పాత జ్ఞాపకాల లోగిలి.. మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమరీ!

by Javid Pasha |

ప్రతీ వస్తువు, ప్రతీ జ్ఞాపకం, ప్రతీ ఆలోచన అక్కడ చిత్రాల రూపంలో, అక్షరాల రూపంలో అందంగా ఒదిగిపోతాయి.

పాత జ్ఞాపకాల లోగిలి.. మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమరీ!
X

దిశ, ఫీచర్స్ : ప్రాపంచిక పరిణామాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, రచనలు, సామాజిక సంఘటనలు వంటివి మాత్రమే మనం పుస్తకాల రూపంలో చూస్తుంటాం. మ్యూజియంలలో వారి తాలూకు ఆనవాళ్లను దర్శిస్తుంటాం. కానీ సాధారణ వ్యక్తుల వ్యక్తిగత ఆసక్తులు, అలవాట్లు, కుటుంబ జీవిత చరిత్రలు, జ్ఞాపకాలు వంటి వాటికి కూడా అటువంటి స్థానం కల్పిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచించారు ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా అనే ఇద్దరు స్నేహితురాళ్లు. దీనిని ఆచరణలో పెట్టేందుకు 2017లో ‘మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమరీ’ అనే ఒక ప్రాజెక్టును ప్రారంభించారు.

ఏమిటీ మ్యూజియం?

సాధారణంగా మన ఇళ్లల్లో కుటుంబ చరిత్ర పుస్తకాల్లో కాకుండా అల్మారాల్లో, ఫ్రేమ్ చేయబడిన ఫొటోలల్లో, టేబుల్ కింద డ్రాయర్లలో లేదా వారసత్వ వస్తువుల రూపంలో, జ్ఞాపకాల రూపంలో దాగి ఉంటుంది. ఉదాహరణకు చనిపోయిన నానమ్మ వాడిన కూరగాయలు తరిగే కత్తిపీఠ, తాతయ్య వాడిన చేతికర్ర, రెండు మూడు తరాలకు సంబంధించిన ఫొటో ఆల్బమ్, ముత్తాత వ్యసాయ పనుల్లో వాడిన మోట బొక్కెన వంటివన్నీ వారసత్వంగా భద్రపరుస్తూ వస్తుంటారు. అయితే నేటి బిజీలైఫ్‌లో కొంతకాలానికి ఆ జ్ఞాపకాలు చెదిరిపోవచ్చు. దీంతో మరో తరం వారికి తెలిసే అవకాశం లేకుండా పోవచ్చు. అలా జరగకూడదంటే.. వాటన్నింటినీ డిజిటల్ పుస్తక రూపంలో భద్ర పర్చడమే చక్కటి మార్గమని భావించారు ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా. అందుకోసమే వారు museumofmaterialmemory.com. అనే డిజిటల్ వేదికను స్థాపించారు.

వారసత్వ వైభవాల వేదిక..

ఆంచల్, నవధా 2017లో ప్రారంభించిన మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమరీ అనేది ఒక క్రౌడ్ సోర్డ్స్ డిజిటల్ ఆర్కైవ్ అని చెప్పొచ్చు. భారత ఉపఖండం నుంచి వచ్చిన సాధారణ వారసత్వ వస్తువులు, ఫొటోలు, పురాతన వస్తువులు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, కుటుంబాల చరిత్రలు, సామాజిక-సాంస్కృతి కథలను భద్రపరడమే దీని లక్ష్యం. అంటే ఇది ప్రజల జ్ఞాపకాలను భద్రపరిచే డిజిటల్ ప్లాట్‌ఫామ్ రూపంలో ఉన్న మ్యూజియం అని చెప్పవచ్చు. అయితే ఇందులోని కథలు కేవలం మ్యూజియం ఆఫ్ మెటీరియల్ వ్యవస్థాపకులు ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా మాత్రమే రాసినవి కావు. ఆసక్తిగల ప్రజలే తమ కథలను, కుటుంబ చరిత్రలను, వస్తువుల తాలూకు జ్ఞాపకాలను కథల రూపంలో భ్రదపరచమని వివరంగా రాసి మెయిల్ చేస్తుంటారు. అలా పంపినవారితో కమ్యూనికేట్ అయి వాటిని మరింత మెరుగు పరిచి డిజిటల్ మ్యూజియంలో భద్ర పరుస్తుంటారు ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా.

వందలాది కథలు..

మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమరీ అనే డిజిటల్ ఆర్కైవ్‌లో ప్రస్తుతం 200కు పైగా కథలు ఉన్నాయి. బర్మీస్ క్రొకడైల్ శిల్పం నుంచి ఎంబ్రాయిడరీ చేయబడిన టేబుల్ క్లాత్ వరకు, నానమ్మ అల్లికల సామగ్రి నుంచి అమ్మవాడిన కుట్టు మెషిన్ వరకు ఇలా ప్రతీ వస్తువు, ప్రతీ జ్ఞాపకం, ప్రతీ ఆలోచన ఇక్కడ చిత్రాల రూపంలో, అక్షరాల రూపంలో అందంగా ఒదిగిపోతాయి. కుటుంబం, రోజువారి జీవితం, ప్రేమ, కాలంతోపాటు వచ్చిన మార్పులు, వాడిన వస్తువులు, కోల్పోయిన గత వైభవాలు వంటివన్నీ ఇక్కడ చూడవచ్చు.. చదవచ్చు. ఇక్కడ ఉండే సాధారణ వస్తువుల ద్వారా అసాధారణ జీవితాలు బయటపడుతుంటాయి. ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంటాయి. భావాలు, భావోద్వేగాలను నింపుతుంటాయి. హృదయాంతరాలను స్పృశిస్తూ మానవ సంబంధాల గొప్పతనాన్ని వర్ణిస్తుంటాయి. అద్భుతమైన జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంటాయి. నైతిక విలువలను సైతం బోధిస్తుంటాయి.

వ్యవస్థాపకుల గురించి..

మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమరీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అయితే దీనిని స్థాపించింది మాత్రం ఇద్దరు మహిళలు. వారే ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా. ఇందులో ఆంచల్ మల్హోత్ర న్యూఢిల్లీకి చెందిన వారు. ప్రముఖ ఓరల్ హిస్టోరియన్, రచయిత్రి & ఆర్టిస్ట్. పార్టిషన్ (1947) చరిత్రను మెటీరియల్ ఆబ్జెక్టుల(వారసత్వ వస్తువులు) ద్వారా చెప్పడంలో ప్రత్యేకత సాధించారు. ఇక నవధా మల్హోత్ర విషయానికి వస్తే ఈమె సోషల్ ఇంపాక్ట్& డెవలప్‌మెంట్ కన్సల్టెంట్. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సోషియాలజీ BA, లండన్ SOAS నుంచి MA చేశారు. పబ్లిక్ హెల్త్, క్లైమేట్ ఇష్యూస్, సెరామిక్స్ ఆర్ట్‌లో కూడా పని చేస్తారు. అయితే ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా ఇద్దరూ హైస్కూల్ ఫ్రెండ్స్ కూడాను.

Next Story