- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిన్న సండే కదా.?
బయటకు వెళ్లే ఉంటారు.
రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లే ఉంటారు.
ఫుడ్ ఆర్డర్ విషయంలో కామన్‌గా ఏంచేస్తాం.?
మళ్లీ మళ్లీ ఏం చెప్తాం అని మెనూ మొత్తం ముందే చెప్పేస్తాం.
తర్వాత ఏమవుతుంది..?
ఆర్డర్ చేసిన దాంట్లో సగం కూడా అయిపోకముందే కడుపు నిండిపోతుంది.
మిగతా ఫుడ్ అంతా పెంట పాలే ఇగ.
ఇలాంటివి చూసీ చూసీ విసిగిపోయిన ఓ ఇద్దరు యువకులు వ్యర్థాలకు సరికొత్త అర్థం చెప్తున్నారు.
లెట్స్ ఫాలో..!!
- దిశ, ఫీచర్స్
అంతా వృథా..
ఇప్పుడు ఎంత చిన్న కార్యమైనా దావత్ చేయడం పక్కా. ఎంతమంది వస్తుండొచ్చు అని లెక్కలేసుకొని విందు భోజనం వండిస్తారు. ఫంక్షన్ ఎంత బాగా చేశారనేది విందు భోజనం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ, వచ్చినవాళ్లు అన్నీ తింటారా.? అక్కడున్న అన్ని వెరైటీలను టేస్ట్ చేయాలనే జిహ్వ చాపల్యంతో అదింత ఇదింత పెట్టుకొని ఏదీ పూర్తిగా తినకుండానే చెత్త డబ్బాలో పడేస్తారు. సగం ఆహారం వృథా అయ్యేది ఇలాగే. సేమ్ ఇదే సిచువేషన్ రెస్టారెంట్లలో కూడా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు. అనుకున్న స్థాయిలో కస్టమర్లు రాకపోవడంతో చాలావరకు ఆహారం మిగిలిపోతుంది. ఇక మిగిలిదాన్నంతా బయట పారేస్తారు. అంటే అదంతా పెంట పాలే. ఈ వ్యర్థాలతో పర్యావరణం ఎంత పాడవుతుందో ఆలోచిస్తామా.?
గుడ్ టు గ్రాబ్ స్టార్టప్
ఆహార వ్యర్థాలతో పర్యావరణం ఎలా కలుషితమవుతుందనేది మనం ఆలోచించం. కానీ ఇద్దరు యువకులు ఆలోచించారు. రెస్టారెంట్లలో చేసే ఓవర్ ఆర్డర్లు, మిగిలిన ఆహార వ్యర్థాలను రెస్టారెంట్ యాజమాన్యాలు ఏం చేస్తారు.? ఎంత నిర్లక్ష్యంగా వీటిని బయటకు వదలుతారు. అనేది అధ్యయనం చేశారు. ప్రతీయేటా మిలియన్ టన్నుల కొద్దీ ఆహారం వృథాగా మారిపోతుందని తెలుసుకున్నారు. దీనికో పరిష్కారం చూపించాలనుకొని గుడ్ టు గ్రాబ్ అనే స్టార్టప్‌ను స్థాపించారు హైదరాబాద్‌కు చెందిన ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, సాయి కిషోర్. ఒక యాప్ ద్వారా ఆహారం వృథాగా కాకుండా కాపాడుతున్నారు. గుడ్ టు గ్రాబ్ ద్వారా ఐదు మెట్రిక్ టన్నులకు పైగా ఆహారాన్ని వ్యర్థాలుగా మారకుండా కాపాడారు.
హాఫ్ ప్రైస్ మీల్ ఐడియా
రెస్టారెంట్లలో మిగులు ఆహారాన్ని పర్యావరణ దృక్కోణం నుంచి ఆలోచించారు గుడ్ టు గ్రాబ్ నిర్వహకులు. రుచికరమైన, తాజా ఆహారం గిరాకీ లేకుండా మిగిలిపోతే ఎవరికైనా బాధనిపిస్తుంది. వేల రూపాయల నష్టం వస్తుంది. ఇలా రెస్టారెంట్ల యజమానులు బాధపడకుండా.. అటు పర్యావరణం పాడవకుండా హాఫ్ ప్రైస్ మీల్ ఐడియాతో రెస్టారెంట్ల నుంచి ఆ ఘుమఘుమలాడే తాజా ఆహారాన్ని వీరు తీసుకుంటారు. దాన్ని టేక్ అవేల ద్వారా కస్టమర్లకు అందజేస్తున్నారు. ఇలా10000కు పైగా ప్లేట్ల ఆహారం వృథా కాకుండా కాపాడుతున్నారు. 50% తగ్గింపుతో రెస్టారెంట్లలోని తాజా ఆహారాన్ని అందిస్తున్నారు. టన్నులకొద్ది ఆహారాన్ని వృథా కాకముందే కాపాడుతున్నారు.
ఐడియా ఎలా వచ్చింది.?
శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి హైదరాబాద్‌లో రెస్టారెంట్ ఉండేది. అయితే దినాం ఎంతో ఆహారం మిగిలిపోయేది. మిగులు ఆహారాన్ని వృథా చేయొద్దనే ఉద్దేశంతో ఫుడ్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసేవారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు, ఆశ్రమాలకు డొనేట్ చేసేవారు. కాకపోతే లాజిస్టికల్ అడ్డంకులు, అధిక రవాణా ఖర్చులు వంటి సవాళ్లు ఎదురయ్యేవి. ఆహారం వృథా కావద్దు అని ఎంత తాపత్రయం ఉన్నా చాలా వరకు చెత్తబుట్టలో పారేయాల్సి వచ్చేది. సంవత్సరంలోపే చాలా అనుభవం వచ్చింది. ఆ తర్వాత కొవిడ్ మహమ్మారి వల్ల వ్యాపారం దెబ్బతిని ఔట్‌లెట్‌లను మూసేయాల్సి వచ్చింది. తర్వాత పైచదువుల కోసం యూకే వెళ్లాడు శ్రీకాంత్. అప్పుడు తన బాల్యమిత్రుడైన సాయితో రెస్టారెంట్లలో మిగులు ఆహారాన్ని సగం ధరకు కొనుగోలు చేసే ఐడియా వచ్చింది.
కస్టమర్లకు.. రెస్టారెంట్లకు
యూకే నుంచే స్టార్టప్‌ను రన్ చేయాలనుకున్నారు. కానీ అలా సాధ్యంకాకపోవడంతో 2024లో ఇండియాకు తిరగివచ్చి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నడిపిస్తున్నారు. గుడ్ టు గ్రాబ్ రెస్టారెంట్లకు, కస్టమర్లకు మధ్య వారధిగా పనిచేస్తోంది. రెస్టారెంట్లు తమ మిగులు ఆహార జాబితా వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. అక్కడి నుంచి కస్టమర్లు లభ్యత ఆధారంగా తమ ఆర్డర్లను ఉంచుతారు. కొనుగోలుదారులు తమ ఆర్డర్ సిద్ధంగా ఉన్నప్పుడు సమాచారం అందుకొని దానిని రెస్టారెంట్ నుంచి నేరుగా తీసుకుంటారు. రెస్టారెంట్లకు వచ్చి తినడం కాకుండా టేక్ అవేలపై దృష్టిపెట్టడం అన్ని విధాల మంచిది. ఆహారం వృథాగా పారేయడం వల్ల మీథేన్ వాయువు విడుదలయ్యి వాతావరణం కాలుష్యమవుతుంది.
80 రెస్టారెంట్లు
గుడ్ టు గ్రాబ్ యాప్ ద్వారా 80కి పైగా రెస్టారెంట్లు టై అప్ అయ్యాయి. హైదరాబాద్‌లో 40000 మంది వినియోగ దారులున్నారు. వీరిద్వారా 10000కి పైగా ఆహారాన్ని వృథాగా కాకుండా యాప్ నియంత్రిస్తోంది. అయితే ఏ రెస్టారెంట్ పడితే దానిని వీరు చేర్చుకోరు. నాణ్యతను పాటించే పేరున్న రెస్టారెంట్లను మాత్రమే చేర్చుకొని వ్యర్థాలకు కొత్త అర్థాన్ని చెప్తున్నారు.
ఫౌండర్స్ ఫెస్ట్ అవార్డు
స్టార్టప్ మొదలుపెట్టిన సంవత్సరంలోపే 40000 మంది కస్టమర్లను సంపాదించుకోవడం, 10000 ప్లేట్లకుపైగా ఆహారాన్ని వృథా కాకుండా కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గుడ్ టు గ్రాబ్‌కు 2024 ఫౌండర్స్ ఫెస్ట్ సస్టెయినబుల్ అవార్డు వచ్చింది. తక్కువ సమయంలోనే సస్టెయినబిలిటీ అవార్డుతో సత్కారం జరగడం సంతోషంగా ఉందని నిర్వహకులు అన్నారు.






