- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందనంత ఎత్తులో పేదల డాక్టర్ గణేష్.!
సుప్రీంకోర్టు దాకా కొట్లాడి.. మెడికల్ ఆఫీసర్‌గా నియమితుడై తన కలను నిజం చేసుకున్నాడు

దిశ, ఫీచర్స్: ప్రజాసేవ చేయాలంటే గొప్ప మనసుండాలిగానీ.. శారీరక ఎత్తు కాదు. డాక్టరంటే ఆరు ఫీట్ల ఎత్తుండాలి.. మొఖం మెరుస్తూ ఉండాలనే రూల్సేంలేవు కదా.? గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు చెందిన మూడడుగుల ఎత్తున్న డాక్టర్ గణేష్ బరైయా కథే దీనికి నిదర్శనం. సుప్రీంకోర్టు దాకా కొట్లాడి.. మెడికల్ ఆఫీసర్‌గా నియమితుడై తన కలను నిజం చేసుకున్నాడు ఈ డాక్టర్ సాబ్.
పట్టుదలతో పయనం..
2018లో గణేష్ ఎంబీబీఎస్ ప్రవేశానికి అర్హత సాధించాడు. కానీ గణేష్ మూడడుగుల ఎత్తున్నాడు. 20 కిలోల కంటే తక్కువ బరువున్నాడు. 72శాతం లోకోమోటివ్ వికలాంగత్వా్న్ని కలిగివున్నాడు. వీటిని సాకుగా చూపి అప్పటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గణేశ్ ఎలిజిబిలిటీని నిరాకరించింది. "అరే.. ఇ౦త చిన్నగున్నవ్.. నువ్వేం డాక్టర్ చేస్తవ్ వయా" అని అవమానించారు. ఆ నిరాకరణ గణేష్‌ను వెనక్కి నెట్టేసింది. సమాజంలో నుంచి వెలివేసినంత పనిచేసింది. కానీ గణేష్ అదరలేదు.. బెదరలేదు. "ఎన్ని ఆటంకాలొచ్చినా నేను డాక్టర్ అయ్యితీరుతా" అని సవాల్ చేసి ఆత్మస్థయిర్యంతో ముందుకెళ్లాడు.
పోరాటం ఫలించి..
గణేష్ వాళ్లది రైతుకూలీ కుటుంబం. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించి పోరాటం చేసేందుకు కోర్టులో కేసు వేసేంత పైసల్లేవ్. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వస్తారు కదా.. తన స్కూల్ హెడ్మాష్టర్ రూపంలో సాయం అతడి తలుపుతట్టింది. ఆయనపేరు డాక్టర్ దలపత్‌భాయ్ కటారియా. తన విద్యార్థి అయిన గణేష్‌కు ఆర్థికంగా.. మానసికంగా అండగా నిలబడ్డాడు. కోర్టునే నమ్ముకున్నాడు గణేష్. ముందుగా గుజరాత్ హైకోర్టులో కేసేశాడు. అక్కడ కూడా నిరాకరణే. ఈసారి సుప్రీంకోర్టుకెక్కాడు. కేసు వాదించి వాదించి మొత్తానికి తన పోరాటం ఫలించింది. "ఎత్తు తక్కువుంటే డాక్టరవొద్దా" అని తీర్పువచ్చింది.
అతి చిన్న ఎత్తున్న వైద్యుడు..
2019లో భావ్‌నగర్ మెడికల్ కాలేజీలో గణేష్ చేరాడు. సాధారణ విద్యార్థులెక్కే బెంచీల అవసరం లేకపోయినా.. పట్టుదల మాత్రం తగ్గలేదు. రాత్రింబవళ్లు కష్టపడి చదువు.. క్లినికల్ రొటేషన్స్.. ఇంటర్న్‌షిప్.. అన్నీ పూర్తిచేశాడు. ఈ ఏడాది డాక్టర్ డిగ్రీని అందుకుని.. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చిన్న ఎత్తున్న డాక్టరుగా గుర్తింపు పొందే అవకాశం కూడా గణేష్‌కు ఉంది. తన లక్ష్యం పేద ప్రజలకు చికిత్స అందించడం అంటున్నాడు గణేష్. ఎత్తును అసలు సమస్యగానే చూడకుండా వృత్తిరీత్యా సంతృప్తితో సాగిపోతున్నాడు.
పేదొళ్ల డాక్టరై..
గణేష్ డాక్టర్‌ను మొదటిసారి అతన్ని చూసినప్పుడు రోగులు ఆశ్చర్యపోయారు. "గింత బుడ్డ డాక్టరేం చేస్తడ్రో" అని మొఖమ్మీదనే అనేవాళ్లు చాలాసార్లు. కానీ క్రమంగా అతడి గొప్ప మనసు ఏంటో తెలిసిపోయింది. తనకు ఇప్పుడు వాళ్లంతా రోగులు కాదు.. స్నేహితులు. గణేష్‌తో మాట్లాడితే ఎవరైనా ఆత్మీయులైపోవాల్సిందే. ముందే తాను అనుకున్నట్లుగా పేదొళ్లకు నమ్మకమైన డాక్టరైపోయాడు గణేష్. ఎత్తు మూడడుగులే అయినా అతని పట్టుదలు.. ధైర్యం.. మానవత్వం అందనంత ఎత్తులో ఉన్నాయి. అడ్డంకులు ఎంత పెద్దవైనా ఆత్మవిశ్వాసం.. కృషి ఉంటే మార్గం సుగమం అవుతుందని నిరూపించాడు గణేష్.






