Sparrow's nests : పిచ్చుక గూళ్లు.. పల్లె ఒడిలో పరవశింపజేసిన మధుర జ్ఞాపకం !

by Javid Pasha |

Sparrow's nests : పిచ్చుక గూళ్లు.. పల్లె ఒడిలో పరవశింపజేసిన మధుర జ్ఞాపకం !

Sparrows nests : పిచ్చుక గూళ్లు.. పల్లె ఒడిలో పరవశింపజేసిన మధుర జ్ఞాపకం !
X

దిశ, ఫీచర్స్ : కాలం ఎవరికోసమూ ఆగదు. తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ప్రకృతి కూడా అంతే ప్రపంచం తలకిందులైనా తన ధర్మం తాను నిర్వర్తిస్తూనే ఉంటుంది. అందుకే కాలం తెచ్చిన మార్పులతోపాటు కొన్ని జ్ఞాపకాలను సైతం మానవులు ఒడిసి పట్టుకుంటూ ఉంటారు. ప్రకృతి పరిణామాల నేపథ్యంలో అందమైన అనుభవాలను నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతారు. అలాంటి అందమైన జ్ఞాపకాల అరలో ‘పిచ్చుక గూళ్లు(Sparrow's nests) కూడా ఉన్నాయండోయ్.. ముఖ్యంగా 90 కిడ్స్‌ బాల్యంలో అవో మరుపు రాని మధుర జ్ఞాపకం.

నిజంగా ఆ రోజులు ఎంత బాగుండేవి కదూ.. వసంత రుతువులోనో, వానా కాలంలోనో ఏ చెరువు గట్టుమీద చెట్టు కిందనో, పొలం వద్ద కొట్టంలనో కూర్చుంటే ఒంటరిగా ఉన్నామనే ఫీలింగే కలిగేది కాదు. ఎందుకంటే పక్షుల కిల కిల రావాలు వినిపించేవి. చెట్ట కొమ్మమీదనో, కొట్టం చూరుకిందనో ఒక్కో గడ్డి పరకను పట్టుకొచ్చి సుతారంగా గూడును అల్లుతూ తన సొంతింటి కలను నెవరేర్చుకునే ఊర పిచ్చుకలను చూస్తూ మురిసిపోయేవాళ్లం. వర్షాకాలంలో.. అంటే జూన్ నుంచి ఆగష్టు వరకు కూడా పిచ్చుకలు, అవి గూళ్లు కట్టుకునే దృశ్యాలు కనువిందు చేసేవి. వాటిని అలా చూస్తూ ఉంటే అసలు పొద్దు ఎలా గడిచేదో కూడా అర్థం కాకపోయేది.

ఆ రంగు రంగల ఊరపిచ్చుకలు, అవి నిర్మించే అల్లి బిల్లి గూళ్లు ఎల్లప్పుడూ చూస్తూ గడిపిన కాలం బాల్యం, ఒకప్పటి గ్రామీణ జీవితం, అందమైన పల్లె వాతావరణం క్రమంగా దూరమైపోతోంది నేడు చాలా మందికి. పొద్దున్న లేస్తే చాలు రణగొణ ధ్వనుల శబ్దాలతో, రాత్రైతే వెలుగులు వెదజల్లే కరెంటు బల్బుల కృత్రిమ కాంతులతో నగర జీవితమంతా నరకప్రాయమే ఒక విధంగా. ఏమాటకామాట చెప్పాలె కానీ ఆ రోజులే బాగుండేవి. అందమైన ఆకాశ హార్మ్యాలు ఎన్నుంటేనేమీ ఈ నగర జీవితాల్లో. చెట్ల కొమ్మలపై, ఇళ్ల చూరుల్లో పిచ్చుక గూళ్ల దృశ్యం మచ్చుకు కానరాదు. పల్లె తల్లి ఒడిలో పిచ్చుకగూళ్లను చూస్తూ ఆనందంతో పరవశించిపోయిన యాది మదిని తడుముతుంటే.. ఆ రోజులే బాగుండె అనిపిస్తుంది ఎవరికైనా. ఆ ఊర పిచ్చుకల శబ్దాలు, పచ్చని చెట్ల కొమ్మలపై, ఇండ్ల చూరులపై అవి అల్లిన అల్లిబిల్లు గూళ్లు ఇప్పుడు మదిలో పొదిగిన చెక్కు చెదరని అందమైన జ్ఞాపకాలు.

Next Story