.

బ్రెయిన్ స్ట్రోక్‌‌ గురించి బెంగొద్దు..‘అల్ట్రాసౌండ్ హెల్మెట్‌’ వచ్చేసింది!
X

దిశ, ఫీచర్స్: బ్రెయిన్ స్ట్రోక్‌ చికిత్సలో మరో అద్భుతమైన సాంకేతిక పరికరం ఆవిష్కతమైంది. రక్తం గడ్డకట్టడమే బ్రెయిన్ స్ట్రోక్‌కు ప్రధాన కారణం కాగా.. ఆ గడ్డలను వేగంగా కరిగించే ‘అల్ట్రాసౌండ్ హెల్మెట్‌’ను జార్జియా టెక్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. స్ట్రోక్ అటాక్ చేసినప్పుడు ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా, బ్రెయిన్‌లో బ్లడ్‌ను వేగంగా రీస్టోర్ చేయడంలో ఈ పరికరం సహాయపడుతుంది. ఈ హెల్మెట్‌లో సుడిగాలిలా మెలితిరుగుతూ ఉండే అల్ట్రాసౌండ్ తరంగాలను తల లోపలికి పంపించి, రక్తం గడ్డలపై ఒత్తిడిని కలిగించి, వాటిని విచ్ఛిన్నం చేస్తారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ‘సోనోథ్రాంబోలిసిస్’ అంటారు. ప్రస్తుతం ఉన్న సాధారణ చికిత్స పద్ధతుల కంటే ఇది 64% వేగంగా గడ్డకట్టిన బ్లడ్‌ను కరిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఎలా పనిచేస్తుంది?
హెల్మెట్ నుంచి వెలువడే అల్ట్రాసౌండ్ తరంగాలు Sonothrombolysis ప్రక్రియ ద్వారా నేరుగా బ్లడ్ క్లాట్ అయిన చోటికి వెళ్తాయి. దీనితోనే తలలోకి చిన్న మైక్రోబబుల్స్‌ను పంపిస్తారు. అల్ట్రాసౌండ్ తరంగాలు ఈ బబుల్స్‌ను తాకగానే అవి వేగంగా కదలుతూ గడ్డకట్టిన రక్తాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాడీలోకి ఎలాంటి పరికరం పంపకుండానే ప్రక్రియ పూర్తవుతుంది. పాత పద్ధతుల ద్వారా గడ్డను కరిగించడానికి పట్టే సమయం కంటే ఈ వోర్టెక్స్ పద్ధతి ద్వారా 40 శాతం టైమ్ తగ్గుతుందని ల్యాబ్ పరిశోధనల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ అల్ట్రాసౌండ్ వల్ల మెదడు కణజాలం వేడెక్కే ప్రమాదం ఉంటుందని, అందుకే తరంగాలను గ్యాప్ తీసుకుంటూ పంపించనున్నారు. రక్తం గడ్డ ఎంతవరకు కరిగింది, రక్త ప్రసరణ మళ్ళీ మొదలైందా లేదా అనేది డాక్టర్లు స్క్రీన్ మీద ప్రత్యక్షంగా చూస్తారు.

గోల్డెన్ అవర్:
స్ట్రోక్ వచ్చిన మొదటి కొన్ని గంటలను ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఆ సమయంలో సరైన చికిత్స అందకపోతే మనిషి ప్రాణాలకు ప్రమాదం. బ్లడ్ బబుల్స్‌ను కరిగించకపోతే మెదడు కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. కాబట్టి మందుల కంటే వేగంగా ఈ హెల్మెట్ పనిచేస్తుంది కాబట్టి రోగి ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో ఈ హెల్మెట్లను అంబులెన్స్‌లలోనే అందుబాటులోకి తెస్తే, ఆసుపత్రికి వెళ్లే లోపే చికిత్స ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రయోగం చివరి దశలో ఉంది. జంతువులపై విజయవంతమైంది. మరికొన్ని రోజుల్లో మనుషులపై ప్రయోగాలు చేసి మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

Next Story