- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి.!
ఆ మెమొరీయే ఎంతో మధురంగా ఉంది

దిశ, ఫీచర్స్: స్నేహం.. ఒక అమూల్యమైన బహుమతి. 90లలో అదొక కళాత్మక స్పర్శతో కొనసాగేది. ఇప్పుడంతా డిజిటల్ సౌలభ్యంతో నడుస్తోందిగానీ.. అప్పట్లో ఫ్రెండ్‌షిప్ గుండెలో చిగురించే ఒక అనుభూతి. ఆ గ్రీటింగ్స్.. ఆ ఉత్తరాలు.. పైసల్లేకున్నా కొనిపెట్టే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ ఆహా.. ఆ మెమొరీయే ఎంతో మధురంగా ఉంది.
అంతా దోస్తులే..
స్నేహం.. ఒక స్వచ్ఛమైన అనుబంధం. అప్పట్లో సాంకేతికత పరిమితంగా ఉండటంతో స్నేహితుల మధ్య సంబంధం ఎక్కువగా ముఖాముఖి సంభాషణలతో సాగేది. స్కూల్ కారిడార్లలో గుసగుసలు, ఆట స్థలంలో క్రికెట్, సైకిల్ తొక్కుతూ ఊరంతా తిరిగిన రోజులు, సాయంత్రం కలిసి టీ తాగుతూ గడిపిన గంటలు ఇవన్నీ 90ల స్నేహానికి ప్రాణం పోసేవి. ఫోన్ కాల్స్ చాలా అరుదు ఎందుకంటే ల్యాండ్‌లైన్ ఫోన్లు అందరి ఇళ్లలో ఉండేవి కావు. అందుకే స్నేహితులు ఒకరినొకరు కలిసేవాళ్లు. స్కూల్, కాలేజీ అయిపోయిందంటే జామ కాయలకు, మామిడి పండ్లకు, సీతాఫలాల కోసం అడవిబాట పట్టేవాళ్లు. అదేందో ఏమో. ఇంట్లో గంట, అర్ధగంట మాత్రమే ఉండేది. మిగతా టైమంతా దోస్తుగాళ్లతోనే గడిచేది. చీకటి పడినంకనే ఇంటికి వెళ్తుండె.
ఆశగా ఎదురుచూపులు
ఇప్పటిలా ఊరొకక హైస్కూల్ లేదప్పుడు. ఒక రెండు మూడు ఊర్లకు కలిపి ఒక ఊరిలో హైస్కూల్ ఉండేది. అట్లా.. ఒకే ఊరివాళ్లతో కాకుండా నాలుగైదు ఊర్ల పిల్లలతో స్నేహం ఏర్పడేది. కొత్త కొత్త విషయాలు తెలిసేవి. రెండూర్లు దాటి స్కూల్‌కు వెళ్లాలి కాబట్టీ.. పొద్దున ఎనిమిదింటికే సైకిళ్లు స్టార్ట్ చేసుకొని చౌరస్తా దగ్గర గుమిగూడేవాళ్లు. అందరూ రాగానే అదేదో సైకిల్ యాత్ర తీసినట్లు 20-25 సైకిళ్లు ఒకేసారి వెళుతుంటే మస్తు మజా వచ్చేది. ఫ్రెండ్షిప్ డే వస్తుంది అనంగనే కొందరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొచ్చేవాళ్లు. ఇక అమ్మాయిలైతే అందరికీ కాకుండా లిమిటెడ్ మిత్రులకే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేవాళ్లు. అలా ఇస్తున్నప్పుడు "అరే నాకేరా నాకేరా" అని చెప్పుకుంటూ ఆశగా ఎదురుచూస్తుండె.
ఉత్తరంలో దోస్తాన్..
కొందరు ఫ్రెండ్స్ మధ్యలోనే వేరే స్కూల్‌కి షిఫ్ట్ అయ్యేవాళ్లు. అప్పుడైతే మస్తు బాధయ్యేది. వాళ్లు వెళ్తూ స్కూల్ లేదా హాస్టల్ అడ్రస్ ఇచ్చి వెళ్లేవాళ్లు. ఫ్రెండ్షిప్ డే వస్తుంది అనంగనే వారం రోజులు ముందు అసొంటి దోస్తుగాళ్లకు ఉత్తరాలు రాస్తుంటిమి. "ప్రియమైన స్నేహితుడా.. నేనిచట కుశలమే.. నువ్వూ కుశలమేనా" అని ఉత్తరాల ద్వారా ఫ్రెండ్‌షిప్ గొప్పదనాన్ని చాటుకునేది. ఒక్కరి పేర్లుగూడ మిస్ కాకుండా అందరిపేర్లు గుర్తుచేసి యోగక్షేమాలు తెలుసుకునేది. ఒక్కో స్నేహితుడికి ప్రత్యేకంగా రాసిన ఉత్తరంలో జ్ఞాపకాలు, ఆ బంధం గురించిన భావాలు, కొన్నిసార్లు హాస్యం కూడా ఉండేవి. ఆ ఉత్తరాలు చదివినప్పుడు కలిగే ఆనందం గుండెలో చిగురించే ఆప్యాయత.. స్నేహానికి ప్రత్యేక సౌందర్యాన్ని తీసుకొచ్చేవి.
ఫ్రెండ్‌షిప్ అంటే గ్రీటింగ్స్..
గ్రీటింగ్ కార్డుల హవా కూడా కొంతకాలం సాగింది. వారం రోజుల ముందు నుంచే ఫ్రెండ్‌షిప్ గ్రీటింగ్ కార్డుల సెలక్షన్ జరిగేది. దీనికోసం టీచర్లు కూడా షరతులతో కూడిన స్కూల్ ఎగ్గేట్టే అవకాశాలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడంతా సోషల్ మీడియా దోస్తాన్ నడుస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లు, వీడియో కాల్స్ వంటివెన్నో వచ్చాయి. వాట్సాప్‌లో ఒక మెసేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్, లేదా ట్విట్టర్‌లో ఒక ట్వీట్ వంటివన్నీ ఇప్పటి స్నేహానికి సంకేతాలు. ఫ్రెండ్‌షిప్ డే అంటే సోషల్ మీడియాలో ట్యాగ్‌లు, స్టోరీలు, ఎమోజీలతో కూడిన శుభాకాంక్షలు అంతే. కానీ అప్పట్లో వ్యక్తిగత స్పర్శ ఉండాల్సిందే. కాలేజీకి వెళ్లే టైంలో అయితే వే2ఎసెమ్మెస్ ద్వారా అందరికీ ఒకేసారి ఫ్రెండ్షిప్ మెసేజ్ పంపిస్తుంటిమి. ఇప్పుడవన్నీ, ఆ నాటి ఫ్రెండ్స్.. ఫ్రెండ్షిప్ యాదికొస్తే దిల్ ఖుషీ ఐతుంది.






