పుట్టిన 5 రోజుల్లోనే మంచి - చెడు ‘స్కాన్’ చేసేస్తున్న శిశువులు..! అధ్యయనంలో వెల్లడి

by Javid Pasha |   (  Updated:2025-11-22 06:07:17  IST  )

పుట్టిన 5 రోజుల నుంచే శిశువులు తమను ఎత్తుకునే, తమను టచ్ చేసే, తమవైపు చూసే వ్యక్తులను తదేకంగా పరిశీలించడం ద్వారా ఎవరు ఎలాంటి వారు అనే అంచనాకు రావడాన్ని నేర్చుకుంటారు.

పుట్టిన 5 రోజుల్లోనే మంచి - చెడు ‘స్కాన్’ చేసేస్తున్న శిశువులు..! అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా? ఇంకా మాటలు రాని చిన్న పిల్లలు కూడా కొందరిని చూస్తే ఏకబిగిన ఏడుస్తుంటారు. ఎంతకీ మానరు. మరి కొందరిని చూస్తే నవ్వుతారు. ఉత్సాహంతో కేరింతలు కొడతారు. ఇంకొందరిని చూస్తే అమ్మ ఒడిలో దాక్కుంటారు. భయం భయంగా చూస్తారు. కారణమేంటో తెలుసా? పిల్లలు కూడా అవతలి వ్యక్తులు ఎలాంటివారోనని గుర్తించి ఒక అంచనాకు రావడమేనట. ఈ ఏడాది జులైలో యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, అలాగే యూనివర్సిటీ ఆఫ్ కటానియాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది.

అధ్యయనం ప్రకారం.. పుట్టిన 5 రోజుల నుంచే శిశువులు తమను ఎత్తుకునే, తమను టచ్ చేసే, తమవైపు చూసే వ్యక్తులను తదేకంగా పరిశీలించడం ద్వారా ఎవరు ఎలాంటి వారు అనే అంచనాకు రావడాన్ని నేర్చుకుంటారు. మాటలు రాకపోయినప్పటికీ తమ హావభావాలు, చేతల ద్వారా ఆయా వ్యక్తులపట్ల ఫీలింగ్స్ వ్యక్త పరుస్తారు. తమకు ఎవరు సురక్షితమో, ఎవరు ప్రమాదకరమో గుర్తిస్తారు. దయతో, ప్రేమగా ప్రవర్తించే వ్యక్తుల వైపే ఆకర్షితులవుతారు. కఠినంగా లేదా అనీజీగా అనిపించే వాళ్లను గుర్తించి ఏడవడమో, వారివైపు చూడకపోవడమో వంటివి చేస్తుంటారు. ఇది పూర్తిగా శిశువుల్లో జన్మతః వచ్చిన సహజమైన జీవన పరిరక్షణ ప్రవృత్తిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్నారుల మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా, వాళ్లు చుట్టూ జరిగే ప్రతీ చిన్న విషయాన్ని గమనిస్తూ, మనసులో నమోదు చేసుకుంటారు. ఎవరి గొంతు మృదువుగా ఉంది, ఎవరి ముఖంలో ఆప్యాయత కనిపిస్తోంది, ఎవరు హఠాత్తుగా కోపంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేయడం ద్వారా ఏడాదిలోపు శిశువులు కూడా అవతలి వ్యక్తులపట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story