- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Success Story : ఆడపిల్లకు తగదన్నారు. కానీ ఆమె..!
ఇప్పటికే 2018, 2022లో సత్తాచాటిన గీతికా తలుక్దార్ ప్రస్తుతం మూడవసారి కూడా మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ కవరేజీకి సెలెక్ట్ అవ్వడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

దిశ, ఫీచర్స్ : ‘అసలే ఆడపిల్లవి. నువ్వు ఎంచుకున్న మార్గం సరైంది కాదు. వేరే ఏదైనా కెరీర్ ఎంచుకో’ బంధువులు, చుట్టు పక్కలవాళ్లు ఎవరి నోట విన్నా ఇదే సలహా. కానీ ఆమె తన నిర్ణయం మార్చుకోలేదు. ఎక్కడైతే నువ్వు రాణించలేవని పురుషాధిక్య సమాజం వేలెత్తి చూపుతుందో అక్కడే అక్కడే తన సత్తా చాటాలని ఫిక్స్ అయింది. ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు వేసి సక్సెస్ అయింది. నువ్వు చేయగలవా? అని సందేహాలు వ్యక్తం చేస్తూ నిరాశ పరచిన వారి నుంచే.. ఇప్పుడు నవ్వు ఏదైనా చేయగలవనే ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఎవరు ఆమె? ఏమిటా సక్సెస్ జర్నీ!
పేరు గీతికా తలుక్దార్. అస్సాం రాష్ట్రానికి చెందిన మహిళా స్పోర్ట్స్ జర్నలిస్ట్. 2026 ఫిఫా(FIFA) వరల్డ్ కంప్ కవర్ చేయడానికి భారత దేశం నుంచి ఎంపికైన ఏకైక ఉమన్ ఫొటోగ్రాఫర్ కూడా కావడంతో అందరూ ఆమె గురించి చర్చించుకుంటున్నారు. పురుషులు మాత్రమే ఎక్కువగా కనిపించే ఫొటోగ్రఫీ వృత్తిలోకి, అది కూడా స్పోర్ట్స్ ఫొటో జర్నలిస్ట్ కెరీర్‌లోకి అడుగు పెట్టడమే కాకుండా, సమాజం అంచనాలకు భిన్నంగా సత్తా చాటుతున్న గీతిక ఇప్పుడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.
ఆ ప్రేరణతో ముందుకు..
నిజానికి గీతికా తలుక్దార్ అరుణాచల్ ప్రదేశ్‌లో జన్మించింది. ఆమె తండ్రి ఉద్యోగం (ట్రాన్స్‌ఫరబుల్ జాబ్) కారణంగా బాల్యంలో భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో గడిపింది. చివరికి 2001లో ఆమె కుటుంబం అస్సాంకు తిరిగి వచ్చింది. తండ్రి ఉద్యోగం ఏ ప్రాంతానికి బదిలీ అయితే ఆ ప్రాంతానికి గీతిక కుటుంబం షిఫ్ట్ అయ్యేది. ఈ నేపథ్యంలో ఆమె అస్సాంలోని డూమ్ డూమాలో కూడా కొంతకాలం ఉండాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు డ్యాన్స్, సింగింగ్‌పట్ల ఆసక్తితో వాటిని నేర్చుకున్నది. అయితే ఆమె గ్రాండ్ అంకుల్ లేట్ చంద్ర తలుక్దార్ ప్రఖ్యాత చిత్ర నిర్మాత, దర్శకుడు కావడం, చిన్నప్పటి నుంచే ఫోటోగ్రఫీ & ఫిల్మ్ పనులు చూస్తూ పెరగడం వంటి కారణాలవల్ల గీతికా తలుక్దార్‌లో కూడా ఫోటోగ్రఫీ పట్ల ఆకర్షణ పెరిగింది. ఆమె స్పోర్ట్స్ ఫొటో గ్రాఫర్ కెరీర్‌లోకి ప్రవేశించడానికి ఇదే ముఖ్యమైన ప్రేరణ.
సవాళ్లు ఎదురైనా..
ప్రస్తుతం గీతికా తలుక్దార్ సుమారు వయసు 40 ఏళ్లు. ఒక మహిళా స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా తన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను అధిగమించాను అంటోంది. ఒకసారి ఆమె గ్రౌండ్‌లో స్పోర్ట్స్ కవరేజీకి వెళ్లింది. అక్కడ చెలరేగిన వివాదం, ఘర్షణతో ఈమెకు సంబంధం లేకపోయినా ఒక గుంపుప వచ్చి ఆమె కవరేజీని అడ్డుకునే ప్రయత్నంలో కెమెరాను పగలగొట్టింది. మరోసారి ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కిందపడి మోకాళ్లకు తీవ్ర గాయాలై మూడు నెలలపాటు నడవలేని పరిస్థితి ఏర్పడుంది. అయినా ఆమె తన ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోలేదు. ఎంచుకున్న వృత్తిని వదులుకోవాలనుకోలేదు. ఆ సమయంలో చాలామంది ‘మహిళలకు స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ సరైన వృత్తి కాదు’ ఎంతకైనా మంచిది సేఫ్‌గా ఉండాలంటే దానిని వదుకోవడం బెటర్ అని పలువురు సలహాలు ఇచ్చారు.
ఆడపిల్లకు అవసరమా!
మీ కూతురు ఎంచుకున్న మార్గం సురక్షితమైనది కాదని, అయినా ఆడపిల్లకు అవసరమా, ఇది ఆమెకు తగదని గీతిక తల్లిదండ్రులకు సైతం వాళ్ల బంధువులు తరచుగా చెప్పేవారు. అయినా గీతిక తన లక్ష్యం మార్చుకోలేదు. కోలుకున్న తర్వాత మళ్లీ ప్రారంభించింది. 40 మంది పురుష ఫొటోగ్రాఫర్ల మధ్య ఒకే ఒక మహిళగా కెమెరాతో నిలబడేది. కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఇలా తన 19 ఏళ్ల అనుభవంతో గీతికా తలుక్దార్ ఒలింపిక్స్, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఫిఫా విమెన్స్ వరల్డ్ కంప్ వంటి పెద్ద పెద్ద క్రీడా ఈవెంట్లను కవర్ చేసింది. అంతేకాదు 2026 FIFA వరల్డ్‌కప్‌ను కవర్ చేయడానికి భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళా ఫోటోగ్రాఫర్‌గా ఆమె నిలిచారు.
నేటి మహిళలకు స్ఫూర్తి..
ఇప్పటికే 2018, 2022లో సత్తాచాటిన గీతికా తలుక్దార్ ప్రస్తుతం మూడవసారి కూడా మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ కవరేజీకి సెలెక్ట్ అవ్వడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అస్సాంలోని ఒక సాధారణ బాలిక నుంచి ఫుట్‌బాల్ ప్రపంచంలోని అతిపెద్ద వేదిక వరకు ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు నేటి మహిళలకు ఎంతో స్ఫూర్తి. సమాజం అంచనాలకు భిన్నంగా ఒక మహిళ ఏదైనా సాధించగలదనే సందేశాత్మక ప్రేరణ అంటున్నారు నిపుణులు, స్త్రీ వాదులు.






